Suriya: అభిమాని మృతి.. సినీ నటుడు సూర్య ఎమోషనల్‌ పోస్ట్‌

Suriya: తన అభిమాని ఐశ్వర్య మృతి పట్ల సినీ నటుడు సూర్య విచారం వ్యక్తం చేశారు.

Published : 20 May 2023 12:29 IST

చెన్నై: ఇటీవల టెక్సాస్‌లోని ఓ మాల్‌లో  జరిగిన కాల్పుల ఘటనలో ఐశ్వర్య తాటికొండ అనే యువతి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఐశ్వర్య మృతి ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.  తన అభిమాని అయిన ఐశ్వర్య చనిపోయిందన్న విషయం తెలుసుకున్న సినీ నటుడు సూర్య భావోద్వేగానికి గురయ్యారు. ఆమె మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ఐశ్వర్య చిత్ర పటం వద్ద పూలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఐశ్వర్య కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ లేఖను రాశారు.

‘‘మీ కుటుంబాన్ని ఎలా ఓదార్చాలో నాకు మాటలు రావడం లేదు. ఐశ్వర్య మృతి తీరని లోటు. టెక్సాస్‌లో జరిగిన కాల్పుల ఘటనలో మీ కుమార్తె ఐశ్వర్య కన్నుమూయడం దురదృష్టకరం. ఆమె ఎప్పటికీ మన జ్ఞాపకాల్లో నిలిచే ఉంటుంది.  ఒక ధ్రువతార వెలుగుతూనే ఉంటుంది’’ అని ఐశ్వర్య తల్లిదండ్రులను ఓదార్చే ప్రయత్నం చేశారు సూర్య. అలాగే, ‘‘ఇవి నీ మృతికి నివాళిగా రాస్తున్న అక్షరాలు కావు. నువ్వు నిజమైన హీరోవి. నీ స్నేహితులు , కుటుంబ సభ్యులకు నువ్వొక ధ్రువతారవు. నువ్వు చిందించే చిరునవ్వు, నీలో ఉన్న ప్రేమను పంచే వ్యక్తిత్వం ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకుతుంది’’ అని అన్నారు. మే 6న టెక్సాస్‌లోని ఓ మాల్‌లో దుండగులు జరిపిన కాల్పుల్లో ఐశ్వర్య సహా ఏడుగురు మృతి చెందారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని