థియేటర్‌లో ‘ఆట’.. మీరు రెడీయా!

మామూలుగా పదిమంది స్నేహితులు కలిస్తే ఎక్కువగా వేటి గురించి చర్చించుకుంటారు? అయితే సినిమాలు లేదా ఆటలు.. ఇంకా అంటే రాజకీయాలు. ప్రస్తుతం రాజకీయాలు పక్కనబెడితే పై రెండు విషయాల గురించి మనం ఎప్పుడూ చర్చించుకుంటూనే ఉంటాం.

Updated : 02 Mar 2021 10:02 IST

సాధారణంగా నలుగురు స్నేహితులు కలిస్తే ఎక్కువగా వేటి గురించి చర్చించుకుంటారు? అయితే సినిమాలు లేదా ఆటలు.. ఇంకా అంటే రాజకీయాలు. ప్రస్తుతం రాజకీయాలు పక్కనబెడితే మిగిలిన రెండు విషయాల గురించి మనం ఎప్పుడూ చర్చించుకుంటూనే ఉంటాం. ఆటల్లో ఎన్నో భావోద్వేగాలు ఉంటాయి. ఆ భావోద్వేగాలను సినిమాగా మలిస్తే, ఆటలోని కసిని తెరపై ఆవిష్కరిస్తే అద్భుతంగా ఉంటుంది కదా! మరి ఆ పాయింట్‌ను నమ్ముకుని ప్రేక్షకులను అలరించడంతోపాటు, కాసుల వర్షంలో తడవాలని క్రీడా నేపథ్య సినిమాలు రెడీ అవుతున్నాయి. ఇటీవల కాలంలో విడులైన జెర్సీ, చెక్‌ వంటి చిత్రాలు ప్రేక్షకుల మదిని దోచాయి. త్వరలో మరికొన్ని చిత్రాలతో తమ ‘ఆట’తో అలరించేందుకు సిద్ధమవుతున్నాయి అవేంటో చూద్దామా!

దూసుకొస్తున్న ‘హాకీ’ ఎక్స్‌ప్రెస్‌

న జాతీయక్రీడగా పేరు గడించిన హాకీ ఆటే ప్రధానాంశంగా వస్తున్న చిత్రం ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’. సందీప్‌ కిషన్‌, లావణ్యత్రిపాఠి జంటగా నటించారు. ఇద్దరూ కూడా హాకీ ప్లేయర్లుగానే కనిపించనున్నారు.  క్రీడావ్యవస్థలో  రాజకీయాలు ఏ స్థాయిలో ఉంటాయి, ఎంతమంది క్రీడాకారులు ఆ రాజకీయాలకు బలవుతున్నారు అనే అంశాన్ని సందేశాత్మకంగా చూపించనున్నారు. తమిళ చిత్రం ‘నాప్టే తునై’కి రీమేక్‌ అయినప్పటికి 50 శాతానికి  పైగా మార్పులు చేసి తెలుగులో చిత్రీకరించనట్టు యూనిట్‌ చెబుతోంది. మాతృకకు దర్శకత్వం వహించిన డెన్నిస్‌ జీవనే దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకోసం సందీప్‌ సిక్స్‌ప్యాక్‌ కూడా చేశారు. లావణ్య గేమ్‌పై పట్టు కోసం హాకీ కోచింగ్‌ కూడా తీసుకుంది. మార్చి 5 నుంచి థియేటర్లలో వీరి హాకీ గేమ్‌ మొదలుకానుంది.

‘లక్ష్యం’పై నాగశౌర్య గురి..

వర్‌బాయ్‌ ఇమేజ్‌తో చాలా చిత్రాలు చేసిన నాగశౌర్య  ప్రస్తుతం రూటు మార్చి మాస్‌ జోనర్‌లో పయనిస్తున్నారు. అందులో భాగంగానే విలువిద్య నేపథ్యంలో ‘లక్ష్య’ సినిమాను ఎంచుకున్నారు. ఇందుకోసం ఆయన తన దేహన్నే విల్లులా దృఢంగా మలుచుకున్నారు. ఇటీవల విడులైన టీజర్‌లో రిప్పిడ్‌ బాడీతో ఫిట్‌గా కనిపిస్తున్నారు. కొన్నాళ్లపాటు ఆటకు దూరమైన క్రీడాకారుడు తిరిగి అదే కసితో బరిలోకి దిగితే ఎంతటి ప్రభావాన్ని చూపిస్తాడో టీజర్‌లో కనిపిస్తోంది. క్రీడా నేపథ్యానికి ఫ్యామిలీ డ్రామా జతచేసి ప్రేక్షకులను కట్టిపడేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రంలో జగపతిబాబు ఒక కీలకపాత్రలో నటిస్తున్నారు. దీరేంద్ర సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కేతికా శర్మ కథానాయిక. ఆర్చరీ గేమ్‌ నేపథ్యంగా తెలుగులో సినిమా రావడం ఇదే ప్రథమమేమో!

షూట్‌ ఔట్‌ సఖి..

‘మహానటి’ చిత్రంతో కీర్తిసురేష్‌ రేంజ్‌ మారిపోయింది. ప్రస్తుతం మహిళా ప్రాధాన్య చిత్రాల్లోనే ఎక్కువగా నటిస్తోంది. అందుకు అనుగుణంగా ‘గుడ్‌లక్‌ సఖి’ అంటూ వచ్చేస్తోంది. అందులోనూ ఇది స్పోర్ట్స్‌ డ్రామా కావడం విశేషం. రైఫిల్‌ షూటింగ్‌ నేపథ్యంగా సాగే ఈ చిత్రంలో కూడా జగపతిబాబు కీలకపాత్ర పోషిస్తున్నారు. మరో ప్రధాన పాత్రలో ఆది పినిశెట్టి నటిస్తున్నారు. ఒక నష్ట జాతకురాలిగా ముద్ర పడిన యువతి ఎలా రైఫిల్‌ షూటింగ్‌ పోటీల దాకా వెళ్లిందనేది ఈ కథలో ప్రథానాంశంగా అర్థమవుతోంది. ఇటీవల విడుదలైన టీజర్‌ నవ్వులు పంచుతూనే సినిమా థీమ్‌ను చెప్పేసింది. దేవీశ్రీ ప్రసాద్‌ ఈ చిత్రానికి మ్యూజిక్‌ అందిస్తుండటం విశేషం. నాగేష్‌ కుకనూరు దర్శకత్వం వహిస్తున్నారు. జూన్‌ 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘కబడ్డీ’ ఆడిస్తున్న గోపీచంద్‌

యాక్షన్‌ హీరో గోపీ చంద్‌ కథానాయకుడిగా సంపత్‌ నంది దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సీటీమార్‌’. కబడ్డీ ప్రధానాంశంగా సాగుతున్న ఈ చిత్రంలో గోపీచంద్‌ కోచ్‌గా కనిపించనున్నారు. హీరోయిన్‌ తమన్నా కూడా కోచ్‌గానే కనిపిస్తుండటం విశేషం. గతంలో సంపత్‌నంది-గోపీచంద్‌ కాంబోలో వచ్చిన ‘నందా’మూవీ మిశ్రమ ఫలితాలను అందుకుంది. ఇటీవల విడుదలైన టీజర్‌లో ‘కబడ్డీ.. మైదానంలో ఆడితే ఆట.. బయట ఆడితే వేట’ అంటూ హీరో చెబుతున్న డైలాగ్‌లు సినిమాలోని యాక్షన్‌ ఏ రేంజ్‌లో ఉంటుందో చెబుతోంది.  ఏప్రిల్‌ 2 నుంచి థియేటర్లలో కబడ్డీ కూత వినబడనుంది.

బాక్సింగ్‌ రింగ్‌లో ‘గని’

యువ కథానాయకుడు వరుణ్‌ బాక్సర్ అవతారం ఎత్తారు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘గని’. పూర్తి బాక్సింగ్‌ క్రీడా నేపథ్యంగా సాగే చిత్రమిది. ఇదివరకు బాక్సింగ్‌ నేపథ్యంలో ఎన్నో చిత్రాలు వచ్చినప్పటికి ఇందులో మాత్రం ఒక ప్రొఫెషనల్‌ బాక్సర్‌ ఎలా ఉంటారో వరుణ్‌తేజ్‌ చూపించబోతున్నారు. అందుకోసం చాలా కష్టపడ్డారు. సయీ మంజ్రేకర్‌ హీరోయిన్‌. ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్‌లో వరుణ్‌ తీక్షణమైన చూపులతో ఆకట్టుకుంటున్నారు. ఆరడగుల పైనే ఎత్తుండే ఈ హీరో బాక్సింగ్‌ రింగ్‌లో దిగి ప్రత్యర్థులపై పంచ్‌ కొడుతుంటే చూడలనిపిస్తోందా! అయితే జులై 30 దాకా వేచి ఉండాల్సిందే. చిత్రంలో కన్నడ స్టార్‌ ఉపేంద్రతో పాటు జగపతిబాబు నటిస్తుండటం విశేషం.

లైగర్‌ ‘గర్జన’ లా ఉంటుందో!

 

యూత్‌లో మంచి క్రేజ్‌ ఉన్న హీరో విజయ్‌దేవరకొండ. అలాగే హిట్టు, ఫట్టుతో సంబంధం లేకుండా చేసే ప్రతీ సినిమాపై అంచనాలు పెంచగల టాలెంటెడ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్. వీరిద్దరి కాంబోలో పాన్‌ ఇండియా చిత్రంగా ‘లైగర్‌’రాబోతోంది. ‘సాలా క్రాస్‌ బ్రీడ్‌’ అనే ట్యాగ్‌లైన్‌తో ఈ చిత్రం ఎంత క్రేజీగా ఉంటుందో చెప్పేస్తున్నారు చిత్రబృందం. ముఖ్యంగా మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ను కథా నేపథ్యంగా సినిమా తెరకెక్కించడం విశేషం. బాలీవుడ్‌ భామ అనన్యపాండే విజయ్‌ సరసన ఆడిపాడనుంది. ఇందులో యాక్షన్‌ సీన్ల కోసం విజయ్‌ ప్రత్యేకంగా విదేశాల్లో శిక్షణ తీసుకుని మరింత ఫిట్‌గా మారారు. సహజంగా పూరీ తన హీరోలకు ప్రత్యేక మేనరిజంతో పాటు సిక్స్‌ప్యాక్‌ ఉండేలా చూస్తాడు. మరి ఈ సినిమాలో ‘లైగర్‌’ ఎలా గర్జిస్తాడో చూడాలంటే సెప్టెంబరు 9 దాకా వేచి చూడాల్సిందే.

ఇవే కాకుండా పుల్లెల గోపీచంద్‌ బయోపిక్‌లో సుధీర్‌బాబు నటిస్తున్నారు. ఆయన కూడా ఒకప్పటి బాడ్మింటన్‌ క్రీడాకారుడు కావటం విశేషం. అలాగే బాలీవుడ్‌లో ‘83’చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 1983లో కపిల్‌ డెవిల్స్‌ విజయయాత్రను ఈ చిత్రంలో చూపించనున్నారు. కపిల్‌దేవ్‌గా రణ్‌వీర్‌సింగ్‌ లుక్‌ వావ్‌ అనిపిస్తోంది. అలాగే అజయ్‌దేవ్‌గణ్‌ ప్రధాన పాత్రలో ‘మైదాన్‌’ చిత్రం పుట్‌బాల్‌ నేపథ్యంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాలన్నీ చూసేసి అటు ఆటతో పాటు వినోదాన్ని కూడా రుచి చూద్దాం!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని