Suriya: ‘సూర్య, కార్తి కలిసి నటిస్తారా?’.. లోకేశ్‌ యూనివర్స్‌పై స్పందించిన హీరోలు

దర్శకుడు ‘లోకేశ్‌ కనగరాజ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌’లో సూర్య , కార్తి కలిసి నటిస్తారా, లేదా? ఈ ప్రశ్నకు సమాధానం కోసం సినీ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Published : 04 Aug 2022 17:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ ‘సినిమాటిక్‌ యూనివర్స్‌’లో (LCU) సూర్య (suriya), కార్తి (karthi) కలిసి నటిస్తారా, లేదా?.. ఈ ప్రశ్నకు సమాధానం కోసం సినీ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘విరుమన్‌’ సినిమా ట్రైలర్‌, ఆడియో విడుదల వేడుకలో ఇదే ప్రశ్న తమకు ఎదురవగా ఈ హీరోలు స్పందించారు. ‘దానికి కాలమే సమాధానం చెప్తుంది. వేచి చూద్దాం’ అని తెలిపారు. ‘ఖైదీ’, ‘మాస్టర్‌’, ‘విక్రమ్‌’ తదితర చిత్రాలతో అలరించిన దర్శకుడే లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj). కొత్త కథలకు గత చిత్రాల్లోని పాత్రలను ముడిపెడుతూ సినిమాటిక్‌ యూనివర్స్‌ అనే కాన్సెప్ట్‌తో విజయం అందుకున్నారు. ఆ క్రమంలో వచ్చిందే ‘విక్రమ్‌’ (Vikram).

కమల్‌ హాసన్‌ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో ‘ఏజెంట్‌ విక్రమ్‌’, ‘ఖైదీ’ సినిమాల్లోని పాత్రలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ ‘విక్రమ్‌’లోనే సూర్య.. రోలెక్స్‌ అనే క్యారెక్టర్‌లో కనిపించారు. కార్తి హీరోగా గతంలో రూపొందిన చిత్రమే ‘ఖైదీ’. ఇందులో ఆయన డిల్లీ అనే పాత్ర పోషించారు. ‘విక్రమ్‌’లోని ఓ సన్నివేశంలో డిల్లీ పాత్రకు సంబంధించి కార్తి వాయిస్‌ మాత్రమే వినిపిస్తుందిగానీ ఆయన కనిపించరు. దాంతో లోకేశ్‌ తెరకెక్కించే తదుపరి సినిమాలో కార్తి పూర్తిస్థాయి పాత్రలో కనిపిస్తారేమో, సోదరులిద్దరు (సూర్య, కార్తి) కలిసి నటిస్తారేమో అనే ఆసక్తి మొదలైంది. ‘విక్రమ్‌ 2’ ఉంటుందని లోకేశ్‌ ఇప్పటికే వెల్లడించారు.

కార్తి హీరోగా దర్శకుడు ముత్తయ్య తెరకెక్కించిన చిత్రం ‘విరుమన్‌’ (Viruman). 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్య, ఆయన సతీమణి జ్యోతిక సంయుక్తంగా నిర్మించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే మాస్‌ యాక్షన్‌ డ్రామా కథాంశంతో రూపొందిన  ఈ సినిమా ఆగస్టు 12న విడుదలకానుంది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని