Super star Krishna: పడి లేచిన కెరటం

విమర్శలు, పరాజయాలు కృష్ణకి కొత్త కాదు. తొలి సినిమా రోజుల్లోనే ఎదురైన విమర్శల్ని సవాల్‌గా స్వీకరించి పట్టుదలతో ఎదిగారు. యాభయ్యేళ్ల సినీ ప్రయాణంలో మూడుసార్లు ‘కృష్ణ పని ఇక అయిపోయినట్టే’ అనే మాటలు వినిపించాయి.

Updated : 16 Nov 2022 07:12 IST

విమర్శలు, పరాజయాలు కృష్ణకి (super star krishna) కొత్త కాదు. తొలి సినిమా రోజుల్లోనే ఎదురైన విమర్శల్ని సవాల్‌గా స్వీకరించి పట్టుదలతో ఎదిగారు. యాభయ్యేళ్ల సినీ ప్రయాణంలో మూడుసార్లు ‘కృష్ణ పని ఇక అయిపోయినట్టే’ అనే మాటలు వినిపించాయి. వరుస పరాజయాలే అందుకు కారణం. అలా పడిపోయిన ప్రతిసారీ లేచి నిలిచిన కెరటం కృష్ణ. వందో చిత్రం ‘అల్లూరి సీతారామరాజు’ తర్వాత ఆయనకి వరుసగా పరాజయాలే. 1966లో ‘గూఢచారి 116’ విడుదలైనప్పటి నుంచి 1975వరకు పదేళ్లపాటు విరామం అన్నది లేకుండా పనిచేశారు. కానీ ‘అల్లూరి సీతారామరాజు’ విడుదల తర్వాత వరుసగా 14 సినిమాలు  పరాజయాన్ని చవిచూశాయి. శక్తివంతమైన అల్లూరి పాత్రలో కృష్ణని చూసిన ప్రేక్షకులు... అవే అంచనాలతో ఆయన సినిమాల్ని చూసేందుకొచ్చేవారు. బాక్సాఫీసు ముందుకు వచ్చిన సినిమా వచ్చినట్టే వెనక్కి వెళ్లిపోయేది. 1974లో ‘అల్లూరి సీతారామరాజు’ మినహా ‘రాధమ్మ పెళ్లి’, ‘గౌరి’, ‘ఆడంబరాలు - అనుబంధాలు’, ‘దీర్ఘసుమంగళి’, ‘ఇంటింటి కథ’, ‘ధనవంతులు - గుణవంతులు’, ‘సత్యానికి సంకెళ్ళు’, ‘దేవదాసు’ తదితర చిత్రాలు పరాజయాన్ని చవిచూశాయి. 1975లోనూ అంతే. ఏడాదికి పదిహేను సినిమాలు చేసిన ఆయనకి 1975 ద్వితీయార్థంలో చేయడానికి చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. పదేళ్లకే కెరీర్‌ ముగిసిందా? అనే సందేహం. అప్పుడు సొంత సంస్థలోనే పీసీ రెడ్డి దర్శకత్వంలో ‘పాడిపంటలు’ చేసి మళ్లీ విజయాన్ని అందుకున్నారు. 1995కి ముందు కూడా ఆయనకి వరుసగా పరాజయాలే. మరోసారి కృష్ణ కెరీర్‌ ముగిసినట్టే అనే మాటలు వినిపించాయి. ‘పచ్చని సంసారం’తో మళ్లీ కొత్త ఇన్నింగ్స్‌కి శ్రీకారం చుట్టిన ఆయన విజయాన్ని అందుకున్నారు. ‘వారసుడు’, ‘రౌడీ అన్నయ్య’, ‘నెంబర్‌ వన్‌’, ‘అమ్మ దొంగా’, ‘సంప్రదాయం’, ‘జగదేకవీరుడు’, ‘ఎన్‌కౌంటర్‌’ తదితర చిత్రాలు చేసి ప్రేక్షకుల్ని మెప్పించారు. యాభయ్యేళ్ల పాటు సాగిన కెరీర్‌ ఆయనది.

కృష్ణ.. పాన్‌ వరల్డ్‌ సినిమా!

పాన్‌ ఇండియా.. పాన్‌ వరల్డ్‌ అన్న పదాలు ఇప్పుడు చిత్రసీమలో ఓ ట్రెండ్‌లా మారిపోయాయి. కృష్ణ 80ల్లోనే ఈ తరహా సినిమాలతో తెరపై మెరిపించారు. కృష్ణ చేసిన తొలి కౌబాయ్‌ చిత్రం ‘మోసగాళ్లకు మోసగాడు’. ఈ సినిమా బాక్సాఫీస్‌ ముందు భారీ వసూళ్లు దక్కించుకుంది. ఈ సినిమా ‘ట్రెజర్‌ హంట్‌’ పేరుతో ఆంగ్ల ప్రేక్షకుల్ని పలకరించింది. 80 దేశాల్లో విడుదలై ప్రపంచ సినీప్రియుల మెప్పు పొందింది. ఇది అప్పట్లో ఓ రికార్డు.

బాలు పాడనంటే...

ప్రముఖ గాయకుడు బాలుతో కృష్ణకు గొడవైంది. కృష్ణ తమిళనాడుకి చెందిన రాజ్‌ సీతారామ్‌ని తీసుకొచ్చి పాడించారు. కృష్ణ - రాజ్‌ సీతారామ్‌ కలయికలో వచ్చిన ‘సూర్యచంద్ర’, ‘సింహాసనం’ మ్యూజికల్‌ హిట్లుగా నిలిచాయి. ఆకాశంలో ఒక తార..., వహవ్వా నీ యవ్వనం, ఇది కలయని నేననుకోనా...  ఇలా ‘సింహాసనం’లోని పాటలన్నీ హిట్‌. రెండేళ్ల తర్వాత గీత రచయిత వేటూరి సుందరరామమూర్తి జోక్యం చేసుకుని కృష్ణ - బాలు మధ్య సయోధ్య కుదిర్చారు. ఆ తర్వాత మళ్లీ ఆ కలయికలో పాటలొచ్చాయి.

ఇద్దరు సూపర్‌స్టార్లు ఒకే తెరపై

సూపర్‌స్టార్‌ అన్న బిరుదును దశాబ్దాలుగా ఓ కిరీటంలా ధరించిన కథానాయకులు తెలుగులో కృష్ణ కాగా.. తమిళంలో రజనీకాంత్‌. వీళ్ల కలయిక వెండితెరపై మూడు సార్లు కుదిరింది. ‘రామ్‌ రాబర్ట్‌ రహీమ్‌’ చిత్రంతో ఇద్దరు సూపర్‌స్టార్‌లను తొలిసారి ఒక తెరపైకి తీసుకొచ్చారు  దర్శకురాలు విజయనిర్మల. ఆ తర్వాత కృష్ణ రజనీలతో ‘అన్నదమ్ముల సవాల్‌’, ‘ఇద్దరూ అసాధ్యులే’ అనే చిత్రాలు తెరకెక్కించారు కె.ఎస్‌.ఆర్‌.దాస్‌.

కలల పాత్ర.. తీరని కోరిక!

కృష్ణ చేయాలనుకొని చేయలేకపోయిన పాత్ర కూడా ఒకటుంది. అదే ఛత్రపతి శివాజీ. ఆ పాత్ర చేయాలని ఎంతో తాపత్రయ పడ్డారట కృష్ణ. కానీ, అది చేస్తే హిందూ ముస్లిం గొడవలు రావొచ్చనే ఉద్దేశంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు ఓ సందర్భంలో పంచుకున్నారు. పూర్తిస్థాయిలో కాకపోయినా ‘చంద్రహాస్‌’ చిత్రంలో కొద్దిసేపు శివాజీ గెటప్‌లో కనిపించారు కృష్ణ. తన తనయుడు మహేష్‌బాబు పూర్తి స్థాయి బాండ్‌ చిత్రం చేస్తే చూడాలని ఆకాంక్షించారు కృష్ణ. ఇంత వరకు ఆ కోరిక తీరలేదు. అలాగే తన మనవడు గౌతమ్‌ కృష్ణతో కలిసి నటించాలనీ అనుకున్నారు. అదీ సాధ్యపడలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని