Super star Krishna: అన్నగారితో అనుబంధం

‘పాతాళ భైరవి’ చూసినప్పట్నుంచీ కృష్ణకు ఎన్టీఆర్‌ అంటే విపరీతమైన అభిమానం. ఎన్టీఆర్‌ సినిమాలను సగటు ప్రేక్షకుడిలా థియేటర్‌లో చూసిన కృష్ణ... తర్వాతి రోజుల్లో కథానాయకుడిగా మారి, తన అభిమాన నటుడితో తెరను పంచుకోవడం ఆసక్తిదాయకం.

Updated : 16 Nov 2022 06:59 IST

‘పాతాళ భైరవి’ చూసినప్పట్నుంచీ కృష్ణకు (super star krishna) ఎన్టీఆర్‌ అంటే విపరీతమైన అభిమానం. ఎన్టీఆర్‌ సినిమాలను సగటు ప్రేక్షకుడిలా థియేటర్‌లో చూసిన కృష్ణ... తర్వాతి రోజుల్లో కథానాయకుడిగా మారి, తన అభిమాన నటుడితో తెరను పంచుకోవడం ఆసక్తిదాయకం. ఎన్టీఆర్‌ను తొలిసారి చూసిన క్షణాన్ని, ఆయనతో మాట్లాడినప్పుడు కలిగిన పులకింతను కృష్ణ ఎన్నో సందర్భాల్లో గుర్తు చేసుకునేవారు. పందొమ్మిదేళ్ల కుర్ర ప్రాయంలో సినిమా హీరో కావాలని మద్రాసు వెళ్లారు కృష్ణ. ప్రముఖ నిర్మాత, కృష్ణ తండ్రి స్నేహితుడు చక్రపాణి కృష్ణను ‘భట్టి విక్రమార్క’ షూటింగ్‌లో ఉన్న ఎన్టీఆర్‌ దగ్గరకు తీసుకెళ్లారు. నుదుట చంద్రవంక, చేతిలో ఖడ్గంతో చిరనవ్వులు చిందిస్తూ రాచఠీవి ఉట్టిపడుతున్న ఎన్టీఆర్‌ను తొలిసారి ప్రత్యక్షంగా చూశారు కృష్ణ. ఆ క్షణంలో ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు. చక్రపాణి ఎన్టీఆర్‌కు కృష్ణను పరిచయం చేసి వచ్చిన విషయం చెప్పారు. కృష్ణ వంక పరిశీలనగా చూసిన ఎన్టీఆర్‌ ‘‘బాగున్నారు బ్రదర్‌...కానీ మీది మరీ చిన్న వయసు. మీకు తగిన పాత్రలు ఇప్పుడు దొరకడం కష్టం. ఇంకో రెండు మూడేళ్లు ఆగండి. ఆ వ్యవధిలో నాటకాల్లో నటించండి. ఆ అనుభవం ఎంతో ఉపయోగపడుతుంది. దుర్వ్యసనాల జోలికి మాత్రం పోవద్దు’’ అంటూ అమూల్యమైన సలహాలు ఇచ్చారు. వాటిని ఆచరణలో పెట్టిన కృష్ణ క్రమశిక్షణతో ఉన్నత స్థాయికి చేరారు.

అన్ని చిత్రాల్లోనూ తమ్ముడే: కృష్ణ నటుడయ్యాక ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణంరాజు, శోభన్‌బాబు తదితర కథానాయకులతో కలసి మల్టీస్టారర్‌ చిత్రాల్లో నటించారు. అయితే ఎన్టీఆర్‌తో చేసిన చిత్రాలకు ఓ ప్రత్యేకత ఉంది. ‘దేవుడు చేసిన మనుషులు’, ‘వయ్యారి భామలు వగలమారి భర్తలు’ లాంటి ఆరు చిత్రాల్లో వారిద్దరూ కలసి నటించారు. ఆ ఆరింటిలోనూ ఎన్టీఆర్‌, కృష్ణ అన్నదమ్ములుగానే నటించడం విశేషం. ఈ చిత్రాల ద్వారా ఎన్టీఆర్‌తో కృష్ణకు అనుబంధం పెరిగింది. ఆయనలా తానూ నెం.1 స్థానానికి చేరాలనే లక్ష్యంతో కృష్ణ తన కెరీర్‌ను తీర్చిదిద్దుకున్నారు.


ఒక చిత్రం.. తొమ్మిది హైకోర్టుల్లో తీర్పు!

కృష్ణ సినిమాల్లో.. కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన చిత్రం ఒకటుంది. అదే హిందీలో నిర్మించిన ‘మేరీ ఆవాజ్‌ సునో’. కన్నడలో విజయవంతమైన ‘అంత’కు రీమేక్‌గా రూపొందించారు. దీనికి సెన్సార్‌ పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా విడుదలైంది. రెండు వారాల పాటు హౌస్‌ఫుల్స్‌తో నడిచింది. మూడో వారంలో ఈ చిత్రాన్ని కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. అందులో ప్రతినాయకుడి పేరు ఉత్తరాదికి చెందిన ఒక రాజకీయ నాయకుడి పేరుకు దగ్గరగా ఉందన్న నెపంతో ఆ నిషేధం విధించారు. ఈ నిషేధ ఆజ్ఞలు శనివారం రోజున వెలువడగా.. ఆ నోటీసులు తొలుత నాలుగు థియేటర్లకు మాత్రమే అందాయి. ఆది, సోమవారాల కల్లా దేశమంతటా అందే పరిస్థితులు నెలకొన్నాయి. దేశమంతటా సినిమా విజయవంతంగా ఆడుతున్న తరుణంలో.. ఇలా నిషేధ ఆజ్ఞలు రావడం తెలిసి కొందరు బయ్యర్లు ముంబయిలోని పద్మాలయా ఆఫీసుపై పడిపోయారు. అంత తక్కువ టైమ్‌లో ఫిలిం చాంబర్‌ కానీ, ఇండస్ట్రీలోని పెద్దలు గానీ సహాయం చేయలేరు. అందుకే రాత్రికి రాత్రే 9రాష్ట్రాల హైకోర్టుల్లో స్పెషల్‌ రిట్‌ పిటీషన్లు ఫైల్‌ చేయించారు కృష్ణ. సోమవారం ఉదయం పదిన్నర కల్లా బాంబే హైకోర్టు ‘ఈ బ్యాన్‌ చెల్లదు.. సెన్సార్‌ వాళ్లు అనుమతించిన సినిమాను ఏ రూల్‌ ప్రకారం నిషేధిస్తారు. ఇది చట్ట వ్యతిరేకం’ అని కేంద్ర ప్రభుత్వాన్ని మందలిస్తూ తీర్పు ఇచ్చింది. అదే రోజు సాయంత్రం కల్లా కలకత్తా, దిల్లీ.. సహా దేశంలోని 9 హైకోర్టులు ఒకే రకమైన తీర్పులిచ్చి ‘మేరీ ఆవాజ్‌ సునో’ చిత్రాన్ని కాపాడాయి.


శతదినోత్సవం ఖర్చుతో నిర్మాతకు ఇల్లు

సహాయం చేయడంలో కృష్ణ ఎప్పుడూ ముందుంటారు. కృష్ణ, శ్రీదేవి జంటగా నటించిన ‘బంగారు భూమి’ చిత్రం మంచి విజయం సాధించింది. పీసీరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో ప్రొడక్షన్‌ మేనేజర్‌ వెంకన్నబాబు నిర్మాతగా మారారు. ఈ సినిమా విజయం సాధించి వందరోజుల వేడుక కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. దీని కోసం రూ.లక్షా పాతికవేల ఖర్చు కావచ్చని అంచనా వేశారు. ఆ సమయంలో కృష్ణ ..పీసీరెడ్డిని పిలిచి ‘రూ.లక్షా పాతికవేలతో శతదినోత్సవం జరపడం అవసరమా? ఆ డబ్బుల్తో వెంకన్నబాబుకు ఇల్లు కొనిస్తే ఎలా ఉంటుంది’ అంటే పీసీరెడ్డి సరే అన్నారట. అలా కృష్ణ ఎందరికో సహాయం చేశారంటూ పీసీ రెడ్డి ఒకానొక సందర్భంలో ఈ విషయాన్ని పంచుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని