Happy Birthday Dhanush: ఆ సినిమా సూపర్‌ హిట్‌.. ‘హీరో’ ఫ్లాప్‌.. ధనుష్‌ ప్రయాణమిదీ

ధనుష్‌ గురించి ఆసక్తికర అంశాలివే..

Published : 28 Jul 2022 10:58 IST

పదహారేళ్ల కుర్రాడతను. చూడగానే ఆకట్టుకునే రంగు అతనికి లేదు. ఆకర్షించే కటౌట్‌ అతనిది కాదు. అసలు నటనంటే ఏంటో తెలీదు. పైగా చాలా సిగ్గు. మరి ఎవరైనా అలాంటి వ్యక్తిలో నటుడ్ని గుర్తిస్తారా? అతను స్టార్‌ హీరో అవుతాడని ఊహిస్తారా? నాటి పదహారేళ్ల యువకుడే నేటి తమిళ స్టార్‌ హీరోల్లో ఒకరైన ధనుష్‌ (Dhanush). అతనిలో నటుడు స్టార్‌ అవుతాడని ముందుగా గుర్తించింది తన తండ్రే. నేడు ధనుష్‌ (Happy Birthday Dhanush) పుట్టిన రోజు సందర్భంగా ఆ ప్రస్థానాన్ని చూద్దాం...

చిత్ర పరిశ్రమలోకి ఇష్టం లేకుండానే...

ధనుష్‌ అసలు పేరు వెంకటేశ్‌ ప్రభు కస్తూరి రాజా (Dhanush) . 1983 జులై 28న మద్రాసులో జన్మించారు. ధనుష్‌కి ఇద్దరు సోదరీమణులు, ఒక అన్నయ్య ఉన్నారు. ‘7జీ బృందావన కాలనీ’, ‘ఆడవారి మాటలకు అర్థాలు వేరులే’ చిత్రాల దర్శకుడు సెల్వ రాఘవనే (Selvaraghavan) ధనుష్‌ సోదరుడు. తెలుగు వారికి ఆయన శ్రీ రాఘవగా పరిచయమయ్యారాయన. ఒకానొక సమయంలో ఆరుగురు సభ్యులతో కుటుంబాన్ని పోషించడం చాలా కష్టంగా ఉండేది ధనుష్‌ తండ్రి కస్తూరి రాజాకి. మద్రాసులోని మారుమూల ప్రాంతానికి చెందిన ఆయనకు కథలు రాయడమంటే మహా ఇష్టం. అదే అలవాటుగా మారి కొన్నాళ్లకు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసి తర్వాత దర్శకుడయ్యారు. నిర్మాత, సంగీత దర్శకుడిగానూ కోలీవుడ్‌లో తనదైన ముద్ర వేశారు. అలాంటి వ్యక్తికి ఎవరిలో ఏ ప్రతిభ దాగుందో తెలియదా? పైగా కన్న కొడుకు! అందుకే ‘నాకు నటనంటే ఇష్టం లేదు’ అని ధనుష్‌ మొత్తుకున్నా వినకుండా బలవంతంగా హీరోని చేశారు. ఆయనే దర్శకత్వం వహించారు. ఆ సినిమానే ‘తుల్లువదో ఇలమై’. 2002 మే 10న ప్రేక్షకుల ముందుకొచ్చిందా చిత్రం. అసలు కథ అప్పుడే మొదలైంది. సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌. కానీ, ‘హీరో బాగోలేదు..అలా ఉన్నాడు ఇలా ఉన్నాడు’ అనే విమర్శలు గుప్పించారు సినిమా చూసిన వాళ్లంతా. దాంతో ఎక్కడ పోగొట్టుకుంటామో అక్కడే తిరిగి పొందాలనుకునే ఆలోచనతో రెండో సినిమాని కసిగా చేశాడు. ‘కాదల్‌ కొండెయిన్‌’ పేరుతో ధనుష్‌ సోదరుడు సెల్వ రాఘవన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇదే చిత్రాన్ని అల్లరి నరేశ్‌ హీరోగా తెలుగులో ‘నేను’గా రూపొందించారు. ఈ సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమని ఆకర్షించాడు ధనుష్‌. తర్వాత వస్తున్న విజయాల్ని చూసి ‘నాన్న తీసుకున్న నిర్ణయం సరైనందుకు నాకు చాలా ఆనందంగా ఉంది’ అని ఓ సందర్భంలో అన్నారు ధనుష్‌.

అన్నయ్య నేర్పిన పాఠాలు..

తొలి రెండు సినిమాలకి చాలా ఇబ్బంది పడ్డారు ధనుష్‌. ఆయన్ను నుంచి మంచి నటనని రాబట్టుకునేందుకు వాళ్లన్నయ్య సెల్వ రాఘవన్‌ ఒక్కోసారి ధనుష్‌ని కొట్టేవారట. ‘అన్నయ్య ఆరోజు అలా తిట్టి, కొట్టడం వల్లే ఈరోజు నా సినిమాలకు అభిమానులు టికెట్లు తీస్తున్నారు’ అని తన అన్నయ్యపై ప్రేమని కురిపించారు ధనుష్‌.

రెండో సినిమా.. ప్రేమకు పునాది

తన రెండో సినిమా విడుదల సమయంలో ఐశ్వర్య (రజనీకాంత్‌ కుమార్తె) (Aishwarya Rajinikanth) ధనుష్‌ని ఇంటర్య్వూ చేశారు. మెల్లగా ఇద్దరి మధ్య స్నేహం మొదలైంది. తర్వాత అది ప్రేమగా మారింది. ఇరు కుటుంబాలు పెళ్లికి అంగీకరించాయి. అప్పటి నుంచి ప్రముఖ కథానాయకుడు రజనీకాంత్‌ అల్లుడిగా మారారు ధనుష్‌. ఈ దంపతులకి ఇద్దరు తనయులు. వాళ్లే ధనుష్‌కి బెస్ట్‌ ఫ్రెండ్స్‌. అయితే ఇటీవల పరస్పర అంగీకారంతో ధనుష్‌ - ఐశ్వర్య విడాకులు తీసుకున్నారు.

కోలీవుడ్‌ టు హాలీవుడ్‌ వయా బాలీవుడ్

నటుడిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ కోలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్‌, హాలీవుడ్‌, టాలీవుడ్‌లోనూ అభిమానుల్ని సంపాదించుకున్నారాయన. ‘రంజనా’ చిత్రంతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చి ‘షబితాబ్‌’తో ప్రశంసలు అందుకున్నారు. ‘ది ఎక్ట్స్రార్డనరీ జర్నీ ఆఫ్‌ ది ఫకీర్‌’ ఆయన నటించిన తొలి ఆంగ్ల చిత్రం. ధనుష్‌ కీలక పాత్ర పోషించిన మరో హాలీవుడ్‌ మూవీ ‘ది గ్రే మ్యాన్‌’ (The Gray Man) ప్రస్తుతం ‘నెట్‌ఫ్లిక్స్‌’లో సందడి చేస్తోంది. పలు డబ్బింగ్‌ సినిమాలతో తెలుగు వారికి పరిచయమైన ధనుష్‌ ‘రఘువరన్‌ బీటెక్‌’ చిత్రంతో విపరీతమైన క్రేజ్‌ సంపాదించుకున్నారు. త్వరలోనే ‘సార్‌’ (SIR) అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని నేరుగా పలకరించనున్నారు. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ఓ చిత్రం ప్రకటించారు.

మరికొన్ని కోణాలు..

ధనుష్‌ నటుడు మాత్రమే కాదు. ఆయనలో దర్శకుడు, నిర్మాత, గాయకుడు, గేయ రచయిత, కథా రచయిత ఉన్నారు. కెరీర్‌ ప్రారంభంలో ఆయన రాసి, ఆలపించిన ‘వై దిస్‌ కొలవెరి’ ప్రపంచాన్ని ఎంతగా ఊపిందో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ఐదు నిమిషాల్లో ఆ పాటను రాశాడు ధనుష్‌.

చదువుకి అక్కడితో ఫుల్‌స్టాప్‌..

‘పదో తరగతి వరకు బాగా చదివాను. ప్లస్‌ వన్‌ (ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం)లో ఫస్ట్‌లవ్‌ పుట్టింది. చదువు అటకెక్కింది’ అని ఓ సందర్భంలో చెప్పారు ధనుష్‌. ‘తొలిప్రేమ ఎవరికైనా మధుర జ్ఞాపకమే కదా! ఫోకస్‌ అంతా తనమీదే పెట్టాను. కాల్స్‌, లెటర్స్‌, ఈ మెయిల్స్‌ అదే పనిలో ఉండేవాణ్ని. అలా ప్లస్‌వన్‌ పూర్తవకముందే నటుడయ్యాను’ అని తన మనసులో మాట పంచుకున్నారు. అప్పటికి ధనుష్‌కి 16 ఏళ్లు.

ధనుష్‌ నమ్మేది ఇదే..

పనే దైవం.. అవకాశాలు ఎప్పుడూ రావు..  వచ్చినప్పుడు నిజాయతీతో కష్టపడి పనిచేయాలంటారు. రూపం ముఖ్యం కాదు ప్రతిభ ముఖ్యం అనే మాటని బాగా నమ్ముతారు.

ధనుష్‌ ప్రత్యేకత ఇదీ..

తన తండ్రి, తన సోదరుడు, ఐశ్వర్య రజనీకాంత్‌, సౌందర్య రజనీకాంత్‌ దర్శకత్వంలో నటించారు. ఒకే కుటుంబంలో ఇంతమంది దర్శకులు ఉండటం ఒక విశేషం అయితే. అందరితోనూ పనిచేయడం ధనుష్‌కి దక్కిన అరుదైన గౌరవం.

ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం ఉన్న వారిలో ధనుష్‌ ఒకరు. ‘నటనంటే ఆసక్తి లేని నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది.. నా తల్లిదండ్రులు, తోబుట్టువులు, నాతో పనిచేసిన దర్శకనిర్మాతలు, అభిమానులు’ అని చెప్పే నిరాడంబరుడు ధనుష్‌కి జన్మదిన శుభాకాంక్షలు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని