‘సూపర్‌మ్యాన్‌’ దర్శకుడు రిచర్డ్‌ కన్నుమూత

‘సూపర్‌మ్యాన్‌’ సిరీస్‌ చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన దర్శకుడు రిచర్డ్‌ డోనర్‌ (91) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తుది శ్వాస విడిచారు.

Published : 06 Jul 2021 14:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘సూపర్‌మ్యాన్‌’ సిరీస్‌ చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన దర్శకుడు రిచర్డ్‌ డోనర్‌ (91) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తుది శ్వాస విడిచారు. దిగ్గజ దర్శకుడ్ని కోల్పోవడంతో హాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. 1931లో న్యూయార్క్‌లో పుట్టిన రిచర్డ్‌ పూర్తిపేరు రిచర్డ్‌ డొనాల్డ్‌ స్వ్కార్ట్జ్‌బర్గ్‌. నటుడు కావాలని చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆయన అనుకోకుండా దర్శకుడిగా మారారు. నిర్మాతగానూ తనదైన ముద్ర వేశారు. దర్శకుడిగా బుల్లితెరపై తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన రిచర్డ్‌.. తొలిసారి 1961లో ‘ఎక్స్‌-15’ అనే చిత్రం తెరకెక్కించారు. దాదాపు 15 సంవత్సరాలకి ‘ది ఒమెన్‌’ సినిమాతో మంచి విజయం అందుకున్నారు. ఆ తర్వాత వచ్చిన ‘సూపర్‌మ్యాన్‌’ సిరీస్‌ చిత్రాలతో తిరుగులేని డైరెక్టర్‌ అనిపించుకున్నారు. ‘సూపర్‌మ్యాన్‌’ చిత్రాలు భారతీయ భాషల్లోనూ విడుదలై, రిచర్డ్‌కి విపరీతమైన క్రేజ్‌ సంపాదించిపెట్టాయి. ‘ఇన్‌సైడ్‌ మూవీస్‌’, ‘ది గూనీస్‌’, ‘లెథల్‌ వెపన్‌’ సిరీస్‌లు, ‘టైమ్‌ లైన్‌’, ‘16 బ్లాక్స్‌’ తదితర చిత్రాల్ని తెరకెక్కించి ఎన్నో అవార్డులు అందుకున్నారు రిచర్డ్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని