suriya: జీవితం కన్నా పరీక్షలేమీ పెద్దవి కావు: సూర్య

‘నాకు ఏ విషయంలోనూ భయం లేదు’ అని తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి చెప్పినట్లు విద్యార్థులందరూ భయం లేకుండా, దృఢ విశ్వాసంతో జీవించాలని నటుడు సూర్య విజ్ఞప్తి చేశారు.

Published : 19 Sep 2021 01:33 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘నాకు ఏ విషయంలోనూ భయం లేదు’ అని తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి చెప్పినట్లు విద్యార్థులందరూ భయం లేకుండా, దృఢ విశ్వాసంతో జీవించాలని నటుడు సూర్య విజ్ఞప్తి చేశారు. జాతీయ అర్హత పరీక్ష(నీట్‌)కు హాజరయ్యే ముగ్గురు విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ వరుస ఘటనలు అందరినీ కలిచి వేశాయి. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ విచారం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నటుడు సూర్య ప్రత్యేక వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఒక సోదరుడిగా విజ్ఞప్తి చేస్తున్నానని భావోద్వేగంతో మాట్లాడారు.

‘‘పరీక్ష అనేది జీవితం కన్నా పెద్దదేమీ కాదు. మీరు డిప్రెషన్‌లో ఉంటే, వెంటనే మీ సన్నిహితులతో ఎక్కువ సేపు గడపండి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్నేహితులు ఇలా ఎవరైనా సరే. ఒత్తిడి, నిరాశ, నిస్పృహలనేవి కొద్దిసేపటి తర్వాత తొలగిపోతాయి. కానీ, ఆత్మహత్య చేసుకోవాలన్న నిర్ణయం మీ జీవితాన్నే ముగించేస్తుంది. మిమ్మల్ని అమితంగా ప్రేమించే తల్లిదండ్రులకు అది యావజ్జీవ శిక్షలాంటిది. దీన్ని మర్చిపోవద్దు. ఒక సోదరుడిగా ఈ విషయం చెబుతున్నా’’ అని తీవ్ర ఒత్తిడితో బాధపడుతున్న విద్యార్థులను ఉద్దేశించి విజ్ఞప్తి చేశారు.

చదువులో తానేమీ మెరిట్‌ విద్యార్థిని కాదన్న సూర్య.. ‘‘నేను హాజరైన అన్ని పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యాను. చాలా తక్కువ మార్కులు వచ్చేవి. జీవితంలో కేవలం మార్కులు, పరీక్షలు మాత్రమే ఉండవు. అంతకు మించి ఎన్నో సాధించాలి. మిమ్మల్ని అర్థం చేసుకుని ప్రేమించే వాళ్లు చాలా మంది ఉన్నారు.  దృఢ సంకల్పం, ధైర్యం ఉన్న ప్రతి ఒక్కరూ ఏదైనా గెలవగలరు. ఉన్నత స్థానాలకు చేరగలరు’’ అని సూర్య చెప్పుకొచ్చారు.

నీట్‌ పరీక్షకు హాజరు కావాల్సిన ముగ్గురు విద్యార్థులు ధనుష్‌, కనిమొళి, సౌందర్య భయంతో గత వారం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. 2017 నుంచి ఇలా 17మంది విద్యార్థులు తమ జీవితాలను అర్థాంతరంగా ముగించారు. కాగా, ధనుష్‌ ఆత్మహత్య ఘటనతో తమిళనాడు ప్రభుత్వం సంస్కరణలకు దిగింది. వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు నీట్‌ అర్హత పరీక్షను బట్టి కాకుండా 12వ తరగతి మార్కుల ఆధారంగా సీట్లు కేటాయించేందుకు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని