Suriya42: ‘బాహుబలి’, ‘కేజీయఫ్‌’ రేంజ్‌లో సూర్య మూవీ ఉంటుందట!

Suriya42: సూర్య కథానాయకుడిగా శివ దర్శకత్వంలో ఓ పీరియాడికల్‌ యాక్షన్‌ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ‘బాహుబలి,’ కేజీయఫ్‌’ చిత్రాలకు దీటుగా ఉంటుందని నిర్మాత జ్ఞానవేల్‌ రాజా చెబుతున్నారు.

Published : 22 Mar 2023 02:22 IST

చెన్నై: ఇప్పుడు ఏ ఇండస్ట్రీలో చూసినా పాన్‌ ఇండియా ట్రెండ్‌ నడుస్తోంది. ఒక భాషలో సినిమా తీసి, మిగిలిన భాషల్లో డబ్‌ చేసి వదిలేస్తున్నారు. సూర్య (Suriya) కథానాయకుడిగా శివ (Siva) దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘సూర్య42’గా రూపొందుతున్న ఈ మూవీని గ్రీన్‌ స్టూడియోస్‌ పతాకంపై కేఈ జ్ఞాన్‌వేల్‌ రాజా (k e gnanavel raja) నిర్మిస్తున్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కొత్త సినిమా గురించి మాట్లాడుతూ.. ఆర్‌ఆర్ఆర్‌, కేజీయఫ్‌, బాహుబలి చిత్రాల తరహాలో భారీగా ఉంటుందని చెప్పుకొచ్చారు.

తెలుగుతో పాటు, హిందీ ప్రేక్షకులకు సూర్య సుపరిచితుడే. ఆయన నటించిన ప్రతి సినిమా తెలుగులో విడుదలవుతుండగా, ఒకట్రెండు సినిమాలు హిందీలో విడుదలయ్యాయి. ‘విక్రమ్‌’, ‘జైభీమ్‌’ చిత్రాలు మంచి గుర్తింపు తెచ్చాయి. శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సూర్య ఒక యోధుడి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. 16వ శతాబ్దంనాటి కథతో దీన్ని తీర్చిదిద్దుతున్నారు. ఈ సందర్భంగా కేఈ జ్ఞానవేల్‌ రాజా మాట్లాడుతూ.. ‘ఇప్పటివరకూ సూర్య చేసిన చిత్రాలతో పోలిస్తే, మూడు రెట్లు ఎక్కువ బడ్జెట్‌తో ఈ మూవీని తీర్చిదిద్దుతున్నాం. ఇక ఈ చిత్రానికి బిజినెస్‌ వాటితో పోలిస్తే, రెండింతలు ఎక్కువ జరిగింది. ఇంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను మొదలు పెట్టడం నిజంగా సాహసమే’’ అని వివరించారు.

‘‘ప్రేక్షకులు కన్నడ నుంచి ‘కేజీయఫ్‌’ చూశారు. తెలుగు నుంచి ‘బాహుబలి’, ‘ఆర్ఆర్‌ఆర్‌’ చూశారు. ఇప్పుడు సూర్య మూవీ వంతు. ఆ సినిమాల స్థాయికి ఏ మాత్రం ‘సూర్య42’ చిత్రం తీసిపోదు. ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఎంతలా అంటే ఇప్పటివరకూ కనీసం ఒక్క స్టిల్‌ కూడా లీక్‌ కాకుండా జాగ్రత్త పడుతున్నాం’’ అని జ్ఞానవేల్‌ రాజా చెప్పుకొచ్చారు. సూర్య నటిస్తున్న ఈ సినిమాను 10 భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో నటించే ఇతర నటీనటులకు చెల్లించే పారితోషికంతో సమానంగా దీని ప్రమోషన్‌ కోసం ఖర్చు చేయనున్నట్లు కోలీవుడ్‌ టాక్‌. అయితే, వరుసగా అజిత్‌తో సినిమాలు చేసిన శివ 2021లో రజనీకాంత్‌తో ‘పెద్దన్న’ తీశారు. బాక్సాఫీస్‌ వద్ద ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ క్రమంలో పీరియాడికల్‌ యాక్షన్‌ మూవీగా సూర్య సినిమాను రూపొందిస్తుండటం విశేషం. మరి ఆ స్థాయి అంచనాలను ఈ మూవీ అందుకుంటుంతో లేదో తెలియాలంటే ఇంకొంత కాలం వేచి చూడాల్సిందే! ఇప్పటి వరకూ ఈ సినిమాకు సంబంధించి కేవలం మోషన్‌ పోస్టర్‌ మాత్రమే విడుదల చేశారు. కథానాయిక, ఇతర నటీనటుల వివరాలను వెల్లడించాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని