
NTR Jayanthi: నందమూరి రాముడు.. వెండితెర సార్వభౌముడు
అందానికి పోత పోస్తే.. ఎన్టీఆర్‌లా ఉంటుంది. కళ్లకు మాటలొస్తే.. అవి తారకరాముడి నేత్రాలై వికసిస్తాయి. స్వరానికి గాంభీర్యం అద్దితే.. అది రామారావు కంఠమై ప్రతిధ్వనిస్తుంది. నిబద్ధతకు నిలువుటద్దం చేయిస్తే... నందమూరి ప్రతిబింబమై కనిపిస్తుంది. నటనకు కిరీటం చేయిస్తే.. ఆయన వేసిన పాత్రల్లా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సింహాసనం వేసుకుని కూర్చుంటుంది. ఆయన పుట్టిన రోజంటే... వెండితెరపై మెరిసే 24 కళలూ తమ జన్మదినోత్సవాన్ని జరుపుకొంటాయి. ఆ మహానటుడి శతజయంతి సంవత్సరం అంటే... తెలుగు సినిమా ప్రేక్షకుల మది ఉప్పొంగుతుంది. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, రచయితగా... తెలుగు సినీ పరిశ్రమకు ఆయన అందించిన జ్ఞాపకాల మధురిమలో తడిసిముద్దవుతుంది.
ఓ వెండితెర ధ్రువతారను 9 నెలలు కడుపులో పెట్టుకొని మోసింది నందమూరి వెంకట్రావమ్మ. 1923 మే 28న ఆ మేరు నటశిఖరం తండ్రి నందమూరి లక్ష్మయ్య చౌదరి కళ్లెదుట మెరిసింది. ఆ మెరుపు నాలుగున్నర దశాబ్దాలపాటు తెలుగు చిత్రసీమను ఏలింది. వందేళ్లు కాదు.. వెయ్యేళ్లకు సరిపడా వెలుగు పంచింది. ఆ వెలుగు పేరే నందమూరి తారక రామారావు. తెలుగు చిత్రసీమను ఆయన నడిపించి గెలిపించారు. సహ నటుల భుజం తట్టారు. నిర్మాతగా మారి సినిమాకు వెన్నెముకయ్యారు. కథకు దర్శకుడయ్యారు. ఎంతోమందికి మార్గదర్శకుడయ్యారు. వెండితెరకు సార్వభౌముడయ్యారు. తెలుగు సినిమాకే కాదు.. సినిమా చరిత్రకే కథానాయకుడయ్యారు.
మీసాల నాగమ్మ.. ఎన్టీఆర్
నందమూరి తారక రామారావు ఎంతటి అందగాడో చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అందమే ఆయనను స్టేజీ ఎక్కేలా చేసింది. అది కళాశాల వార్షికోత్సవం. అందులో ‘రాచమల్లుని దౌత్యం’ నాటకం వేద్దామంటే స్త్రీ పాత్రకు ఎవరూ దొరకలేదు. దీంతో అందరి దృష్టి అందగాడైన ఎన్టీఆర్‌పై పడింది. ఆ వేషం వేసేందుకు మొదట ఎన్టీఆర్ అంగీకరించలేదు. స్నేహితులంతా నచ్చజెప్పి ఒప్పించారు. మేకప్ మ్యాన్ మీసం తీసేయమన్నాడు. ఆయన తీయనన్నారు. చివరికి మీసాలతోనే స్త్రీ పాత్రలో నటించారు. బహుమతి గెలుచుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులపాటు ఆయనను అందరూ మీసాల నాగమ్మా అంటూ ఆటపట్టించేవారు. పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేయడం ఆయన నైజం. పాత్ర కోసం మీసం తీయనని తెగేసి చెప్పిన ఎన్టీఆర్ ఆ తర్వాత కాలంలో అలాంటి ఎన్నో పాత్రల్లో జీవించడానికి ఎంతో శ్రమ, మరెంతో తపనపడ్డారు. తన తర్వాత నటులెందరికీ ఆదర్శంగా నిలిచారు.
పాత్రలో పరకాయ ప్రవేశం
అది ‘మనదేశం’ సినిమా చిత్రీకరణ సమయం. ఎన్టీఆర్‌కు తొలి చిత్రమది. పోలీస్ అధికారి పాత్ర. సన్నివేశం ప్రకారం లాఠీఛార్జ్ చేయాలి. లైటింగ్.. కెమెరా.. యాక్షన్.. అని వినపడగానే రామారావు పాత్రలో లీనమయ్యారు. జూనియర్ ఆర్టిస్టులను నిజంగానే చితకబాదేశారు. దర్శకుడు పిలిచి కొట్టకూడదు.. కొట్టినట్టు నటిస్తే చాలని చెబితే... ‘పోలీసులు అలానే బాదుతారు సార్’ అని అమాయకంగా జవాబిచ్చారట ఎన్టీఆర్. తర్వాత ‘పాతాళభైరవి’ అత్యధిక వసూళ్లు సాధించి, ఎన్టీఆర్‌ను తొలిసారి కమర్షియల్ స్టార్‌ను చేసింది. జానపద చిత్రాల్లో సాటి ఎవరూ లేరనేంతగా ఎదిగిన ఆయన ఒక్కో పాత్రలో ఒదిగిపోతూ వచ్చారు.
పాత్రలో జీవించడమే
ఎంత స్టార్డమ్ వచ్చినా ఆయన ఎప్పుడూ ఇలాంటి చిత్రాలే చేస్తానని కూర్చోలేదు. నటుడిగా తనకు సవాల్ విసిరే పాత్రలను అలవోకగా అంగీకరించి చేసేవారు. ‘రాజు-పేద’ సినిమాలో పూర్తి డీగ్లామర్ పాత్రలో.. చిరిగిపోయిన బట్టలు, చింపిరి జుట్టుతో పోలిగాడుగా జీవించారు. అంతటి అందగాడైన తారక రాముడు అందవికారిగా నటించడమంటే మాటలా. అయినా ఆయన ఇలాంటి పాత్ర చేయడానికి ఏ మాత్రం వెనుకడగు వేయలేదు. ‘భువన సుందరి కథ’లో కురూపిలా కనిపించి, తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. కెరీర్ బాగా ఉన్నతస్థితిలో ఉన్నప్పుడు ‘కలిసుంటే కలదు సుఖం’లో అవిటివాడిగా నటించి అభిమానులను మెప్పించారు. ‘చిరంజీవులు’ చిత్రంలో అంధుడిగా.. ‘ఆత్మ బంధువు’లో అమాయకుడిగా... ఇలా ఆయన వేయని పాత్ర లేదంటే అతిశయోక్తి కాదు. ‘శ్రీ మద్ విరాటపర్వం’, ‘నర్తనశాల’ సినిమాల్లో బృహన్నల పాత్రను ఏ జంకూ లేకుండా చేసి అఖిలాండ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
* యువకుడిగా, అందాల రాముడిగా, అప్పటి అమ్మాయిల గుండెల్లో కొలువైన ఎన్టీఆర్ ‘బడిపంతులు’ సినిమాలో వయసు మళ్లిన పాత్ర చేయమంటే అంగీకరిస్తారో లేదోనని నిర్మాతలు భయపడ్డారు. కానీ కథ విన్న వెంటనే అంగీకరించారు. భర్తగా, తండ్రిగా, తాతగా ఈ చిత్రంలో ఆయన కనపరిచిన పరిపక్వమైన నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
తిరస్కరించిన వారే.. గుండెల్లో గుడి కట్టారు
కృష్ణుడి పాత్ర అంటే మనసులో మెదిలేది ఎన్టీఆర్ రూపమే. కానీ ‘ఇద్దరు పెళ్లాలు’ సినిమాలోని ఓ పాటలో ఆయన తొలిసారి కృష్ణుడి పాత్ర వేస్తే ప్రేక్షకులు తిరస్కరించారు. ‘సొంత ఊరు’ చిత్రంలో కృష్ణుడిగా కనిపిస్తే థియేటర్లో నానా అల్లరి చేశారు. అందుకే ఆయన ‘మాయబజార్’లో శ్రీకృష్ణుడి పాత్ర ధరించడానికి తొలుత ధైర్యం చేయలేకపోయారు. తర్వాత ఆయన పౌరాణిక పాత్రల్లోని ఔచిత్యాన్ని అర్థం చేసుకున్నారు. అందుకు తగ్గట్లు తనను తాను మలచుకున్నారు. వెండితెరపై రాముడైనా, కృష్ణుడైనా, శివుడైనా నిజంగా ఆయా దేవుళ్లే దిగివచ్చినట్లు చేశారు. ఎన్టీఆర్ సినీ ప్రస్థానంలో మాయాబజార్ ఒక అద్భుతం. కృష్ణుడి పాత్ర కోసం వ్యాయామం మానేశారు. యోగ, ప్రాణాయామం చేశారు. ‘మాయాబజార్’ చిత్రీకరణ సమయంలో శ్రీ కృష్ణుడి వేషం వేసుకొని మెల్లగా స్టూడియోలోని ఫ్లోర్‌కు నడుచుకుంటూ వచ్చారు. దేవుడే వచ్చినట్లనిపించి చాలా మంది ఆయనకు పాదాభివందనం చేశారంటే ఆయన పాత్రకు ఎంతలా ప్రాణం పోశారో అర్థమవుతుంది. ‘నేను భగవద్గీత చదువుతున్నప్పుడల్లా నీ స్వరూపమే కృష్ణుడిగా నాకు కనిపిస్తుంది’ అని అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒకసారి ఎన్టీఆర్‌తో అన్నారట! అదీ మరి నందమూరి అభినయమంటే.
ఆకలి విలువ తెలిసి...
రైతు కుటుంబం నుంచి వచ్చిన రామారావుకు ఆకలి విలువ బాగా తెలుసు. ‘పల్లెటూరి పిల్ల’ షూటింగ్ సమయంలో ఆయన దగ్గర డబ్బు ఉండేది కాదు. అందుకే టీ తాగి రోజు గడిపేవారు. ఒక్కోసారి పస్తులుండేవారు. ఆకలి బాధ ఎరిగిన ఆయన 1952లో రాయలసీమ కరవులో ప్రజల ఇబ్బందులను చూసి చలించిపోయారు. రాష్ట్రమంతా తిరిగి వీధుల్లో ‘కరవు రోజులు’ నాటకం ప్రదర్శించారు. నాటకం మధ్యలో స్వయంగా ప్రజల వద్దకు జోలె పట్టుకుని వెళ్లారు. అలా నెల రోజుల పర్యటనలో సేకరించిన సాయాన్ని రాయలసీమ కరువు నివారణ నిధికి అందజేసి మనసున్నవాడయ్యారు. కరవు కోరల్లో అల్లాడిన బాధితులకు నిజమైన దేవుడయ్యారు.
తొలిసారి రూ.కోటి కలెక్షన్లు
ఎన్టీఆర్ రాముడిగా నటించిన ‘లవకుశ’ కనీవినీ ఎరుగని విజయం సాధించింది. అప్పట్లో టికెట్ ధరలు నేల 4 అణాలు (25 పైసలు), బెంచి 8 అణాలు (50 పైసలు), బాల్కనీ ఒక రూపాయి ఉండేవి. ఆ ధరలతోనే ‘లవకుశ’ దిగ్విజయంగా ప్రదర్శితమై రూ.కోటి వసూళ్లను రాబట్టింది. ఓ తెలుగు సినిమా రూ.కోటి వసూలు చేయడం అదే తొలిసారి. ఈ సినిమా తర్వాత తారక రాముణ్ని గుండెల్లో నిలుపుకొన్న హనుమంతుడి లాంటి సినీ భక్తులు ఎందరో.
* చిత్ర నిర్మాణానికి, చిత్రీకరణకు ఆయనెంతో విలువిచ్చేవారు. 1962లో పెద్దబ్బాయి రామకృష్ణ మశూచి మహమ్మారికి బలయ్యారు. అప్పుడు ఎన్టీఆర్ ‘ఇరుగు-పొరుగు’ సినిమా షూటింగులో ఉన్నారు. నిర్మాత ఈ వార్త చెప్పడానికి ప్రయత్నిస్తే ఆయన అడ్డుకున్నారు. ఏదైనా షూటింగ్ అయిపోయాకే చెప్పమన్నారు. రాత్రి 9 గంటలకు విషయం తెలుసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. మెల్లిగా తేరుకున్న తరువాత కాల్షీట్లు విధిగా కొనసాగించాలని చెప్పారు. ఈ సంఘటన ఆయన్ను నిర్మాతల గుండెల్లో నిలిచిపోయేలా చేసింది.
సహనటులకు నిర్మాతలుగా అవకాశం
తనతో నటించిన సహనటులు నిర్మాతలుగా మారినపుడు వారికి తనతో సినిమా చేసుకునే అవకాశాన్ని ఎన్టీఆర్ ఇచ్చేవారు. అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, లక్ష్మీరాజ్యం, శాంత కుమారి, అంజలీదేవి, సత్యనారాయణ, మోహన్‌బాబు, నాగభూషణం, కన్నాంబ, ఘంటసాల, పద్మనాభంలకు తన సినిమాకు నిర్మాతలుగా అవకాశం కల్పించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
urine color: మూత్రం రంగు మారుతోందా..ఓసారి పరీక్ష చేయించుకోండి!
-
Politics News
Revanthreddy: రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను కలిసేందుకు సిద్ధంగా లేము: రేవంత్‌రెడ్డి
-
Technology News
iPhone 12: యాపిల్ ఐఫోన్ 12పై ఆఫర్..₹ 20 వేల వరకు తగ్గింపు!
-
India News
Maharashtra: ‘నాన్నే చెప్పేవారు.. మనకు చెందనిది ఎప్పటికీ మనతో ఉండదని..’: ఆదిత్య ఠాక్రే
-
India News
Parliament: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు తేదీలు ఖరారు
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- PM Modi Tour: తెలంగాణ రుచులు... మళ్లీ మళ్లీ యాదికి రావాలె!
- Maharashtra Crisis: ఫడణవీస్ ఎందుకు సీఎం బాధ్యతలు చేపట్టలేదంటే?
- Shivani Rajasekhar: ‘మిస్ ఇండియా’ పోటీ నుంచి తప్పుకున్న శివానీ రాజశేఖర్.. కారణమిదే
- IND vs ENG: కథ మారింది..!
- Maharashtra: మహారాష్ట్ర సీఎంగా ఏక్నాథ్ శిందే.. నేడే ప్రమాణం
- Rocketry Preview: ప్రివ్యూ: ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’
- బీచ్‌లో కాలక్షేపం కోసం ₹5 లక్షల కోట్ల కంపెనీకి సీఈఓ రాజీనామా!
- Raj Thackeray: అన్న రాజీనామా.. రాజ్ ఠాక్రే కీలక ట్వీట్
- Major: ఓటీటీలోకి ‘మేజర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (30-06-2022)