Ravanasura: కొత్తగా ప్రయత్నిస్తేనేమో రిస్క్‌ అంటారు!

‘‘సర్‌ప్రైజ్‌.. షాక్‌.. థ్రిల్‌.. ఈ మూడు అంశాలతో అలరించే చిత్రమే ‘రావణాసుర’’ అన్నారు సుధీర్‌ వర్మ. ఆయన దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన చిత్రమే ‘రావణాసుర’. సుశాంత్‌ కీలక పాత్ర పోషించారు.

Updated : 05 Apr 2023 07:13 IST

‘‘సర్‌ప్రైజ్‌.. షాక్‌.. థ్రిల్‌.. ఈ మూడు అంశాలతో అలరించే చిత్రమే ‘రావణాసుర’’ అన్నారు సుధీర్‌ వర్మ. ఆయన దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన చిత్రమే ‘రావణాసుర’. సుశాంత్‌ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు సుధీర్‌.

‘రావణాసుర’ కథేంటన్నది ఇంత వరకు బయటపెట్టలేదు. అసలు సినిమా ఎలా ఉంటుంది?

‘రావణాసుర’ ఓ కొత్త జానర్‌లో సాగే సినిమా. ఇలాంటి కథ తెలుగులో ఇంత వరకు రాలేదు. ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. ఇందులో ఉన్న ట్విస్ట్‌లు, షాకింగ్‌ అంశాలే దీనికి ప్రధాన ఆకర్షణ. అవేంటన్నది ముందే చెబితే సినిమా చూసేటప్పుడు ఆ థ్రిల్‌ను మిస్సవుతారు. అందుకే కథేంటన్నది ఎక్కడా బయట పెట్టడం లేదు. దీన్ని హిందీ, తమిళ్‌లోనూ విడుదల చేయాలని అనుకున్నాం. కానీ, వాళ్లకు 15రోజుల ముందు కాపీ ఇవ్వాలి. అయితే మేము ఏదైతే దాస్తూ వచ్చామో అది బయటకు వచ్చేస్తుందనే భయంతో ముందు తెలుగులోనే విడుదల చేయాలని అనుకున్నాం. రెండో వారం నుంచి హిందీలో విడుదల చేయాలని అనుకుంటున్నాం’’.

రవితేజతో ఇలాంటి థ్రిల్లర్‌ చిత్రమే చేయాలని ఎందుకనిపించింది

‘‘ఆయనతో ప్రత్యేకంగా ఫలానా కథలే చేయాలని నియమాలేం పెట్టుకోలేదు. ఈ కథను తొలుత విన్నది రవితేజనే. ఆయనే ఈ కథ నేను తెరకెక్కిస్తే బాగుంటుందని నమ్మి రచయిత శ్రీకాంత్‌ను నా దగ్గరకు పంపించారు. ఆ కథ విన్నాక నాకూ బాగుందనిపించింది. దానికితోడు ఇలాంటి థ్రిల్లర్‌ను ఓ పెద్ద హీరో చేసేందుకు ముందుకు రావడం ఇంకా నచ్చింది. అందుకే ఈ సినిమా తెరకెక్కించాలని నిర్ణయించుకున్నా. ఫస్ట్‌కాపీ చూసుకున్నాం. చిత్రంపై చాలా నమ్మకంతో ఉన్నాం. రవితేజ ఎంతో అద్భుతంగా నటించారు. నటన పరంగా ఆయన సినిమాల్లో టాప్‌-3లో ఉంటుంది’’.

గత రెండేళ్లుగా హీరోలని గ్రే షేడ్స్‌లో చూపించడమన్నది ట్రెండ్‌గా మారింది. మీరు ఈ చిత్రంతో అదే అనుసరించినట్లున్నారు కదా

‘‘హీరోని ప్రతినాయక ఛాయలున్న పాత్రలో చూపించడమన్నది ఎప్పటి నుంచో ఉంది. ‘అంతం’లో నాగార్జున, ‘సత్య’లో జేడీ చక్రవర్తి.. ఇవన్నీ గ్రేనే. కాకపోతే ఈ మధ్య అలాంటి పాత్రలు ఎక్కువయ్యాయి. కానీ, ఓ ప్రేక్షకుడిగా ఆ హీరోలు ఏం చేసినా మనకు నచ్చుతుంది. ఏ దర్శకుడైనా సరే తాను హీరోని ఏ కోణంలో చూపించినా.. తాను చెప్పాలనుకున్న కథను ఎలా చెప్పాడన్న దానిపైనే విజయం ఆధారపడి ఉంటుంది. ఈ చిత్రంలోనూ హీరో పాత్రలో మరో కోణం ఉంటుంది. అదేంటన్నది చూశాక మీరు వందశాతం తృప్తి చెందుతారు. సినిమా చూశాక మన సెన్సిబిలిటీస్‌ మిస్‌ అయ్యామన్న ఫీలింగ్‌ మీకు ఎక్కడా రాదని నా నమ్మకం’’.

వేరే రచయిత కథను డైరెక్ట్‌ చేయడం ఎలా ఉంటుంది

‘‘కచ్చితంగా ఒక సవాల్‌ ఉంటుంది. నా కథైతే నా ఊహలకు అనుగుణంగా రాసుకుంటాను. అవసరమైతే ఏదైనా మార్పు చేయడం కూడా చాలా సులువు. వేరే కథలో మార్పు చేసినప్పుడు ఆ మార్పు మిగతా విభాగాలపై ఎంత ప్రభావం చూపిస్తుందనేది రచయితతో కూర్చొని చర్చించి నిర్ణయించుకోవాలి’’.

మీరెక్కువగా థ్రిల్లర్‌ కథలతోనే ప్రయాణించడానికి   కారణమేంటి

‘‘నాకు క్రైమ్‌ జానర్‌లో సినిమాలు చేయడం చాలా ఇష్టం. ప్రేక్షకుల్ని థియేటర్‌లో కూర్చోబెట్టగలిగే చేయడం.. తర్వాత ఏం జరుగుతుందని వారిలో ఆసక్తిరేకెత్తించేలా చేయడం నాకు బాగా నచ్చుతుంది. అందుకే ఎక్కువగా ఆ తరహా కథలతో ప్రయాణిస్తుంటా’’.

పవన్‌ కల్యాణ్‌తో సినిమా ప్లాన్‌ చేస్తున్నట్లున్నారు

‘‘అది త్రివిక్రమ్‌ గారి కథతో ఉంటుంది. అయితే అది ఎప్పుడు.. ఏంటి అనేది త్వరలో తెలుస్తుంది. ప్రస్తుతం నిఖిల్‌ హీరోగా ఓ చిత్రం చేస్తున్నా.      చిత్రీకరణ దశలో ఉంది’’

కథను ఇంత సీక్రెట్‌గా ఉంచాలనుకోవడం కూడా రిస్కే కదా?

‘‘అన్ని సినిమాలు ఒకేలా చేస్తున్నారని అంటారు. కొత్తగా చేస్తే ఎందుకు ఇలాంటి రిస్క్‌ అని మీరే అంటారు (నవ్వుతూ). ఇది రిస్కే. కథ విన్నాక మాకెలాంటి ఆసక్తి కలిగిందో.. ఆ అనుభూతిని ప్రేక్షకులకు పంచివ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం’’.

ఈ ‘రావణాసుర’ పాత్ర మణిరత్నం ‘రావణ్‌’ను ఏమైనా గుర్తు చేస్తుందా? దీనికి సీక్వెల్‌ ఆలోచనలున్నాయా?

‘‘మణిరత్నం సరిగ్గా రామాయణమే తీశారు. అయితే ఇందులో నా హీరో పాత్రకు రావణాసుర పేరే సరిగ్గా నప్పుతుంది. అలాగని నేనేమీ రామాయణంలోకి వెళ్లలేదు. అయితే రావణాసుర అనే పేరు పెట్టాక దానికి తగ్గట్లుగా కొన్ని సరిపోయే డైలాగ్‌లు పెట్టాం. అంతే తప్ప రామయణంతో ఏ సంబంధం లేదు. ఈ కథలో బోలెడన్ని పాత్రలున్నా.. ప్రతిదీ కీలకంగానే ఉంటుంది. ఈ సినిమాకి ఒక మంచి ముగింపు ఉంటుంది. అయితే సీక్వెల్‌ చేయాలని అనుకున్నప్పుడు అక్కడి నుంచే ముందుకు వెళ్లే అవకాశం కూడా ఉంటుంది’’.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని