‘సోల్‌’మేట్‌ చెప్పే పాఠం

యానిమేటెడ్‌ చిత్రాలను తెరకెక్కించడంతో పాటు వాటితో కలెక్షన్లు, అవార్డులు కొల్లగొట్టడంలో పిక్సర్‌ సంస్థకు తిరుగులేదు. 2002 నుంచి యానిమేటెడ్‌ సినిమాలకు ఆస్కార్‌ ఇవ్వడం ప్రారంభించారు. ఇప్పటివరకు మొత్తం 20...

Published : 01 May 2021 10:41 IST

ప్రేక్షకాలమ్‌

సినిమా: సోల్; దర్శకుడు : పీట్‌ డాక్టర్‌;విడుదల: 2020, నిడివి: గంట 40 నిమిషాలు; ఎక్కడ చూడొచ్చు : డిస్నీ హాట్‌ స్టార్‌; విశేషం: బెస్ట్‌ యానిమేటెడ్‌ చిత్రంగా ఆస్కార్‌

యానిమేటెడ్‌ చిత్రాలను తెరకెక్కించడంతో పాటు వాటితో కలెక్షన్లు, అవార్డులు కొల్లగొట్టడంలో పిక్సర్‌ సంస్థకు తిరుగులేదు. 2002 నుంచి యానిమేటెడ్‌ సినిమాలకు ఆస్కార్‌ ఇవ్వడం ప్రారంభించారు. ఇప్పటివరకు మొత్తం 20 అవార్డుల్లో పదకొండింటిని పిక్సర్‌ సంస్థే తన ఖాతాలో వేసుకుంది. చిత్రం కోసం ఎంచుకునే కథ, కథనాలు, సినిమా నిర్మాణ విలువలు అలా ఉంటాయి మరి. ‘ఫైండింగ్‌ నీమో’లో పిల్ల చేప కోసం వెతుక్కుంటూ వెళ్లే తల్లి చేప కథైనా, ‘వాల్‌ ఈ’ లో జీవంలేని రోబోలతో వలపును పండించడంలోనైనా వారికి వారే సాటి. కదిలే బొమ్మలతో మనసు గెలుచుకున్న సినిమాలెన్నో తీసిందా సంస్థ. ఇప్పుడు జీవితపరమార్థాన్ని కనుక్కునే ఓ మ్యూజిక్‌ టీచర్‌ కథతో తెరకెక్కిన సోల్‌ చిత్రంతోనూ   ప్రేక్షకులను మెప్పించారు. ఎప్పటిలాగే ఆస్కార్‌ నీ ఎగరేసుకుపోయారు. 93వ అకాడెమీ వేడుకల్లో ఆస్కార్‌ గెలిచిన సందర్భంగా ‘సోల్‌’ చిత్ర విశేషాలు మీకోసం...

‘అప్‌’(2009), ‘ఇన్‌ సైడ్‌ ఔట్‌’(2015)లతో ఆస్కార్‌ అందించిన దర్శకుడు పీట్‌ డాక్టర్‌ తెరకెక్కించిన మూడో సినిమా ‘సోల్‌’. గతేడాది కరోనా కారణంగా థియేటర్లలోకి రాలేకపోయిన వాల్ట్‌ డిస్నీ దీన్ని నేరుగా ఓటీటీల్లో విడుదల చేసింది. ఇందులోని కథ, యానిమేషన్, సంగీతాలకు విమర్శకుల నుంచి ప్రశంసలు   కురిశాయి. ఆఫ్రికన్‌-అమెరికన్‌ని ప్రధాన పాత్రగా యానిమేషన్‌ చిత్రాన్ని పిక్సర్‌ సంస్థ రూపొందించడం ఇదే తొలిసారి. యానిమేషన్‌ అనగానే ఏదో చిన్నపిల్లలు చూసే సినిమా అనుకుంటాం... కానీ ఇందులో లోతైన తాత్వికతను వినోదాత్మకంగా చెప్పి... పురస్కారాన్నిఅందుకున్నారు.

కథ: జో గార్డెనర్‌.. న్యూయార్క్‌లోని ఓ పాఠశాలలో స్కూల్‌ టీచర్‌. జాజ్‌ సంగీతంలో అంతర్జాతీయంగా పేరొందాలనేది అతని చిరకాల కోరిక. ఆ అవకాశమే ఆయన్ను చేరుతుంది. విలియమ్స్‌ అనే ప్రముఖ జాజ్‌ కళాకారిణి బృందంలో పియానో వాయించే అవకాశం వస్తుంది. ఇదే సమయంలో పాఠశాలలో శాశ్వత ఉపాధ్యాయుడిగానూ పదోన్నతి దక్కుతుంది. సురక్షితమైన జీవితం, సరిపడా సంపాదన వచ్చే అవకాశాన్ని వదిలేసి తన కల కోసం పరిగెడతాడు జో. విలియమ్స్‌ బ్యాండ్‌లో అవకాశం వచ్చిందనే ఆనందంలో ఎగరి గంతులేస్తుంటాడు. ఈ క్రమంలోని ప్రమాదవశాత్తు ఓ మ్యాన్‌ హోల్‌లో పడిపోవడంతో.. తన శరీరం నుంచి ఆత్మ వేరవుతుంది. అలా శరీరం నుంచి విడివడిన జో ఆత్మ తిరిగి కలుస్తుందా..? తన చిరకాలకోరికను నెరవేర్చుకుంటాడా లేదా? ఈ క్రమంలో ఎట్లాంటి పరిణామాలు జరిగాయన్నది మిగతా కథ.

ఆత్మ అందించే వినోదం.. సినిమాలో మ్యూజిక్‌ టీచర్‌ తర్వాత అంతగా మెప్పించే పాత్ర సోల్‌-22. దీనికి ఈ పేరు పెట్టడం వెనక ఓ ప్రత్యేక కారణం ఉంది. పిక్సర్‌ నిర్మించిన 22వ చిత్రం ‘సోల్‌’. అందుకు గుర్తుగానే ఆ పేరుపెట్టారు. మ్యాన్‌ హోల్‌లో పడ్డాక కోమాలోకి జారుకుంటాడు జో గార్డెనర్‌. ఇతని ఆత్మ.. సోల్‌-22 ఆత్మతో కలుస్తుంది. ఈ రెండు ఆత్మల ప్రయాణం, అల్లరి, రెండింటి మధ్య మాటలు, సన్నివేశాలు... వినోదాత్మకంగా సాగుతాయి. ఆద్యాంతం ఆకట్టుకుంటాయి. ‘ప్రతిక్షణాన్ని ఆస్వాదించు.. జీవితంలో మనం ఏదో ఒకటి సాధించడానికో, ఏదో ఒక లక్ష్యం నెరవేర్చడం కోసమో పుడతాం. నిజమే కానీ అదే జీవితమైపోకూడదు’’ అని జో పాత్ర ద్వారా చెబుతారు.

ప్రతీ క్షణాన్ని ఆస్వాదించు.. జాజ్‌ సంగీతంలో ఉన్నత శిఖరాలను అందుకోవాలనుకునే జో... జీవితాన్ని అనుభవించడం మరిచిపోతాడు. సంగీతం తప్ప ఇంకేది ముఖ్యమైన విషయంగా భావించడు. ‘‘లైఫ్‌ అంటే అది కాదు... గెలుపోటములకు అతీతంగా జీవన ప్రయాణంలోని ప్రతి మలుపును, క్షణాన్ని ఆస్వాదించడమే జీవితం. ఎదురయ్యే ప్రతి ఫలితాన్ని, స్వాగతిస్తూ ముందుకు సాగిపోవాలి. ప్రణాళికలు మారొచ్చు, లక్ష్యాలు మారొచ్చు.. దానివల్ల బతుకు అప్రయోజనమని భావించొద్దు. వీచే గాలిని, సాయంత్రపు నడక, స్నేహితులతో చెప్పుకొనే కబుర్లు, కప్పు కాఫీలోని మాధుర్యం ఇలా ప్రతిదాన్ని ఆస్వాదిస్తూ పోవడమే జీవిత పరమార్థం’’ సినిమాతో చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు పీట్‌ డాక్టర్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని