Nayattu: ఈ వేట.. కీలుబొమ్మలాట

‘జోజి’లాంటి థ్రిల్లర్‌తో ఆకట్టుకున్న మలయాళీ సినిమా మరోసారి అదిరిపోయే క్రైమ్‌ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. పాలన వ్యవస్థలోని లోపాలను పొరలు

Updated : 16 May 2021 10:20 IST

ప్రేక్షకాలమ్‌

సినిమా: నాయట్టు; భాష: మలయాళం; విడుదల: 2021; దర్శకుడు: మార్టిన్‌ ప్రక్కట్‌; స్క్రీన్‌ప్లే: షాహి కబీర్‌; సంగీతం: విష్ణు విజయ్‌; తారాగణం: జోజు జార్జ్, కుంచాకో బోబన్, నిమిషా సజయన్‌; నిడివి: 2 గంటలు; ఎక్కడ చూడొచ్చు: నెట్‌ఫ్లిక్స్‌

‘జోజి’లాంటి థ్రిల్లర్‌తో ఆకట్టుకున్న మలయాళీ సినిమా మరోసారి అదిరిపోయే క్రైమ్‌ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. పాలన వ్యవస్థలోని లోపాలను పొరలు పొరలుగా విప్పి చూపుతూనే.. రాజకీయ నాయకుల చేతిలో వ్యవస్థలు ఎలా కీలుబొమ్మలుగా మారాయో కళ్లకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు. ‘నాయట్టు’ అంటే అర్థం వేట. సమాజంలో నేరస్థులను వేటాడే పోలీసులను సొంత డిపార్ట్‌మెంట్‌ వారే వేటాడే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో పోలీసులుగా నటించిన ముగ్గురు నటీనటులు ఆ పాత్రల్లో ఒదిగిపోయారు. ఇందులో సునీతగా చేసిన నిమిషా సజయన్‌ ‘ది గ్రేట్‌ ఇండియన్‌ కిచెన్‌’ చిత్రంతో పురుషాధిక్య కుటుంబంలో వంటగదిలో చితికిపోయే మహిళగా నటించి మెప్పించారు. జోజు జార్జ్‌ కూడా జోసెఫ్‌(2018) సినిమాలో తాగుబోతు పోలీసుగా చేసిన నటనకు ప్రశంసల వర్షం కురిసింది. ‘చోళ’, ‘హలాల్‌ లవ్‌ స్టోరీ’, ‘ట్రాన్స్‌’ లాంటి మలయాళ సినిమాల్లోనూ మెరిసిన ఆయన చార్లీ, చోళ సినిమాల నిర్మాణంలో పాలు పంచుకున్నాడు. ‘అంజమ్‌ పాథిర’ లాంటి సూపర్‌ థ్రిల్లర్‌లో నటించిన కుంచాకో బోబన్‌ ఇందులో యువ పోలీసు ఆఫీసర్‌గా నటించి మెప్పించాడు.

కథ: కేరళలో ఎన్నికల సమయం అది. ప్రవీణ్‌ మైఖేల్‌(బోబన్‌) అప్పుడే పోలీసు స్టేషన్‌లో విధుల్లో చేరతాడు. ఏఎస్‌ఐగా మనియన్‌(జోజు జార్జ్‌), కానిస్టేబుల్‌ సునీత అక్కడే పనిచేస్తుంటారు. ఓ సామాజిక వర్గానికి చెందిన యువనాయకుడితో ప్రవీణ్, మనియన్‌లు వాగ్వాదానికి దిగుతారు. ఓ రోజు ఫంక్షన్‌కి ముగ్గురు వెళ్లొస్తుంటారు. ఆ వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి ఆక్సిడెంట్‌ చేసి అక్కడినుంచి పారిపోతాడు. అక్కడ ప్రమాదానికి గురైన వ్యక్తి చనిపోతాడు. ఆయన ఎవరో కాదు. పోలీసు స్టేషన్‌లో గొడవకు దిగిన వ్యక్తికి దగ్గరి బంధువు. ఆ వ్యక్తి సామాజిక వర్గానికి చెందిన వారంతా ఆందోళనకు దిగడంతో ఈ కేసు రాజకీయ రంగు పులుముకుంటుంది. ఏ సంబంధం లేని వీరి ముగ్గురిని ఉచ్చులో పడేసేందుకు ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయని తెలుసుకున్న మనియన్‌ మిగతా ఇద్దరితో కలిసి పోలీసు స్టేషన్‌ నుంచి పరారవుతాడు. దీంతో వేట మొదలవుతుంది. సొంత డిపార్ట్‌మెంట్‌ వారే వీరిని వెంటాడుతూ పట్టుకునే ప్రయత్నం చేస్తారు. మరి వీరు ముగ్గురు ఆ కేసులోంచి బయటపడ్డారా? పోలీసులకు చిక్కారా లేదా? వీరి జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయన్నది మిగతా కథ.

కట్టుదిట్టమైన స్క్రీన్‌ప్లే: థ్రిల్లర్‌ సినిమాలకు స్క్రీన్‌ప్లేనే ప్రధాన బలం. అదెంత పకడ్బందీగా ఉంటే చిత్రం అంతగా రక్తికడుతుంది. ఈ సినిమాకు బిగిసడలని స్క్రీన్‌ప్లేను రాసుకున్నాడు రచయిత షాహి కబీర్‌. పోలీసు స్టేషన్‌ నుంచి పరారయ్యాక పెద్దగా కథేమీ ఉండదు. పోలీసులు వీరిని వేడాటడం. వారి నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేయడమే సినిమాలో ఎక్కువ శాతం ఉంటుంది. అయినా ప్రేక్షకుడికి బోర్‌ కొట్టనీయకుండా కథనం ముందుకు నడిపించడమే కాదు.. ప్రేక్షకుడిని కుర్చీ అంచున కూర్చొబెట్టేలా అల్లుకోవడం ప్రశంసనీయం. కుటుంబ సభ్యులతో ఈ ముగ్గురికి ఉండే అనుబంధం. వారిని తలుచుకుంటూ వచ్చే సన్నివేశాలు భావోద్వేగానికి గురి చేస్తాయి. అడక్కుండానే ఓ చోట సునీతకోసం శానిటరీ ప్యాడ్స్‌ను తెచ్చి ఇచ్చే సన్నివేశం ద్వారా పోలీసులెంత సున్నిత మనస్కులో చూపించాడు. పతాక సన్నివేశాల్లో వచ్చే మలుపు షాక్‌కి గురిచేస్తుంది. సరైన ముగింపు అంటూ ఏదీ ఇవ్వకుండా ప్రేక్షకులకే వదిలేసి వారిని ఆలోచనలో పడేస్తాడు దర్శకుడు మార్టిన్‌. విష్ణువిజయ్‌ అందించిన నేపథ్యం సంగీతం కథనంలోని బలాన్ని మరింత పెంచింది.

అంధ మహిళ ఓటుతో.. కళ్లు తెరిపించి పోలీసులైనా, ప్రజలైన రాజకీయ నాయకుల చేతుల్లో కీలుబొమ్మలే అని ఈ సినిమాతో చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. సొంత రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసులను వాడుకునే విధానం, అందుకోసం ఎలాంటివారినైనా బలి చేయడానికి సిద్ధమవడం ఆలోచనలో పడేస్తుంది. ఓ ప్రమాదాన్ని రాజకీయ కోణంగా మలుచుకొని, దాంతో ప్రయోజనాలను పొందాలనుకునే ఓ వర్గం, ఆ మచ్చ రాకూడదని అమాయకులను ఇరికించాలని ప్రయత్నించే అధికార పార్టీ చర్యలతో వ్యవస్థ ఎంత స్వార్థపూరితమైందో..ఎంతటి కుళ్లుతో నిండిపోయిందో వివరంగా చూపించాడు దర్శకుడు. కనీస విచారణ జరపకుండా వీరి ముగ్గురిని దోషులుగా చిత్రించే ప్రయత్నం చేయడాన్ని బట్టి బయటకు కనిపించేదంతా న్యాయం కాదని చెప్పకనే చెప్పాడు దర్శకుడు. సినిమా చివరన ఓ సన్నివేశంలో అంధ వృద్ధురాలిని ఎన్నికల కేంద్రానికి తీసుకొచ్చి తనకు నచ్చిన పార్టీకి ఓటేయించుకుంటాడు ఓ వ్యక్తి. మనమంతా రాజకీయ నాయకుల చేతిలో కీలుబొమ్మలమే అని దర్శకుడు సింబాలిక్‌గా అలా చెప్పాడనిపిస్తుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని