Suriya ET Review: రివ్యూ: ఈటి (ఎవరికీ త‌ల‌వంచ‌డు)

Suriya ET Review: సూర్య కీలక పాత్రలో నటించిన ఈటి ఎలా ఉందంటే?

Published : 11 Mar 2022 01:38 IST

చిత్రం: ఈటి; నటీనటులు: సూర్య, ప్రియాంక అరుళ్‌ మోహన్‌, వినయ్‌ రాజ్‌, సత్యరాజ్‌, రాజ్‌కిరణ్‌ తదితరులు; సంగీతం: డి.ఇమ్మాన్‌; ఎడిటింగ్‌: రుబెన్‌; సినిమాటోగ్రఫీ: ఆర్‌.రత్నవేలు; నిర్మాత: మారన్‌; రచన, దర్శకత్వం: పాండిరాజ్‌; బ్యానర్‌: సన్‌ పిక్చర్స్‌; విడుదల: 10-03-2022

కొత్త ర‌క‌మైన సినిమాలు.. ప్ర‌యోగాలు చేసినా వాటి మ‌ధ్య‌లో అప్పుడ‌ప్పుడూ మాస్ క‌థ‌ల‌తోనూ ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తుంటారు. వాటిలో అభిమానుల్ని మెప్పించే క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో పాటు... బ‌ల‌మైన సామాజికాంశాలు కూడా త‌ప్ప‌నిస‌రిగా ఉండేలా చూసుకుంటుంటారు. ‘ఆకాశ‌మే నీ హ‌ద్దురా’ ‘జై భీమ్‌’లాంటి భిన్న‌మైన ప్ర‌య‌త్నాల త‌ర్వాత సూర్య(suriya) చేసిన మ‌రొక మాస్ చిత్ర‌మే ‘ఈటి’(ET).  క‌రోనాతో ఇదివ‌ర‌కు చేసిన రెండు సినిమాలూ ఓటీటీ వేదిక‌ల్లోనే ప్రేక్ష‌కుల ముందుకొచ్చాయి. చాలా రోజుల త‌ర్వాత థియేట‌ర్ల‌లో విడుద‌లైన సూర్య చిత్ర‌మిది. మ‌రి ఎలా ఉందో,  ఇందులో స్పృశించిన సామాజికాంశాలు ఏంటి?(ET Review)

కథేంటంటే: ద‌క్షిణ‌పురానికి చెందిన కృష్ణ‌మోహ‌న్ (సూర్య‌) ఓ లాయ‌ర్‌.  చిన్నప్పుడే త‌న చెల్లిని పోగొట్టుకుంటాడు. అప్ప‌ట్నుంచి  అన్నా అని ఏ ఆడపిల్ల సాయం అడిగినా కాద‌న‌డు.  ప‌క్క‌నే ఉన్న ఉత్త‌ర‌పురంలో  త‌న ఊరు ద‌క్షిణ‌పురానికి చెందిన ఎంతో మంది ఆడ‌ప‌డుచులు ఉంటారు. అత్తారింటిక‌ని వెళ్లిన త‌న ఊరి అమ్మాయిలంతా  కామేశ్ (విన‌య్ రాయ్‌)  వ‌ల్ల ఇబ్బందుల్లో ప‌డ‌తారు.  త‌నకున్న ప‌లుకుబ‌డితో ఎంతోమంది అమాయ‌క‌మైన ఆడ‌పిల్ల‌ల జీవితాల‌తో ఆడుకుంటుంటాడు కామేశ్‌. ఆ దుర్మార్గుడి ఆట క‌ట్టించ‌డం కోసం ఒక న్యాయ‌వాదిగా కృష్ణ‌మోహ‌న్  ఏం చేశాడు?త‌న వృత్తితో సంబంధం లేకుండా వేట‌గాడిగా మారి ఏం చేశాడనే విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే: చాలా రోజుల త‌ర్వాత త‌న సినిమా థియేట‌ర్ల‌లో విడుద‌ల‌వుతోంది కాబ‌ట్టి... థియేట‌ర్‌కి వ‌చ్చే అభిమానులు, మాస్ ప్రేక్ష‌కులు ఎలాంటి సినిమాల్ని ఇష్ట‌ప‌డ‌తారో దృష్టిలో ఉంచుకునే ‘ఈటి’ చేశాడు సూర్య‌. నిజ జీవితంలో త‌ర‌చూ చోటు చేసుకునే సంఘ‌ట‌న‌ల స్ఫూర్తితోనే  ఈ క‌థ‌ని రాసుకున్నాడు ద‌ర్శ‌కుడు పాండిరాజ్‌.  యువ‌తుల భ‌యాల్ని ఆస‌రాగా చేసుకుని వాళ్ల జీవితాల్ని ఎలా నాశ‌నం చేస్తున్నార‌నే విష‌యాన్ని ఇందులో ఆలోచ‌న రేకెత్తించేలా చూపించారు.  మ‌హిళ‌ల్లో స్ఫూర్తిని, ధైర్యాన్ని నింపే అంశాలు ఇందులో ఉన్నాయి. ఉత్త‌రపురం, ద‌క్షిణ‌పురం మ‌ధ్య సంబంధం నేప‌థ్యంలో క‌థ మొద‌ల‌వుతుంది. ఆరంభ స‌న్నివేశాలు  సాధార‌ణంగానే అనిపించినా,  అధీరా (ప్రియాంక మోహ‌న్‌)తో కృష్ణ‌మోహ‌న్ ప్రేమలో ప‌డిన‌ప్ప‌ట్నుంచి  క‌థ వేగం అందుకుంటుంది. ఒక‌వైపు ఊరిలో ఉత్స‌వ నిర్వ‌హ‌ణ‌, మ‌రోవైపు ఆ ఉత్స‌వంలోనే  తాను ఇష్ట‌ప‌డిన అమ్మాయి అధీరాని తీసుకెళ‌తాన‌ని క‌థానాయ‌కుడు శ‌ప‌థం చేయ‌డం క‌థ‌ని మ‌రింత ఆస‌క్తిక‌రంగా మారుస్తాయి. ఆప‌రేష‌న్ బేబీ పేరుతో సాగే ఆ ఘ‌ట్టాలు  చ‌క్క‌టి వినోదాన్ని పంచుతాయి.(ET Review)

ద్వితీయార్ధం కామేశ్‌కీ, కృష్ణ‌మోహ‌న్‌కీ మ‌ధ్య పోరాటంతో సాగుతుంది.  క‌థ‌, క‌థ‌నాల్లో కొత్త‌ద‌న‌మేమీ లేదు. స‌న్నివేశాల‌న్నీ ప్రేక్ష‌కుడి ఊహ‌కు త‌గ్గ‌ట్టే సాగుతాయి.  మ‌ధ్య మ‌ధ్య‌లో హాస్య స‌న్నివేశాలు కొంచెం అతిగా అనిపించినా, న‌వ్విస్తాయి. క‌థ‌, క‌థ‌నాల మాటెలా ఉన్నా...  సాంకేతిక‌త‌ని అడ్డు పెట్టుకుని కొద్దిమంది దుర్మార్గులు అమాయ‌కులైన అమ్మాయిల‌పై బెదిరింపుల‌కి పాల్ప‌డిన‌ప్పుడు, లొంగ‌దీసుకునేందుకు ప్ర‌య‌త్నించిన‌ప్పుడు వాళ్లు ఎలా మ‌సలుకోవాలి? అమ్మాయికి అందం అంటే ధైర్యమే అనే విష‌యాల్ని ఈ క‌థ‌తో చెప్పిన తీరు మెప్పిస్తుంది.(ET Review)  ద్వితీయార్ధంలో సందేశం చిత్రానికి ప్ర‌ధానబ‌లం.

ఎవ‌రెలా చేశారంటే: సూర్య(suriya) వృత్తి రీత్యా లాయ‌ర్ అయినా... ప‌క్కా మాస్ అవ‌తారంలో క‌నిపించాడు. సింహ భాగం స‌న్నివేశాల్లో లుంగీతో ప‌ల్లెటూరి యువ‌కుడిగానే క‌నిపించాడు.  మాస్ ప్రేక్ష‌కుల్ని మెప్పించే ప్ర‌య‌త్న‌మే అది. ఆయ‌న‌కి అల‌వాటైన పాత్రే ఇది. పోరాట ఘ‌ట్టాల్లోనూ, ప‌తాక స‌న్నివేశాల్లోనూ ఆయ‌న అభిన‌యం మ‌రింత‌గా మెప్పిస్తుంది.  క‌థానాయిక  ప్రియాంక మోహ‌న్ ప్రాధాన్య‌మైన పాత్ర‌లోనే క‌నిపిస్తుంది. ద్వితీయార్ధంలో ఆమెకి అనూహ్యంగా ఎదుర‌య్యే సంఘ‌ట‌న, ఆ త‌ర్వాత ఆమె ధైర్యంగా నిల‌బ‌డే తీరు మహిళ‌ల్లో స్ఫూర్తిని నింపుతుంది. (ET Review) అప్ప‌టిదాకా అందంగా క‌నిపించిన ఆమె, ఆ స‌న్నివేశాల్లో చ‌క్క‌టి అభిన‌యం కూడా ప్ర‌ద‌ర్శించింది. పల్లెటూళ్లో ఉంటూనే కార్పొరేట్ కార్యాల‌యంలో ఉన్న‌ట్టుగా క‌నిపిస్తూ  విల‌నిజం పండించాడు విన‌య్ రాయ్.  ఆ పాత్ర క్రూరంగా ప‌రిచ‌య‌మైనా... ఆ త‌ర్వాత క‌థ‌పై పెద్ద‌గా ప్ర‌భావం చూపించ‌కుండానే ముగుస్తుంది.  స‌త్య‌రాజ్‌, శ‌ర‌ణ్య, దేవ‌ద‌ర్శిని, సూరి త‌దిత‌రులు కామెడీ పంచారు.  సాంకేతిక విభాగాల్లో  ర‌త్న‌వేలు కెమెరా ప‌నిత‌నం మెప్పిస్తుంది. సంగీతం ప‌ర్వాలేద‌నిపిస్తుంది.  నిర్మాణ విలువ‌లు ఉన్న‌తంగా ఉన్నాయి. ద‌ర్శ‌కుడు పాండిరాజ్ త‌న స్టైల్‌కి భిన్నంగా ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సూత్రాల‌తో ఈసినిమాని రూపొందించారు. క‌థ‌నం ప‌రంగా మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌ల్సింది.

బ‌లాలు

+ క‌థ‌లోని సామాజికాంశాలు

+ సూర్య న‌ట‌న

+ వినోదం, ప‌తాక స‌న్నివేశాలు

బ‌ల‌హీన‌త‌లు

- ఊహ‌కు తగ్గ‌ట్టుగా సాగే స‌న్నివేశాలు

- కొత్త‌ద‌నం లేని క‌థ‌, క‌థ‌నాలు

చివ‌రిగా: మాస్‌ ఈటి... సూర్య అభిమానుల‌కి..!

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని