Sukumar: రాజమౌళి.. ఈ కుర్చీ మీ కోసమే: సుకుమార్‌

‘రాజమౌళి.. ఈ కుర్చీ మీ కోసమే’ అంటూ సుకుమార్‌ పెట్టిన పోస్ట్‌ నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ కుర్చీ కథేంటంటే?

Published : 26 Jan 2023 01:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన సినిమాలతోనేకాదు వేదికలపై ఇచ్చే స్పీచ్‌తోనూ, సోషల్‌ మీడియాలో పెట్టే పోస్ట్‌లతోనూ దర్శకుడు సుకుమార్‌ (Sukumar) వావ్ అనిపిస్తుంటారు. రాజమౌళికి తనదైన శైలిలో అభినందనలు తెలియజేసి, నెటిజన్లను మరోసారి తనవైపు తిప్పుకున్నారు. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR)లోని ‘నాటు నాటు’ (Naatu Naatu) గీతం ప్రఖ్యాత ఆస్కార్‌కు నామినేట్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాజమౌళికి విభిన్న తరహాలో శుభాకాంక్షలు చెప్పారు సుకుమార్‌. ఓ మీటింగ్‌ రూమ్‌లో తన బృందంతో కలిసి దిగిన ఫొటోను పంచుకుంటూ అక్కడ ఖాళీగా ఉన్న కుర్చీ గురించి వివరించారు.

‘‘ఇన్నాళ్లూ నా బృందంతో జరిపిన చర్చలు, సమావేశాల్లో అసంకల్పితంగా ప్రిన్సిపల్‌ కుర్చీని ఖాళీగా వదిలేశా. నేనెందుకు అలా చేశానో ఇప్పుడు నాకు అర్థమైంది. రాజమౌళి సర్‌ ఇది మీ కోసమే. ఈ కుర్చీ ఎప్పటికీ మీదే’’ అంటూ సుకుమార్‌.. రాజమౌళిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం, ఆ పాటను రాసిన చంద్రబోస్‌, స్వరాలు సమకూర్చిన ఎం. ఎం. కీరవాణి, గాయకులు రాహుల్‌ సిప్లిగంజ్‌, కాలభైరవ కొరియోగ్రాఫర్‌ ప్రేమ్‌రక్షిత్‌ సహా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు పనిచేసిన ప్రతి ఒక్కరికీ ఆయన కంగ్రాట్స్‌ చెప్పారు (Oscars Nominations 2023). ‘మీ అభినందన అదిరింది’, ‘మంచి ఎలివేషన్‌ ఇచ్చారు’ అంటూ నెటిజన్లు సుకుమార్‌ పోస్ట్‌ను ‘లైక్‌’ చేస్తున్నారు. సుకుమార్‌ ప్రస్తుతం అల్లు అర్జున్‌ హీరోగా ‘పుష్ప 2’ తెరకెక్కిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని