Oscar Nominations: ‘రైటింగ్‌ విత్‌ ఫైర్‌’.. భారతీయ సినీ ప్రియులకు ఊరటనిచ్చిన చిత్రం!

ఈ ఏడాది భారతీయ సినిమా ‘ఆస్కార్‌’ బరిలో నిలుస్తుందని సినీ అభిమానులంతా భావించారు. తమిళ నటుడు సూర్య ‘జై భీమ్‌’, మలయాళ నటుడు మోహన్‌లాల్‌ ‘మరక్కార్‌’ అకాడమీ అవార్డుకు షార్ట్‌లిస్ట్‌ అవటంతో మురిసిపోయారు.

Published : 09 Feb 2022 01:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ ఏడాది భారతీయ సినిమా ‘ఆస్కార్‌’ బరిలో నిలుస్తుందని అభిమానులంతా భావించారు. తమిళ నటుడు సూర్య ‘జై భీమ్‌’, మలయాళ నటుడు మోహన్‌లాల్‌ ‘మరక్కార్‌’ అకాడమీ అవార్డుకు షార్ట్‌లిస్ట్‌ అవటంతో మురిసిపోయారు. మార్చి 27న జరగనున్న 94వ ఆస్కార్‌ పురస్కారాల నామినేషన్లను ప్రకటించడానికి కొన్ని గంటల ముందు హాలీవుడ్‌ వర్గాలు ‘జై భీమ్‌’ గురించి ఎక్కువగా ప్రస్తావించటంతో ఇండియన్‌ సినిమాకు ఈసారి ఆస్కార్‌ ఖాయం అనుకున్నారు. కానీ, తుది జాబితా ప్రకటనతో నిరాశ చెందుతున్నారు. ఆస్కార్‌ 2022కి సంబంధించి వివిధ కేటగిరీల్లో పోటీపడే చిత్రాలు, నటులు తదితర జాబితాను అకాడమీ మంగళవారం ప్రకటించింది. ఇందులో ఆ రెండు చిత్రాలకూ చోటు దక్కలేదు. అయితే ఉత్తమ డాక్యుమెంటరీ కేటగిరిలో ‘రైటింగ్‌ విత్‌ ఫైర్‌’ చిత్రం నామినేట్‌ అవడం సినీ అభిమానులకు కాస్త ఊరట కలిగించింది.

ఇది కథ కాదు..

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ‘కబర్‌ లెహరియాని’ అనే పత్రికకు పనిచేసే మహిళా రిపోర్టర్లపై తెరకెక్కించిన చిత్రమిది. దళిత మహిళలైన వారు ఎన్నో ఏళ్లుగా అన్నీ తామై ఆ పత్రికను ఎలా నడిపిస్తున్నారో ఇందులో కళ్లకు కట్టినట్టు చూపించారు. ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లలోని లింగవివక్ష ఆధారంగా వార్తలు ఎలా రాస్తుంటారు? కులవివక్షను తట్టుకుని వార్తల్ని ఎలా సేకరిస్తుంటారు? ప్రచురించి పాఠకులకు ఎలా అందిస్తుంటారు? అనే అంశాలు ఎంతో ఉత్కంఠగా సాగుతూ ప్రేక్షకుల హృదయాల్ని హత్తుకుంటాయి. ఎంతోమంది అత్యాచార, గృహహింస బాధితుల నుంచీ ఎన్నో విస్తుపోయే విషయాల్ని సేకరించి ఈ చిత్రాన్ని తీశారు. స్వీయ నిర్మాణంలో సుస్మిత్‌ ఘోష్‌, రింటూ థామస్‌ ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్‌కు దర్శకత్వం వహించారు. వారే ఎడిటర్‌గానూ పనిచేశారు. ఛాయాగ్రహణం: సుస్మిత్‌ ఘోష్‌, కరణ్‌ థాప్లియాల్‌, సంగీతం: తజ్డార్‌ జునైద్‌, ఇషాన్‌ ఛబ్ర. 2021 జనవరి 30న ఈ చిత్రం ప్రేక్షకుల్ని పలకరించింది. ఎన్నో అత్యుత్తమ అవార్డులను అందుకుంది. ఇప్పుడు ఆస్కార్‌ బరిలో నిలిచి భారతీయులు గర్వపడేలా చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని