Tollywood: అందం అడుగులు వ్యూహాత్మకం

‘ఏడాదికి ఇన్ని సినిమాలు చేయాలని లెక్కలేసుకొని ముందుకెళ్లడం మాకు తెలియదు. మనసుకు నచ్చిన కథలు చేసుకుంటూ వెళ్తుంటాం’’ అంటుంటారు కథానాయికలు. 

Updated : 06 May 2023 10:19 IST

‘ఏడాదికి ఇన్ని సినిమాలు చేయాలని లెక్కలేసుకొని ముందుకెళ్లడం మాకు తెలియదు. మనసుకు నచ్చిన కథలు చేసుకుంటూ వెళ్తుంటాం’’ అంటుంటారు కథానాయికలు. కానీ, చేతిలో ఎప్పుడూ మూడు నాలుగు సినిమాలు ఉండేలా జాగ్రత్త పడుతుంటారు. ఓ సినిమా పూర్తయ్యి తెరపైకి వచ్చిందంటే చాలు.. తమ డైరీలో ఏర్పడ్డ ఖాళీని టక్కున మరో కొత్త ప్రాజెక్ట్‌తో భర్తీ చేసేస్తుంటారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం.. ఇలా అన్ని భాషల్ని చుట్టొచ్చేస్తుంటారు. ఇదంతా వాళ్ల వ్యూహంలో భాగమే. ఈ ఏడాది ఇప్పటికే చాలా మంది స్టార్‌ నాయికలు తమ కొత్త చిత్రాలతో థియేటర్లలో సందడి చేశారు. మరోవైపు చేతిలో ఉన్న సినిమాల్ని పూర్తి చేస్తూనే.. కొత్త ప్రాజెక్ట్‌లపైనా దృష్టి సారించారు. వరుస చిత్రాలతో వినోదాలు పంచడమే లక్ష్యంగా ఓ పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నారు.

ఈ సంక్రాంతి సీజన్‌లోనే ‘వారసుడు’ సినిమాతో తెలుగు, తమిళ ప్రేక్షకుల్ని పలకరించింది నటి రష్మిక. ప్రస్తుతం ఆమె ‘పుష్ప2’, ‘యానిమల్‌’ సినిమాలు చేస్తూనే కొత్తగా ‘రెయిన్‌ బో’ చిత్రాన్ని పట్టాలెక్కించింది. తాజాగా ఈ చిత్ర తొలి షెడ్యూల్‌ కూడా పూర్తయ్యింది. మరోవైపు నితిన్‌ - వెంకీ కుడుముల కలయికలో తెరకెక్కనున్న కొత్త సినిమా కోసం రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతోంది. వీటితో పాటే తాజాగా హిందీలో ఓ పీరియాడికల్‌ సినిమా చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఛత్రపతి శివాజీ పెద్ద తనయుడు శంభాజీ భోంస్లే జీవిత కథతో లక్ష్మణ్‌ ఉటేకర్‌ హిందీలో ఓ చిత్రం చేయనున్నారు. అందులో శంభాజీ పాత్రను విక్కీ కౌశల్‌ పోషించనుండగా.. అతని భార్య పాత్రకు రష్మికను సంప్రదించారట. ఈ కథ నచ్చడంతో ఆమె కూడా సినిమా చేసేందుకు అంగీకరించిందని సమాచారం. ఈ సంక్రాంతికి ‘వీరసింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాలతో విజయాలు అందుకున్న శ్రుతిహాసన్‌ నాని 30వ సినిమా సెట్లోకి ఇటీవల అడుగుపెట్టింది. మరో పక్క ‘సలార్‌’తో పాటు ఇంగ్లిష్‌ చిత్రం ‘ది ఐ’లోనూ నటిస్తోంది శ్రుతి.

జయాపజయాలు ఎలా ఉన్నా..

ఓవైపు నాయికా ప్రాధాన్య చిత్రాలు.. మరోవైపు కమర్షియల్‌ సినిమాలు రెండింటినీ బ్యాలెన్స్‌ చేసుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నం చేస్తోంది నటి కీర్తి సురేష్‌. ప్రస్తుతం ‘దసరా’తో హిట్టు కొట్టి ఫుల్‌ జోష్‌లో ఉంది. ఇప్పుడీ జోష్‌లోనే చేతిలో ఉన్న చిత్రాల్ని చకచకా పూర్తి చేసే పనిలో పడింది. ఆమె ప్రస్తుతం తెలుగులో చిరంజీవికి చెల్లిగా ‘భోళా శంకర్‌’లో నటిస్తోంది. ఇది ఆగస్టు 11న థియేటర్లలోకి రానుంది. మరోవైపు తమిళంలో నాలుగు సినిమాల్ని లైన్లో పెట్టింది. అందులో ‘మామన్నన్‌’ ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకోగా.. ‘సైరెన్‌’, ‘రఘు తాత’, ‘రివాల్వర్‌ రీటా’ చిత్రీకరణ దశలో ఉన్నాయి. జయాపజయాల్ని పట్టించుకోకుండా తన పనిని తాను చేసుకుంటూ వెళ్లిపోతోంది నటి సమంత. ఆమె ఇటీవల ‘శాకుంతలం’తో చేదు ఫలితాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. అయితే దాన్ని ఏమాత్రం దృష్టిలో పెట్టుకోకుండా తన తదుపరి ప్రాజెక్ట్‌లతో సెట్స్‌పై తీరిక లేకుండా గడిపేస్తోంది. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘ఖుషి’లో నటిస్తూనే.. హిందీలో ‘సిటాడెల్‌’ సిరీస్‌ను పూర్తి చేస్తోంది. త్వరలో ‘స్త్రీ’ ఫేమ్‌ అమర్‌ కౌశిక్‌ దర్శకత్వంలో ఆయుష్మాన్‌ ఖురానాతో కలిసి ఓ సినిమా చేయనుందని సమాచారం. గతేడాది కాలంగా చేదు ఫలితాల్నే చవిచూస్తూ వస్తోంది పూజా హెగ్డే. ఈ క్రమంలోనే దాదాపు అరడజను ఫ్లాపుల్ని ఖాతాలో వేసుకుంది. అందుకే ఇప్పుడు కథల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది ఈ బుట్టబొమ్మ. ప్రస్తుతం తన చేతిలో ఉన్న మహేష్‌బాబు - త్రివిక్రమ్‌ల సినిమా మినహా మరే కథకు ఇంకా ఓకే చెప్పలేదు. పలు కథలు మాత్రం చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది. జయాపజయాలు ఎలా ఉన్నా పక్కా ప్లానింగ్‌తో కెరీర్‌ను ముందుకు తీసుకెళుతున్నారీ నాయికలు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని