Telugu Comedians: వీళ్లు కమెడియన్స్‌ మాత్రమే కాదు.. అంతకుమించి..

Telugu Comedians: ఒకప్పుడు వరుసగా హస్య ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించిన కమెడియన్స్‌ విభిన్న పాత్రలు పోషిస్తూ మెప్పిస్తున్నారు.

Updated : 04 Apr 2023 10:12 IST

వరసాల్లోకెల్లా కష్టమైనది హాస్యరసం. దానితో ప్రేక్షకుడిని మెప్పించగలిగిన వాడు దేనినైనా అలవోకగా చేసేస్తాడు. తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న కమెడియన్స్‌ మరే చిత్ర పరిశ్రమలోనూ లేరు. ఇటీవల కాలంలో కామెడీ చిత్రాలు తగ్గాయి. కథలో భాగంగా కొన్ని సన్నివేశాలకే కమెడియన్స్‌ పరిమితమైపోయారు. ఇలాంటి సమయంలో కొందరు హాస్యనటులు విభిన్న పాత్రలు ఎంచుకుని ‘వావ్‌’ అనిపించారు. తమ అనుభావాన్ని రంగరించి ప్రేక్షకులను మైమరిపింజేశారు. ఇంతకీ ఆ కమెడియన్స్‌ ఎవరు? ఏయే పాత్రలతో మెప్పించారు.

రంగస్థల నటుడిగా జీవించిన బ్రహ్మానందం

‘బ్రహ్మానందం’.. (Brahmanandam) ఈ పేరు చెప్పగానే ప్రతి తెలుగువాడి పెదవిపై చిరునవ్వు మెరుస్తుంది. ఆయన పాత్రలతో చేసినన్ని మీమ్స్‌ మరే నటుడితోనూ చేయలేదంటే అతిశయోక్తి కాదు. ఆయన ఎక్స్‌ప్రెషన్‌ ఒక్కటి చాలు ఆ సందర్భం ఏంటో చెప్పడానికి. అలాంటి బ్రహ్మానందం తాజాగా నటించిన చిత్రం ‘రంగమార్తాండ’. అందులో చక్రపాణిగా కొత్త కోణంలో కనిపించారు. ‘ఒంటరి జననం ఏకాకి మరణం.. నడుమంతా నాటకం.. జగన్నాటకం’ అంటూ ఆయన సంభాషణలు చెబుతుంటే ఈ పాత్ర చేసింది మన బ్రహ్మానందమేనా అనిపించింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరి హృద‌యాల్ని బ‌రువెక్కించేలా నటించి మెప్పించారు.


కోవై సరళ నట విశ్వరూపం

సాధారణంగా చిత్ర పరిశ్రమలో హాస్య నటులకు కొదవ ఉండదు కానీ, హాస్య నటీమణులు చాలా తక్కువ. ఆ ఖాళీ భర్తీ చేస్తూ ఎంతో కాలం ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టారు కోవై సరళ (Kovai Sarala). బ్రహ్మానందంతో కలిసి ఆమె చేసిన ప్రతి కామెడీ ట్రాక్‌ సూపర్‌హిట్‌. అలాంటి కోవై సరళ తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. తమిళంలో ఆమె నటించిన చిత్రం ‘సెంబి’. మనవరాలికి జరిగిన అన్యాయంపై పోరాటం చేసే బామ్మగా వీరతల్లి పాత్రలో కోవై సరళ నటన నభూతో.. కొన్ని సన్నివేశాలు చూస్తే థియేటర్‌లో ప్రేక్షకుడికి కన్నీళ్లు రాకుండా ఉండవు. తెలుగులోనూ ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో ఉంది.


రూటు మార్చిన సునీల్‌

తెలుగులో హాస్యనటుడిగా తనదైన ముద్రవేశారు సునీల్‌ (Sunil). అంతేకాదు, కథానాయకుడిగానూ మెప్పించారు. అయితే, ఇవేవీ ఆయన నట దాహాన్ని తీర్చలేదు. గత కొంతకాలంగా తన ట్రాక్‌ను పూర్తిగా మార్చేశారాయన. ఒకవైపు తనదైన కామెడీని పంచుతూ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మెప్పిస్తున్న సునీల్‌ తన చిరకాల కోరికైన విలన్‌ పాత్రలతో రాణిస్తున్నారు. ‘డిస్కోరాజా’, ‘కలర్‌ ఫోటో’ చిత్రాలే అందుకే నిదర్శనం. ఇక సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’లో మంగళం శ్రీనుగా ఆయన నటన, ఆహార్యంలో కొత్త కోణాన్ని చూపించింది. ‘కట్టమీద కూర్చొని కూతలు కూసేదానికేముందులే కానీ, నీళ్లలోకి దిగితే తెలుస్తదబ్బా లోతు’ అంటూ చిత్తూరు యాసలో ఆయన డిక్షన్‌ కూడా మెప్పించింది. ఇక ‘పార్ట్‌2’లో ఆయన పాత్ర కూడా కీలకం కానుంది. అలాగే రజనీకాంత్‌ నటిస్తున్న ‘జైలర్‌’లోనూ సునీల్‌ ప్రతినాయకుడి ఛాయలున్న పాత్రలో కనిపించనున్నారట.


నిజంగా మన సూరినేనా?

మిళంలో హాస్యనటుడిగా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పిస్తున్నారు సూరి (Soori). అగ్ర కథానాయకులందరితోనూ ఆయన నటించారు. సరైన పాత్ర పడితే ఎలా అదరగొడతారో ‘విదుతలై పార్ట్‌-1’లో చూపించారు. వెట్రిమారన్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇటీవల విడుదలై బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ తెచ్చుకుంది. ముఖ్యంగా ఇందులో సూరి నటన విమర్శకులను సైతం మెప్పించింది. కుమరేశన్‌గా కానిస్టేబుల్‌ పాత్రలో సూరి అదరగొట్టారు.


ప్రియదర్శి నట వైవిధ్యం

హాస్య నటుడిగానే వెండితెరకు పరిచయమైనా విభిన్న పాత్రలతో మెప్పిస్తున్నాడు ప్రియదర్శి (priyadarshi). ఒకవైపు హాస్యనటుడిగా నవ్విస్తూనే వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతున్నాడు. గతంలో ‘మల్లేశం’తో అలరించిన ఆయన ఇటీవల ‘బలగం’లోనూ తనదైన నటనను ప్రదర్శించారు.


వెబ్‌సిరీస్‌తో మెప్పించిన సత్యం రాజేశ్‌

నదైన కామెడీ టైమింగ్‌తో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న నటుడు ‘సత్యం’ రాజేశ్‌ (Satyam Rajesh). ‘మా ఊరి పొలిమేర’ వెబ్‌సిరీస్‌తో ఆయన నటనలో కొత్త కోణం ఆవిష్కృతమైంది. ఉత్కంఠగా సాగే ఆ వెబ్‌సిరీస్‌లో కొమిరిగా చివరిలో ఆయన ఇచ్చే ట్విస్ట్‌కు సిరీస్‌ చూస్తున్న ప్రేక్షకుడి మైండ్‌ బ్లాంక్‌ అయిపోతోంది. కరోనా టైమ్‌లో వచ్చిన ఈ సిరీస్‌ నెటిజన్లను విశేషంగా అలరించింది. ఇప్పుడు ఈ సిరీస్‌కు కొనసాగింపుగా ‘మా ఊరి పొలిమేర2’ రాబోతోంది. మరి ఇందులో ఆయనెలా అలరిస్తారో చూడాలి.


‘గూఢచారి’లో ట్విస్ట్‌ ఇచ్చిన వెన్నెల కిషోర్‌

వెన్నెల కిషోర్‌ (Vennela Kishore) కెరీర్‌లో గుర్తుండిపోయే అతి కొద్ది సినిమాల్లో ‘గూఢచారి’ ఒకటి. సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి ఏమాత్రం అనుమానం రాకుండా షామ్‌ పాత్రలో కనిపించిన ఆయన క్లైమాక్స్‌లో ఇచ్చే ట్విస్ట్‌ హైలైట్‌.


దర్శకత్వంతో మెప్పించిన వేణు

హాస్యనటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్నారు వేణు (Venu). బుల్లితెరపై ‘జబర్దస్త్‌’ షో ప్రతి తెలుగువాడికి ఆయనను దగ్గర చేసింది. అయితే, తనలో మంచి దర్శకుడు ఉన్నాడన్న సంగతి ‘బలగం’తో తెలిసింది. తెలంగాణ పల్లె వాతావరణాన్ని, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఆయన తెరకెక్కించిన ఈ చిత్ర బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకోవడమే కాదు, సగటు ప్రేక్షకుడిని భావోద్వేగానికీ గురిచేసింది. సినీ పరిశ్రమకు చెందిన అగ్ర హీరోలు సైతం ‘బలగం’ చిత్రాన్ని మెచ్చుకుని, వేణుపై ప్రశంసలు కురిపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని