అంచనాలు ఆకాశమంత.. ఫలితం గోరంత..!

ఏవైనా కొత్త సినిమాలు వస్తున్నాయంటే చాలు సినీ ప్రేమికుల్లో ఆసక్తి పెరిగిపోతుంది. నటుల కాంబినేషనో, నిర్మాణ సంస్థ గొప్పతనమో, ఆ చిత్ర దర్శకుల ట్రాక్‌ రికార్డో..ఆసక్తి కలిగించే అంశం ఏదైనా గానీ అంచనాలు మాత్రం పెంచేసుకుంటాం. దీంతో పాటు ట్రైలర్‌

Published : 11 Jan 2021 17:49 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఏవైనా కొత్త సినిమాలు వస్తున్నాయంటే చాలు సినీ ప్రేమికుల్లో ఆసక్తి పెరిగిపోతుంది. నటుల కాంబినేషనో, నిర్మాణ సంస్థ గొప్పతనమో, ఆ చిత్ర దర్శకుల ట్రాక్‌ రికార్డో.. ఆసక్తి కలిగించే అంశం ఏదైనా అంచనాలు మాత్రం పెంచేసుకుంటాం. దీంతో పాటు ట్రైలర్‌ కట్స్‌, టీజర్ స్నీక్‌పీక్స్‌, లిరికల్‌ ప్రోమోలంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం హోరెత్తిపోతుంది. ఇన్ని అంచనాల మధ్య సగటు ప్రేక్షకుడు థియేటర్‌లోనో, ఓటీటీ ద్వారానో సినిమా చూస్తున్నపుడు కథా, కథనాలు చప్పగా అనిపిస్తే...ఉస్సురూమంటారు. మరి ఈ ఏడాది విడుదలకు ముందు అంచనాలు పెంచి అందుకోలేకపోయిన సినిమాలేంటో చూద్దామా..

రవితేజ స్థాయిని అందుకోలేని.. డిస్కోరాజా..!

మాస్‌ మహారాజా రవితేజ తన ఎనర్జిటిక్‌ స్క్రీన్‌షోతో అలరించేందుకు ఈ ఏడాది ఆరంభంలోనే డిస్కోరాజా అంటూ థియేటర్లలో సందడి చేశారు. ‘ఒక్క క్షణం’ అంటూ సస్పెన్స్‌ థ్రిల్లర్‌తో హిట్టు కొట్టిన వి.ఐ ఆనంద్‌ దర్శకత్వం వహించగా, నభానటేష్‌, పాయల్‌ రాజ్‌పూత్‌ కథానాయికలుగా నటించారు. జెనిటిక్‌ సైన్స్‌తో ముడిపెట్టి అల్లుకున్న కథతో ప్రేక్షకులు కనెక్ట్‌ కాలేకపోయారు. ఫ్లాష్‌బ్యాక్‌లో చూపించే రెట్రో లుక్‌ సీన్లు అలరించినా సినిమాను మాత్రం కాపాడలేకపోయాయి. రవితేజ ఎనర్జీ మాత్రమే ప్రేక్షకుల్లో కొద్దిగా జోష్‌ నింపింది. అయితే ఈ సినిమాలో తమన్‌ అందించిన పాటల ఆల్బమ్‌ మాత్రం సంగీత ప్రియులను ‘ఫ్రీక్‌ అవుట్‌’ చేసింది.

వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌


యాంగ్రీ లవర్‌గా, రస్టిక్‌ లుక్‌తో విజయ్‌ దేవరకొండ నటించిన ‘అర్జున్‌రెడ్డి’ చిత్రం కల్ట్‌ క్లాసిక్‌లా నిలిచిపోయింది. కానీ, మళ్లీ అదే లుక్‌తో ఎమోషనల్‌ లవ్‌డ్రామాగా తెరకెక్కిన ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ చిత్రం మాత్రం పెద్ద డిజాస్టర్‌ అయింది. ఒక భావోక్తమైన ప్రేమ కోణాన్ని కథావస్తువుగా తీసుకుని ‘మళ్లీ మళ్లీ ఇది రానిరోజు’ అంటూ కొన్నేళ్ల క్రితం సినీ ప్రియుల మన్ననలు పొందిన దర్శకుడు క్రాంతిమాధవేనా ఈ చిత్రాన్ని తెరకెక్కించిందంటూ ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఒక యువ రచయితగా, ప్రేమికుడిగా విజయ్‌ నటన మళ్లీ అర్జున్‌రెడ్డిని తలపించడంతో ఆడియన్స్‌ రిసీవ్‌ చేసుకోలేకపోయారు. గోపి సుందర్‌ సంగీతం కూడా పేలవంగా అనిపించింది. సినిమాలో ఎంతో కొంత అలరించిందంటే మాత్రం సింగరేణి బ్యాక్‌డ్యాప్‌లో భార్యభర్తలుగా ఐశ్వర్యరాజేష్, విజయ్‌ నటన మాత్రమే. 

అక్కడి మేజిక్‌ ఇక్కడ రిపీట్‌ కాలేకపోయింది!


కోలీవుడ్‌లో విశేషంగా అలరించిన చిత్రం ‘96’. శర్వానంద్‌, సమంత ప్రధాన పాత్రల్లో మాతృకకు దర్శకత్వం వహించిన సి.ప్రేమ్‌కుమారే తెలుగులోనూ చిత్రాన్ని తెరకెక్కించారు. కానీ, సినిమా మాత్రం బాక్సాఫీసు వద్ద నిరాశనే మిగిల్చింది. సోషల్‌మీడియా ప్రభంజనంతో తమిళ ‘96’ చిత్రం యువత గుండెల్లోకి బలంగా చేరిపోయింది. ఆ చిత్రంలో విజయ్ సేతుపతి, త్రిషల మధ్య కెమెస్ట్రీకి ఆడియన్స్‌ ఫిదా అయ్యారు. శర్వా, సమంతల నటనాచాతుర్యం మనకు తెలిసినదే.. అయినప్పటికీ రామ్‌, జానుగా సేతుపతి, త్రిషలే ప్రేక్షకులకు గుర్తుండిపోవడంతో తెలుగు రీమేక్‌ అంతగా రీచ్‌ కాలేకపోయింది. అయితే పాటలు మాత్రం సంగీత ప్రియులను కట్టిపడేశాయి. 96 చిత్రానికి బాణీలు అందించిన గోవింద్‌ వసంతనే జానుకు కూడా సంగీతమందించారు.

ఉత్కంఠతో ఎదురుచూస్తే ‘వి’సిగించింది!

అష్టా చమ్మా, సమ్మోహనం లాంటి రొమాంటిక్‌ కామెడీ చిత్రాలు తీసి హిట్లు కొట్టిన మోహనకృష్ణ ఇంద్రగంటి ఈసారి క్రైమ్‌ కంటెంట్‌తో ‘వి’ అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చారు. నేచురల్‌ స్టార్‌ నాని, సుధీర్‌బాబులు నటించిన ఈ మల్టీస్టారర్‌ చిత్రం ఏ మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. సైకో కిల్లర్‌గా నాని డిక్షన్‌ బాగున్నా, అభిమానులు ఇంకాస్త ఎక్కువ ఊహించారు. క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమాల్లో ఉండాల్సిన ఉత్కంఠ కొరవడటంతో ‘వి’సిగించింది.

ఆ రెండూ ‘కీర్తి’ని పెంచలేకపోయాయి

‘మహానటి’ చిత్రంతో జాతీయస్థాయిలో ప్రతిభా పురస్కారం దక్కించుకున్న కీర్తిసురేష్‌కు ఆ తర్వాత వచ్చిన చిత్రాలు ఏవి ఆ స్థాయిని నిలబెట్టలేకపోయాయి. ఆ చిత్రంతో వచ్చిన ఇమేజ్‌తో మహిళా ప్రాధాన్య చిత్రాల్లో నటించేందుకు కీర్తిసురేష్ ఎక్కువగా మొగ్గు చూపింది. ఆ ప్రయత్నంలో భాగంగానే పెంగ్విన్‌, మిస్‌ ఇండియా చిత్రాలు వరుసగా ఓటీటీ వేదికగా విడుదలయ్యాయి. ‘పెంగ్విన్‌’ థ్రిల్లర్‌ తరహాలో ఉంటే, ‘మిస్‌ఇండియా’ చిత్రం ఒక మహిళా ఎంట్రప్రెన్యూర్‌ ప్రయాణాన్ని చూపిస్తుంది. అయితే రెండు సినిమాలు అంచనాలను అందుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాయి. 

 నిశ్శబ్దం బద్దలవ్వలేదు

మహిళా ప్రాధాన్య చిత్రాలకు టాలీవుడ్‌లో ఉన్న బలమైన కథనాయిక అనుష్కశెట్టి. అరుంధతితో అందరి ప్రశంసలు పొందిన ఆమె ఆ తర్వాత గ్లామర్‌ పాత్రలు తగ్గించి బలమైన పాత్రలవైపే మొగ్గు చూపింది. బాహుబలి తర్వాత వచ్చిన భాగమతితో ఆమె ఖాతాలలో మరో హిట్‌ను చేర్చింది. ఇదే ఊపులో చేసిన ‘నిశ్శబ్దం’ మూవీ మాత్రం అట్టర్‌ఫ్లాప్‌గా నిలిచింది. దర్శకుడు హేమంత్‌ మధుకర్‌ ఎంచుకున్న థ్రిల్లర్‌ కథావస్తువు ఆసక్తికరమైనదే కానీ, కథనంలో తడబాటు వల్ల ప్రేక్షకుల నాడిని పట్టలేకపోయింది. మాధవన్‌, అంజలి వంటి ప్రతిభావంతమైన నటులతో పాటు హాలీవుడ్ ప్రముఖనటుడు మైఖేల్‌ మ్యాడిసన్‌ సైతం చిత్రంలో ఉన్నప్పటికీ సరైన కథ లేకుంటే మేకర్స్‌కు నిరాశే మిగులుతుందని ప్రేక్షకులు మరోసారి గుర్తుచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని