Sudha Kongara: నెమ్మదైనా.. ఈ ప్రయాణం సంతృప్తిగానే ఉంది!

బలమైన కథలకు.. శక్తిమంతమైన మహిళా పాత్రలకు చిరునామాగా నిలుస్తుంటాయి సుధా కొంగర చిత్రాలు. ఇప్పుడామె దర్శకత్వంలో అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటించిన చిత్రం ‘సర్ఫిరా’. ఇది సుధా - సూర్య కాంబోలో వచ్చిన విజయవంతమైన సినిమా ‘సూరారై పోట్రు’ (తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’)కు రీమేక్‌గా రూపొందింది.

Published : 07 Jul 2024 02:06 IST

బలమైన కథలకు.. శక్తిమంతమైన మహిళా పాత్రలకు చిరునామాగా నిలుస్తుంటాయి సుధా కొంగర చిత్రాలు. ఇప్పుడామె దర్శకత్వంలో అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటించిన చిత్రం ‘సర్ఫిరా’. ఇది సుధా - సూర్య కాంబోలో వచ్చిన విజయవంతమైన సినిమా ‘సూరారై పోట్రు’ (తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’)కు రీమేక్‌గా రూపొందింది. ఈ చిత్రం ఈ నెల 12న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం ‘ఈనాడు సినిమా’తో ముచ్చటించారు సుధా కొంగర.

‘ఆకాశం నీ హద్దురా’ని కొవిడ్‌ పరిస్థితుల వల్ల నేరుగా ఓటీటీలో విడుదల చేశారు. ఇప్పుడా కథను ‘సర్ఫిరా’ రూపంలో వెండితెరపై చూసుకోనున్నందుకు ఎలా అనిపిస్తోంది?  

‘‘నాకు చాలా ఆనందంగా ఉంది. ‘ఆకాశం నీ హద్దురా’ సెన్సార్‌ పనులు పూర్తి చేసుకుని మరో 20 రోజుల్లో థియేటర్లలోకి రానుందనగా కొవిడ్‌ వల్ల లాక్‌డౌన్‌ విధించారు. దీంతో మా గుండె పగిలినట్లయింది. గొప్ప థియేటర్‌ అనుభూతిని అందించే ఇంత మంచి చిత్రాన్ని అప్పటి పరిస్థితుల వల్ల తప్పక ఓటీటీలో విడుదల చేయాల్సి రావడం నాకు చాలా బాధగా అనిపించింది. నాకు బాగా గుర్తు ఆ టైమ్‌లో స్వప్న దత్, మహేశ్‌బాబు.. ఇలా చాలా మంది తెలుగు సినీ పెద్దలంతా ‘ఇంత మంచి చిత్రాన్ని ఓటీటీలో ఎందుకు విడుదల చేశార’ని ట్వీట్స్‌ చేశారు. ఒక సినిమా థియేటర్‌లో విడుదలై విజయవంతమైతే ఎంత గొప్ప స్పందన వస్తుందో.. అంతటి స్పందన లభించింది. ఏదేమైనా ఇప్పుడా కథను ‘సర్ఫిరా’ రూపంలో వెండితెరపై చూసుకునే అవకాశం దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది’’. 

చాలా మంది దర్శకులు రీమేక్స్‌ చేయడాన్ని బోర్‌గా ఫీలవుతుంటారు. కానీ, మీరు మీ కథల్నే మళ్లీ మళ్లీ రీమేక్‌ చేస్తుంటారు. దీనిపై మీ అభిప్రాయమేంటి? 

‘‘కొన్ని విషయాలు నేను తొలిసారి సినిమా చేసేటప్పుడు మిస్‌ అయితే దాన్ని రెండోసారి చేయడం నాకెలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే మీరన్నదీ నిజమే.. చెప్పిన కథ మళ్లీ మళ్లీ చెప్పాలంటే పరమ బోరింగ్‌గానే అనిపిస్తుంది. కాకపోతే కొన్ని కారణాల వల్ల నా కథల్ని నేనే మళ్లీ మళ్లీ రీమేక్‌ చేయాల్సి వస్తోంది (నవ్వుతూ)’’. 

ఓటీటీల వల్ల ప్రస్తుతం ప్రేక్షకులు ప్రతి హిట్‌ సినిమాని నేరుగా ఆయా భాషల్లోనే చూసేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ‘సర్ఫిరా’ చేయాలనుకోవడం సరైన నిర్ణయమేనా?

‘‘ఈ ఓటీటీ యుగంలో రీమేక్‌ కథలు చెప్పొచ్చా.. చెప్తే చూస్తారా? అన్న భయాలు కచ్చితంగా వెంటాడుతూనే ఉంటాయి. ఈ చిత్ర విషయంలోనూ ఆ భయాలున్నాయి. కాకపోతే ‘ఆకాశం నీ హద్దురా’ని ఓటీటీలో ఎంతమంది చూసుంటారు. ఈ కథను చూడని వాళ్లు చాలా మందే ఉండి ఉంటారు కదా. అలాంటి వాళ్లకు ఆ కథను అక్కడి పరిస్థితులకు తగ్గట్లుగా.. వాళ్ల సూపర్‌స్టార్స్‌తో చెప్పినప్పుడు దానికంటూ ఓ మార్కెట్‌ ఉంటుంది కదా. దాన్ని లక్ష్యం చేసుకునే మేమీ చిత్రం రీమేక్‌ చేశాం’’.

ఈ కథను అక్షయ్‌ కుమార్‌ కన్నా ముందు ఇంకెవరితోనైనా చేయాలనుకున్నారా?

‘‘ఈ సినిమా రీమేక్‌ చేయాలన్న ఆలోచనలో ఉన్నప్పుడు ఓ హిందీ హీరో మమల్ని సంప్రదించారు. కానీ, నాకు చేయాలని లేదని చెప్పా. ఆ తర్వాత నా ఫ్రెండ్‌ ఒకరు ‘ఎందుకు రీమేక్‌ చేయనంటున్నావు.. ఒకవేళ అక్షయ్‌ కుమార్‌ చేస్తానన్నా చేయవా’ అని అడిగారు. తను చేస్తానంటే మాత్రం కచ్చితంగా చేస్తానన్నా. ఎందుకంటే ఇలాంటి కథను ఆయనలాంటి పెద్ద స్టార్‌ చేస్తున్నప్పుడు దాన్ని ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ చేయగలుగుతాం. అందుకే దీన్ని అక్షయ్‌తో కచ్చితంగా చేయాలనుకున్నా’’.

మీ సినిమాల్లో మహిళా పాత్రలు చాలా శక్తిమంతంగా కనిపిస్తుంటాయి. అవన్నీ మీ వ్యక్తిత్వానికి అద్దం పడుతుంటాయా? మీ ఇంట్లో చూసిన వ్యక్తుల్ని ప్రతిబింబిస్తుంటాయా?

‘‘నా సినిమాల్లో కనిపించే ప్రతి మహిళా పాత్రలోనూ ఎక్కడోక చోట కొంచమైనా ఈ సుధ కనిపిస్తుంది. నాకు సున్నితంగా మాట్లాడటం తెలియదు. ‘గురు’ సినిమాలో హీరోయిన్‌ మాట్లాడినట్లు కొట్టినట్లుగా.. ముక్కు సూటిగానే ఉంటుంది. ఆ వ్యక్తిత్వమే నా కథానాయికల పాత్రల్లో ప్రతిబింబిస్తుంటుంది. ఇక మా ఇంట్లో వాళ్ల విషయానికొస్తే మా నాయనమ్మ ప్రభావం కూడా నేను రాసుకునే పాత్రల్లో కనిపిస్తుంటుంది’’. 

ఇండస్ట్రీలో మీరు 20ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. ఇప్పటి వరకు ఆరు చిత్రాలే చేశారు. ఈ ప్రయాణం నెమ్మదిగా సాగుతున్నట్లు అనిపించట్లేదా? 

‘‘నాకూ అదే అనిపిస్తుంది. కాకపోతే నేనింత కంటే వేగంగా ముందుకు వెళ్లలేను అనిపిస్తుంది. ఓసారి నేను ఇదే విషయమై నిర్మాత సురేశ్‌బాబు దగ్గర ఆందోళన పడుతుంటే.. ఆయన ఒకటే మాటన్నారు. ‘అమ్మా.. నీ డీఎన్‌ఏనే ఇంత.. నువ్వొక రాజ్‌కుమార్‌ హిరాణీ అనుకుని సంతోషపడు’ అన్నారు (నవ్వుతూ). నిజానికి నాకు ఎవరు రాసినా నచ్చదు. నా కథల్ని నేనే రాసుకోవాలి. దానిపై నైపుణ్యం పెంచుకుని పగడ్బందీగా స్క్రిప్ట్‌ సిద్ధం చేసుకోవడానికి చాలా టైమ్‌ పడుతుంది. అందుకే ఈ సినీ ప్రయాణం నిదానంగా సాగుతుందని ఏమీ బాధ పడట్లేదు. నాకైతే సంతృప్తిగానే ఉంది’’.

తెలుగులో మీ తదుపరి చిత్రం ఎప్పుడు? సూర్యతో చేయాలనుకున్న కొత్త ప్రాజెక్ట్‌ ఏమైంది?

‘‘సూర్యతో చేయాల్సిన ప్రస్తుతానికైతే ఆగింది. దాన్ని నేను ఇంకెవరితోనూ చేయట్లేదు’’.  

మీకు మీ తొలి విమాన ప్రయాణ అనుభవాలు గుర్తున్నాయా?

‘‘ఉన్నాయి. నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు తొలిసారి ముంబయికి విమానంలో వెళ్లా. అప్పట్లో ఎయిర్‌ ఇండియానే ఉండేది. విమానంలోకి ఎక్కాక ఒక ప్యాకెట్‌లో చాక్లెట్లు.. మరో ప్యాకెట్‌లో కాటన్‌ ఇచ్చే వాళ్లు. మేము చిన్నపిల్లలం కదా.. చాక్లెట్లు చాలా తీసుకోవాలన్న ఆతృతలో చూసుకోకుండా కాటన్‌ ప్యాకెట్లు తీసేసుకున్నాం. అది చూసి అందులో ఉన్న ఎయిర్‌హోస్టెస్‌ నవ్వుకుని నా దగ్గరున్న కాటన్‌ తీసుకొని చాలా చాక్లెట్స్‌ ఇచ్చి వెళ్లింది. అది మర్చిపోలేని జ్ఞాపకం’’.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని