Oscars: ఆస్కార్‌ బరి... వీళ్లకు తొలిసారి

అందరిలాగే వీళ్లూ ఆస్కార్‌ కల కన్నారు. విచిత్రంగా అందరికీ తొలిసారే ఆ కల నెరవేరే అవకాశం దక్కింది. ఇదంతా 95వ ఆస్కార్‌ రేసులో ఉత్తమ నటుడు విభాగంలో నామినేషన్‌ దక్కించుకున్న ఐదుగురు నటుల గురించే.

Updated : 12 Mar 2023 18:31 IST

ఉత్తమ నటుడు ఎవరు?

అందరిలాగే వీళ్లూ ఆస్కార్‌ కల కన్నారు. విచిత్రంగా అందరికీ తొలిసారే ఆ కల నెరవేరే అవకాశం దక్కింది. ఇదంతా 95వ ఆస్కార్‌ రేసులో ఉత్తమ నటుడు విభాగంలో నామినేషన్‌ దక్కించుకున్న ఐదుగురు నటుల గురించే. ఇందులో 27 ఏళ్ల పాల్‌ మెస్కల్‌ నుంచి 73 ఏళ్ల బిల్‌ నైజీ వరకూ పోటీ పడుతున్నారు. చివరికి పురస్కారం ఎవరిని వరించినా అందరూ తమ పాత్రలకు మాత్రం మంచి ప్రశంసలు అందుకున్నవారే.

* అమెరికన్‌ గాయకుడు, నటుడు ఎల్వీస్‌ ప్రెస్లీ జీవిత కథలో ఒదిగిపోయారు అమెరికన్‌ నటుడు ఆస్టిన్‌ రాబర్ట్‌ బట్లర్‌(31). ఆ నటనే ఆయన్ని 95వ ఆస్కార్‌ రేసులో నిలిపింది. ఆయన ఈ పాత్రకుగాను గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డును గెలుచుకున్నారు. బట్లర్‌ యుక్త వయస్సులోనే టెలివిజన్‌ ధారావాహికలు ‘ది క్యారీ డైరీస్‌’, ది షన్నారా క్రానికల్స్‌’ లో నటించి మంచి గుర్తింపును పొందారు. ‘ఏలియన్స్‌ ఇన్‌ ది అట్టిక్‌(2009)’ చిత్రంతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు బట్లర్‌. చికాగో ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌లో మోస్ట్‌ ప్రామిసింగ్‌ పెర్ఫార్మర్‌ అవార్డును సొంతం చేసుకున్నారు.


* ‘ది బన్షీస్‌ ఆఫ్‌ ఇనిషెరిన్‌’ చిత్రంలో పాడ్రాయిక్‌ పాత్రతో మెప్పించి నామినేషన్‌
దక్కించుకున్నారు కోలిన్‌ జేమ్స్‌ ఫారెల్‌(46). ఇద్దరు మిత్రుల బంధం గురించి తెలియజేసే ఈ చిత్రంలో ఫారెల్‌ పాత్ర వారి స్నేహాన్ని కాపాడుకొనే ప్రయత్నంలో ఎన్నో పరిణామాలను ఎదుర్కొంటారు. ఇందులో ఆయన నటనకు మంచి ప్రశంసలు అందుకున్నారు. ఫారెల్‌ ‘ది వార్‌ జోర్‌ (1999)’ సినిమాతో తన కెరీర్‌ని ప్రారంభించారు. ‘టైగర్‌ ల్యాండ్‌(2000), మైనారిటీ రిపోర్ట్‌(2002)’ లాంటి ఎన్నో బ్లాక్‌ బస్టర్‌ చిత్రాల్లో ప్రధాన పాత్రలు పోషించారు. బ్లాక్‌ కామెడీ చిత్రం ‘ఇన్‌ బ్రూగెస్‌’లో ఆయన పాత్రకి ఉత్తమ నటుడిగా గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డును గెలుచుకున్నారు. ఐరిష్‌ టైమ్స్‌ 2020లో ఐర్లాండ్‌ ఐదవ అత్యుత్తమ చలనచిత్ర నటుడిగా ఫారెల్‌ను పేర్కొంది.


* హాస్య చిత్రాలతో గుర్తింపు పొందిన అమెరికన్‌ నటుడు బ్రెండన్‌ జేమ్స్‌ ఫ్రేజర్‌(54) ఈసారి ఉత్తమ నటుడి రేసులో నిలిచారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి యుక్తవయస్సులో ఉన్న తన కుమార్తెతో బంధాన్ని ఏర్పరచుకోవాలని ప్రయత్నించే నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘ది వేల్‌’. ఈ చిత్రంలో ఉపాధ్యాయుడి పాత్రను పోషించి అందర్నీ ఆకట్టుకున్నారు. ఆయన ‘డాగ్‌ ఫైట్‌’ సినిమాతో మొదలుకొని ‘ఎన్సినో మ్యాన్‌, స్కూల్‌ టైస్‌, జార్జ్‌ ఆఫ్‌ ది జంగిల్‌’ లాంటి సినిమాలలో ప్రధాన పాత్రలను పోషించారు. ‘ది వేల్‌’ చిత్రంలోని నటనకు ఫ్రేజర్‌ ఉత్తమ నటుడిగా 12 అంతర్జాతీయ అవార్డ్స్‌ని సొంతం చేసుకున్నారు.


* ఈసారి ఉత్తమ నటుడు విభాగంలో ఆస్కార్‌ నామినేషన్‌ పొందిన అతిచిన్న వయస్కుడు ఐరిష్‌ నటుడు పాల్‌ మెస్కల్‌(27). ‘ఆఫ్టర్‌ సన్‌’ ఈ చిత్రంలో 11ఏళ్ల అమ్మాయికి తండ్రిగా నటించి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు మెస్కల్‌. ఆయన ‘నార్మల్‌ పీపుల్‌’ అనే మినీసిరీస్‌తో గుర్తింపు పొందారు. దీనికోసం బ్రిటీష్‌ అకాడమీ టెలివిజన్‌ అవార్డ్స్‌లో ఆయన ఉత్తమ నటుడిగా అవార్డును సొంతం చేసుకున్నారు.


* ‘లివింగ్‌’ చిత్రంలో నటించిన ఆంగ్ల నటుడు బిల్‌ నైజీ(73) ఈ ఏడాది ఆస్కార్‌ వేడుకలో ఉత్తమ నటుడి విభాగంలో నామినేషన్‌ అందుకున్నారు. ప్రాణాంతకమైన అనారోగ్యంతో బాధపడుతున్న ఒక వ్యక్తి పాత్రలో నటించి ఆయన విమర్శకుల ప్రశంసలు పొందారు. ‘గిడియాన్స్‌ డాటర్‌(2007)’ చిత్రానికి ఆయన గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డును సొంతం చేసుకున్నారు. ‘లవ్‌ యాక్చువల్లీ(2003)’ సినిమాలో ఆయన నటన బ్రిటీష్‌ అకాడమీ ఫిల్మ్‌ అవార్డ్స్‌లో ఉత్తమ సహాయ నటుడిగా అవార్డును గెలుచుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని