Suhas: ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు!

‘‘ప్రేక్షకుల్ని ఆద్యంతం అలరించే చిత్రం ‘రైటర్‌ పద్మభూషణ్‌’ (Writer padmabhushan). సినిమా చూసి అందరూ బరువైన భావోద్వేగాలు.. మంచి చిరునవ్వులతో బయటకొస్తారు’’ అన్నారు నటుడు సుహాస్‌ (Suhas).

Updated : 27 Jan 2023 07:04 IST

‘‘ప్రేక్షకుల్ని ఆద్యంతం అలరించే చిత్రం ‘రైటర్‌ పద్మభూషణ్‌’. సినిమా చూసి అందరూ బరువైన భావోద్వేగాలు.. మంచి చిరునవ్వులతో బయటకొస్తారు’’ అన్నారు నటుడు సుహాస్‌ (Suahs). ‘కలర్‌ఫొటో’ (Colour Photo)తో తొలి ప్రయత్నంలోనే హీరోగా మెప్పించిన ఆయన.. ఇప్పుడు ‘రైటర్‌ పద్మభూషణ్‌’ (Writer Padmabhushan)గా వినోదాలు పంచేందుకు సిద్ధమయ్యారు. షణ్ముఖ ప్రశాంత్‌ తెరకెక్కించిన ఈ చిత్రం ఫిబ్రవరి 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు సుహాస్‌.


* ‘‘ఇది చాలా మంచి కుటుంబ కథా చిత్రం. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. ప్రథమార్ధంలో రెండు, ద్వితీయార్థంలో మూడు ట్విస్ట్‌లు వస్తాయి. క్లైమాక్స్‌లో ఇంకా చాలా మంచి ట్విస్ట్‌ ఉంటుంది. ప్రతి మలుపుని ప్రేక్షకులు బాగా ఎంజాయ్‌ చేస్తారు. ముఖ్యంగా క్లైమాక్స్‌కు అందరూ కనెక్ట్‌ అవుతారు. ఆశిష్‌ విద్యార్థి, రోహిణీ, గోపరాజు రమణ లాంటి నటులు ఇందులో భాగమవ్వడం మా అదృష్టం’’.


* ‘‘ప్రశాంత్‌ నా ‘కలర్‌ఫొటో’ చిత్రానికి సహాయ దర్శకుడిగా చేశాడు. తర్వాత ‘ఫ్యామిలీ డ్రామా’ సినిమాకి రచయితగా చేశాడు. ఆ తర్వాత తను నాకీ కథ చెప్పాడు. విన్న వెంటనే బాగా నచ్చి చేస్తానని చెప్పా. ఈ సినిమాని మేము 60రోజుల్లో పూర్తి చేయాలనుకున్నాం. కానీ, పక్కా ప్రణాళికతో 43రోజుల్లోనే పూర్తి చేశాం. మేము ట్రైలర్‌లో చెప్పనిది ఒకటి సినిమాలో వస్తుంది. అదేంటన్నది తెరపై చూస్తేనే బాగుంటుంది’’.


* ‘‘ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పుడు చిన్న పాత్రలు చేస్తే చాలనుకున్నాను. ఇప్పుడు చాలా మంచి పాత్రలొస్తున్నాయి. రచయితల వల్లే చాలా విభిన్నమైన పాత్రలు పోషించే అవకాశం దొరుకుతోంది. ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదని నా మిత్రులతో అంటుంటా. ప్రస్తుతం నేను గీతా ఆర్ట్స్‌2లో ఓ చిత్రం చేస్తున్నా. చిత్రీకరణ పూర్తయింది. అలాగే ‘ఆనందరావు అడ్వంచర్స్‌’ అనే మరో సినిమా చేస్తున్నా’’.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని