Rajinikanth: బస్‌ కండక్టర్‌ టు సూపర్‌స్టార్‌.. రజనీకాంత్‌ ఒడుదొడుకుల ప్రయాణమిది

రజనీ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం. బస్‌ కండక్టర్‌ నుంచి సూపర్‌స్టార్‌గా ఆయన ప్రయాణమిదీ..

Published : 12 Dec 2022 09:49 IST

Rajinikanth.. మీరు నల్లగా ఉన్నానని ఫీలవుతున్నారా? జుట్టు సరిగా లేదని బాధపడుతున్నారా? స్టైలిష్‌గా కనిపించలేకపోతున్నానని కుమిలిపోతున్నారా? పెద్ద చదువులు చదువుకోలేదని చింతిస్తున్నారా? చిన్న ఉద్యోగంతో ఎంతకాలం ఈ ‘జీవన పోరాటం’ అని నిస్పృహలో ఉన్నారా? ఇవే కాదు మీకు ఇంకెన్ని సమస్యలున్నా నటుడు రజనీకాంత్‌ (Rajinikanth)ను గుర్తు చేసుకోండి.. ఆయన ప్రస్థానం గురించి తెలుసుకోండి. మిమ్మల్ని మీరు కొత్తగా చూసుకోండి. నేడు రజనీ పుట్టినరోజు సందర్భంగా ఆయన ‘అంతులేని కథ’ (Happy Birthday Rajinikanth)ను చదివేయండి..

సమస్యల నడుమ బాల్యం..

అది 1950 డిసెంబరు 12. ఆ రోజు బెంగళూరులో పదుల సంఖ్యలో చిన్నారులు జన్మించి ఉంటారు. ‘అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించలేరు’ అన్నట్టుగానే ఆ వేలమందిలో శివాజీరావ్‌ గైక్వాడ్‌ (రజనీ కాంత్‌)ను ఎవరూ ప్రత్యేకంగా చూడలేదు. రాణోజీరావు, రాంబాయి దంపతులకు పుట్టిన శివాజీరావ్‌.. మధ్య తరగతి జీవనాన్నే సాగించాడు. ఆరేళ్ల వయసులోనే తల్లిని కోల్పోయాడు. ఇంట్లో ఎన్నో గొడవలు, దూషణలు ఎదురవడంతో చెడు తిరుగుళ్లకు అలవాటు పడ్డాడు. ‘ఎంత చెడ్డవారిలోనైనా ఎప్పుడో ఒకప్పుడు మార్పొస్తుంది’ అన్నది శివాజీరావ్‌ విషయంలోనూ నిజమైంది. రామకృష్ణ మఠం ఆయనలో సత్ప్రవర్తన, ఆధ్యాత్మికతకు బీజాలు నాటింది. ఆర్థిక సమస్యలు వెంటాడడంతో శివాజీ ఎస్‌ఎస్‌ఎల్‌సీ తర్వాత చదువు కొనసాగలేదు. దొరికిన పని చేసుకుంటూ ముందుకు సాగారు. ఆ క్రమంలో కేఎస్‌ ఆర్టీసీలో బస్‌ కండక్టర్‌గా మారారు. ఆ ఉద్యోగమే శివాజీరావ్‌ని రజనీకాంత్‌ అయ్యేలా చేసింది. భారతీయ సినిమా గర్వపడే నటుణ్ని అందించింది.


ఆకట్టుకున్న రైట్‌.. రైట్‌ 

‘ఎక్కడికెళ్లాలమ్మా?.. ఈ లగేజీ మీదేనా?’ అని బస్‌ ఎక్కిన వారిని సాధారణంగా అడిగి ఉంటే శివాజీ గురించి మనం చర్చించుకునేవాళ్లమే కాదు. ‘వృత్తే మనకు దైవం’ అని ఆయన తన సినిమా పాటలో చెప్పినట్టే కండక్టర్‌ విధిని ఎంతో హూందాగా నిర్వర్తించేవారాయన. శివాజీరావ్ టికెట్టు ఇచ్చే విధానం, ‘రైట్‌.. రైట్‌’ అని చెప్పే పద్ధతి, ముఖంపైకి దూసుకొచ్చే జుట్టును పక్కకు జరిపే స్టైల్‌కు ప్యాసింజర్స్‌ ఓ హీరోని చూసినట్టుగా భావించేవారు. అయితే, ప్రయాణికులు సినిమా చూసినట్టు చూసి వదిలేసినా.. బస్‌ డ్రైవర్‌ రాజ్‌ బహదూర్‌.. శివాజీరావ్‌ దృష్టిని నాటకాలవైపు మళ్లించాడు. కండక్టర్‌ పనైనా, నటన అయినా తనకు అన్నీ ఒకటే కాబట్టి శివాజీరావ్‌ అక్కడా తన మార్క్‌ చూపించారు. చిన్న పాత్రతోనూ ప్రేక్షకులను కట్టిపడేసేవారు. కండక్టర్‌గానే శివాజీరావ్‌ మిగిలిపోకూడదని భావించిన రాజ్‌ బహదూర్‌ ఆయన్ను మద్రాసు ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో నటన నేర్చుకునేందుకు ప్రోత్సహించారు. తానే అన్ని అయి అండగా నిలిచారు.


తొలి అవకాశం..

ఆ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు ఎగ్జామినర్‌గా వెళ్లిన  ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్‌.. శివాజీరావ్‌ ప్రతిభను తొలి చూపులోనే గుర్తించి నటుడిగా తన సినిమాలో అవకాశం ఇచ్చారు. అలా ‘అపూర్వ రాగంగళ్‌’తో శివాజీరావ్‌ తెరంగేట్రం చేశాడు. ఆ సినిమాతోనే రజనీకాంత్‌గా అవతరించారు. తెలుగు తెరపై ఆయన కనిపించిన తొలి చిత్రం ‘అంతులేని కథ’ (1975). అప్పటి నుంచే రజనీ, టాలీవుడ్‌ మధ్య విడదీయరాని అనుబంధం ఏర్పడింది. ఆయన నటించిన చాలా సినిమాలు తెలుగులో డబ్‌ అయి సంచనాలు సృష్టించాయి. తెలుగు హీరోలతోనూ ఆయన కలిసి నటించారు. మోహన్‌బాబు హీరోగా తెరకెక్కిన ‘పెదరాయుడు’లో రజనీ ఇచ్చిన తీర్పు వింటే ఇప్పటికీ చప్పట్లు కొట్టాల్సిందే. కెరీర్‌ ప్రారంభంలో ప్రతినాయకుడిగానూ కనిపించిన రజనీ ‘భైరవి’ సినిమాతో సోలో హీరో అయ్యారు. కానీ, దాంతో ఆయన ఆనందపడలేదు. మనలో చాలామంది మనల్ని మనమే తక్కువగా చూసుకుంటాం. అలానే రజనీలోనూ న్యూనతాభావం ఉండేది. నల్లగా ఉన్నానని, అందంగాలేనని ఆయన బాధపడేవారు. తర్వాత దాన్ని అధిగమించి ప్రత్యేకతను చాటారు. సిగరెట్‌ గాల్లోకి విసరడం, తువాలుతో కుర్చీలాగడం, కళ్లజోడు పెట్టడం, జుట్టుగా తిప్పడం.. ఇలా రజనీ ఏది చేసినా కళ్లు అప్పగించడమే ప్రేక్షకుల వంతయ్యేది. ‘నా దారి.. రహదారి’ అని ఆయన ఒక్కసారి చెప్పినా వందసార్లు మారుమోగేది.


బాబా నేర్పిన పాఠం..

నటుడిగా (సూపర్‌)స్టార్‌డమ్‌ అందుకున్నారు. ఎన్నో అవార్డులు- రివార్డులు పొందారు. రూ. కోట్లు ఆర్జించారు. ప్రపంచవ్యాప్తంగా అభిమాన గణాన్ని సంపాదించుకున్నారు. అయితే, అవేవీ రజనీకాంత్‌కు సంతృప్తినివ్వలేదు. తన గమ్యం ఇంకేదో ఉందని మథనపడేవారాయన. ఆ సంఘర్షణ నుంచి బయటపడేందుకు ఆధ్మాత్మికత వైపు మళ్లారు. అది.. తర్వాత ఆయన నటించిన సినిమాలపై ప్రభావం చూపింది. మూడేళ్ల విరామం అనంతరం ఆయన నటించిన ‘బాబా’ ఘోర పరాజయాన్ని చూసింది. దాంతో, ‘ఇక రజనీ పని అయిపోయింది’ అనే ప్రచారం జరిగింది. ఆ సంఘటనలకు కుంగిపోయినా తన సినిమా వల్ల నష్టపోయిన వారికి చేయూతనిచ్చి అసలైన ‘తలైవా’ అనిపించుకున్నారు. ‘చంద్రముఖి’తో రజనీ మరోసారి సత్తా చాటారు. తర్వాత ‘శివాజీ’, ‘రోబో’ తదితర చిత్రాలతో తనకు తిరుగులేదనిపించుకున్నారు. గత మూడేళ్లుగా ‘పేట’, ‘దర్బార్‌’, ‘అన్నాత్తే’ (పెద్దన్న) సినిమాలతో ప్రేక్షకులను నిరాశ పర్చిన రజనీ ‘జైలర్‌’ (Jailer)తో ఆ లోటును తీర్చేందుకు సిద్ధమవుతున్నారు.


దిస్‌ ఈజ్‌ రజనీ..

* మీరు గుడిలో కూర్చొని ఉన్నప్పుడు యాచకులు వచ్చి మీ చేతిలో డబ్బులు పెడితే ఏం చేస్తారు? కోప్పడతారు కదూ! ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం ఉన్న రజనీ ‘‘నేనేంటో ఆ సంఘటనే తెలియజేస్తుంది. అందుకే పైపై మెరుగులకు ప్రాధాన్యం ఇవ్వను’’ అని అన్నారాయన. ఓసారి బెంగళూరులోని ఓ దేవాయలయంలో రజనీకి ఈ అనుభవం ఎదురైంది.

* ‘దళపతి’ సినిమా చిత్రీకరణ సమయంలో తనకు తెలియక అరవింద్‌స్వామి.. రజనీకాంత్‌ రూమ్‌కు వెళ్లారు. అక్కడున్న బెడ్‌పై ఆయన నిద్రపోయారు. ఆయన్ను లేపకుండా రజనీ అదే గదిలో నేలపై పడుకున్నారు. అప్పటికి అంతగా గుర్తింపులేని అరవింద్‌స్వామికి రజనీ గౌరవం ఇవ్వడం ఆయనలోని మంచితనానికి నిదర్శనం.

* 1996 ఎన్నికల సమయంలో రజనీ ఓ పార్టీకి మద్దతు తెలిపినప్పుడు, మరో పార్టీ తరఫున ప్రచారం చేసిన నటి మనోరమ ఆయనని కించపరుస్తూ మాట్లాడారు. దాంతో ఎన్నికల తరవాత మనోరమకి సినిమాల్లో అవకాశాలు రాలేదు. ఆ విషయం తెలుసుకున్న రజనీ, స్వయంగా కలగజేసుకుని తన ‘అరుణాచలం’ సినిమాలో ఆమెకు అవకాశం ఇప్పించి, తనకు శత్రువులు ఎవరూ ఉండరని చెప్పారు.

* సీబీఎస్‌ఈ పాఠ్య పుస్తకాల్లో చోటు దక్కించుకున్న ఒకే ఒక్క భారతీయ నటుడు రజనీకాంత్‌. ‘ఫ్రమ్‌ బస్‌ కండక్టర్‌ టు సూపర్‌స్టార్‌’ పేరుతో సీబీఎస్‌ఈ ఆరో తరగతి విద్యార్థులకు ఆయన జీవితమే ఓ పాఠం.

* సంపాదనలో 50 శాతాన్ని సేవా కార్యక్రమాలకే కేటాయించే రజనీకి ఎప్పటికైనా హిమాలయాల్లో స్థిరపడాలన్నది చిరకాల వాంఛ.

* సుమారు 160 చిత్రాల్లో నటించిన రజనీ పద్మభూషణ్, పద్మ విభూషణ్‌, దాదా ఫాల్కే అవార్డులు అందుకున్నారు. ‘ఫాల్కే’ పురస్కారాన్ని తన గురువు బాలచందర్‌, మిత్రుడు (బస్‌ డ్రైవర్) రాజ్‌ బహుదూర్‌, తనతో సినిమాలు నిర్మించిన నిర్మాతలు, దర్శకులు, సహ నటులు, సాంకేతిక నిపుణులు, థియేటర్ల యజమానులు, అభిమానులు, తమిళ ప్రజలకు అంకితమివ్వడం రజనీ వ్యక్తిత్వానికి ప్రతీక.  

* ‘ఓ నటుడిగా ప్రభంజనం సృష్టించిన రజనీ తమిళనాడు రాష్ట్రం, దేశ రాజకీయాలను శాసించగలరు’ అనేది ఆయన అభిమానులతోపాటు రాజకీయవేత్తల మాట. ఒకానొక సమయంలో పాలిటిక్స్‌పై ఆసక్తి చూపిన రజనీ తర్వాత వద్దనుకున్నారు. వెండితెరపై రజనీ మరిన్ని ‘కాంతు’లీనాలని కోరుకుంటూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని