Adipurush: ‘ఆదిపురుష్‌’.. లక్ష్మణుడి పాత్ర గురించి రామాయణం నటుడు ఏమన్నారంటే..!

ప్రభాస్‌ (Prabhas) ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఆదిపురుష్‌’ (Adipurush) జూన్‌ 16న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో ‘రామాయణం’ సీరియల్‌లో లక్ష్మణుడి పాత్రతో మెప్పించిన సునీల్‌ లహ్రీ (Sunil Lahiri) ఓ ఇంటర్వ్యూలో ఈ చిత్రం గురించి మాట్లాడారు.

Published : 04 Jun 2023 13:59 IST

హైదరాబాద్‌: ప్రస్తుతం సినీప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా ‘ఆదిపురుష్‌’ (Adipurush). మరికొన్నిరోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్రంపై, ఇందులోని లక్ష్మణుడి పాత్రపై రామాయణం (Ramayan) సీరియల్‌ నటుడు సునీల్‌ లహ్రీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు దూరదర్శన్‌లో ప్రసారమైన రామాయణం సీరియల్‌లో సునీల్‌ లహ్రీ (Sunil Lahiri) లక్ష్మణుడిగా అందరినీ మెప్పించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’ గురించి మాట్లాడారు.

ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ‘ఆదిపురుష్‌’లో లక్ష్మణుడిగా సన్నీ సింగ్‌ (Sunny Singh) నటిస్తున్నారు. ఆయన గురించి సునీల్‌ లహ్రీ మాట్లాడుతూ.. ‘‘సినిమాలోని పాత్రలపై దర్శకుడు, రచయిత, ఎడిటర్‌ అందరి ప్రభావం ఉంటుంది. రామయణం సీరియల్‌లో నా పాత్రకు దర్శకుడి వల్లనే అంత మంచి గుర్తింపు వచ్చింది. నేను ఆయన చెప్పినట్లు చేశానంతే. ఇక ‘ఆదిపురుష్‌’లో లక్ష్మణుడి పాత్ర ఎలా ఉందని ఇప్పుడే చెప్పడం కష్టం. ఎందుకంటే ట్రైలర్‌లో లక్ష్మణుడి పాత్రను చాలా తక్కువగా చూపించారు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను. సన్నీ సింగ్‌ ఆ పాత్రకు కచ్చితంగా న్యాయం చేస్తాడు. అతను గొప్ప నటుడు. అంతేకాకుండా అతడికి గతంలోనూ ఇలాంటి పాత్రలు చేసిన అనుభవం ఉంది. సినిమా విడుదల కోసం నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’ అంటూ చిత్రబృందానికి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు.

ఓం రౌత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆదిపురుష్‌’లో ప్రభాస్‌ (Prabhas) రాఘవుడిగా నటిస్తుండగా.. కృతి సనన్‌ జానకిగా కనిపించనుంది. రావణుడిగా సైఫ్‌ అలీ ఖాన్‌, హనుమాన్‌గా దేవదత్త నాగే నటిస్తున్నారు. జూన్‌ 16న తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈనెల 6న తిరుపతిలో భారీ ఎత్తున ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని