Tollywood: జుట్టు నెరిసింది.. మీసకట్టు మారింది!

వయసుకు మించిన పాత్రల్లో నటించేందుకు ఇష్టపడని వారు కూడా ఇప్పుడు జుట్టుకు రంగేసి హీరోయిజాన్ని చూపిస్తున్నారు.  కోరమీసాలు తిప్పి అభిమానులకు కనుల విందును సిద్ధం చేస్తున్నారు. తెలుగులో రానున్న చిత్రాల్లో మన హీరోలు ఎలా ఉండబోతున్నారనే దానిపై ఓ లుక్కేద్దాం రండి. 

Updated : 22 Jun 2021 14:08 IST

సరికొత్తగా కనిపిస్తూ  అదరగొడుతున్న తెలుగు హీరోలు

తెలుగు హీరోలు రూటు మార్చారు.  టాలీవుడ్‌లో రాబోయే చిత్రాల్లో సరికొత్తగా కనిపించి ట్రెండ్‌ సృష్టించేందుకు సిద్ధమతున్నారు. ఇప్పటికే విడుదలైన కొందరి ఫస్ట్‌లుక్‌ పోస్టర్లు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేశాయి.  వయసుకు మించిన పాత్రల్లో నటించేందుకు ఇష్టపడని వారు కూడా ఇప్పుడు జుట్టుకు రంగేసి హీరోయిజాన్ని చూపిస్తున్నారు.  కోరమీసాలు తిప్పి అభిమానులకు కనుల విందును సిద్ధం చేస్తున్నారు. తెలుగులో రానున్న చిత్రాల్లో మన హీరోలు ఎలా ఉండబోతున్నారనే దానిపై ఓ లుక్కేద్దాం రండి. 

లూసిఫర్‌ కోసం మెగా ఛేంజ్‌!

 రెండో ఇన్నింగ్స్‌లో మెగాస్టార్‌ చిరంజీవి స్టైల్‌ మార్చారు. కథల ఎంపికలోనే కాదు. వేషధారణపైనా ప్రత్యేక దృష్టి పెట్టారు. ‘ఆచార్య’లో స్టైలిష్‌ లుక్‌లో మెరుస్తున్నారు చిరు..  ‘లూసిఫర్’ రీమేక్‌‌లోనూ వైవిధ్యంగా కనిపించనున్నారని తెలుస్తోంది. ఆ సినిమా కోసం సాల్ట్ అండ్‌ పెప్పర్‌ లుక్‌లో సరికొత్తగా కనిపిస్తారని సమాచారం. సినిమాకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ‘వేదాళం’ రీమేక్‌లోనూ చిరు రూపురేఖలు కొత్తగా ఉంటాయని తెలుస్తోంది. అందులో కొన్ని సన్నివేశాల్లో గుండుతో కనిపించనున్నారట. సినిమాకొక స్టైల్‌లో దర్శనమిచ్చేందుకు ప్రయత్నిస్తూ అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు చిరు.

‘అఖండ’తో అదిరేటి లుక్‌

కేశాలంకరణపై బాలకృష్ణకు ప్రత్యేక అభిరుచి ఉంది. గత చిత్రాల్లోనూ వైవిధ్యంగా కనిపించారాయన. బోయపాటితో తీస్తున్న ‘అఖండ’ కోసం మరోసారి స్టైల్‌ మార్చాడు. దట్టమైన మీసకట్టు, నెరసిన గడ్డంతో అఘోరాగా సరికొత్తగా దర్శనమివ్వనున్నారు. ఈ సినిమాలో విలన్‌గా చేస్తున్న మరో నటుడు శ్రీకాంత్‌ జుట్టుకు కూడా రంగు పడింది. తెల్ల గడ్డంతో  అదరగొట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి లుక్‌లో ఆయన కనిపించడం ఇదే తొలిసారి. ‘లెజెండ్‌’ సినిమాతో జగపతి బాబును ఇలాగే విలన్‌గా దింపి ఆయన కెరీర్‌ను మలుపు తిప్పారు బోయపాటి.  లుక్‌ మార్చి చేస్తున్న ఈ ప్రయోగంతోనైనా శ్రీకాంత్‌ లక్‌ మారుతుందోమో చూడాలి. 

నారప్ప కోసం వెంకీ

విక్టరీ వెంకటేష్‌ తమిళ రీమేక్‌ కోసం తన స్టైల్‌ మార్చాడు. ‘అసురన్’‌ రీమేక్‌ ‘నారప్ప’లో ఇది వరకు కనిపించని రీతిలో నూతనంగా కనిపిస్తున్నారు.  ఇప్పటికే విడుదలైన పోస్టర్లలో రౌద్రం నిండిన కళ్లతో వెంకీ లుక్‌ అదిరిపోయింది.  నారప్పగా నటిస్తున్న వెంకటేశ్‌ ఈ చిత్రకోసం తన స్టైల్‌ను మార్చేశారు. గుబురు గడ్డం, నెరసిన జుట్టుతో తండ్రి పాత్రలో నటిస్తున్నాడు వెంకీ. ‌ యువకుడిగానూ పవర్‌ఫుల్‌ పాత్రలో వెంకీ కనిపించనున్నారు. 

తెల్లజుట్టుతో ‘శేఖర్’‌

‘గరుడ’ సినిమాతో చాలా రోజుల తర్వాత హిట్టు కొట్టిన హీరో రాజశేఖర్‌. ప్రశాంత్‌ వర్మ ‘కల్కి’తో మరో ప్రయోగాత్మక చిత్రంలోనూ నటించారాయన. మలయాళంలో సూపర్‌ హిట్టైన ‘జోసెఫ్’ అనే‌ థ్రిల్లర్‌ సినిమాను తెలుగులో రీమేక్‌‌ చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌లో రాజశేఖర్‌ కొత్తగా కనిపించారు. పూర్తిగా నెరిసిన గడ్డంతో సరికొత్తగా దర్శనమిచ్చారు.  ఇలా వయస్సు మళ్లిన పాత్రలో ఆయన నటించడం ఇదే తొలిసారి.  ఇందులో రిటైర్డ్‌ పోలీసాఫీసర్‌గా చేయనున్నారు. డైలాగ్‌ కింగ్‌ మోహన్‌బాబు కూడా  ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ సినిమా కోసం పూర్తిగా తెల్లజుట్టు, గడ్డంతో కనిపిస్తున్నారు. 

మీసం తిప్పిన ‘ఆర్‌ఆర్‌ఆర్’‌ హీరోలు

రాజమౌళి హీరోలు ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటారో తెలిసిందే. ఆ పాత్రల రూపురేఖలు కూడా అంతే కొత్తగా ఉంటాయి. ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న  ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కోసం రామ్‌ చరణ్‌ మీసాన్ని మెలితిప్పాడు. అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న చరణ్ లుక్‌  అదిరిపోయింది. తారక్‌ కూడా  కొమురం భీం పాత్ర కోసం స్టైల్‌ను మార్చేశాడు. పాన్‌ ఇండియా చిత్రంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది.  ‘బింబిసార’లోనూ గుబురు గడ్డంతో కళ్యాణ్‌ రామ్‌ నూతనంగా కనిపించనున్నారు. 

మాసిన గడ్డంతో పుష్పరాజ్‌

సుకుమార్‌ దర్శకత్వంలో పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న చిత్రం ‘పుష్ప’. అల్లు అర్జున్‌ మాస్‌ లుక్‌తో అదరగొడుతున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లకు అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. మాసిన గడ్డంతో ఎర్రచందనం దొంగగా కొత్తగా కనిపిస్తున్నాడు అల్లు అర్జున్‌. విలన్‌గా నటిస్తున్న ఫహద్‌ ఫాజిల్‌ కూడా ఇందులో కొత్త గెటప్‌లో మెరవనున్నారని సమాచారం. 

 కోరమీసాల సింగరాయ్

కొత్త సినిమాల కోసం తమ స్టైల్‌ మార్చిన కుర్రహీరోలు మరి కొందరున్నారు. ‘శ్యామ్‌సింగరాయ్’‌ కోసం నాని మీసం తిప్పగా, ‘లక్ష్య’ సినిమాకు కండలతోపాటే జుట్టు, గడ్డం పెంచేశాడు నాగశౌర్య. అఖిల్‌ కూడా ‘ఏజెంట్‌’లో మునపటిలా కాకుండా కొత్తగా దర్శనమిస్తున్నాడు. ఇంకొంతమంది యువ హీరోలు కూడా లుక్‌ మార్చి వైవిధ్యాన్ని చూపేందుకు సిద్ధమవుతున్నారు. 

 

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని