
Oscars 2022: భారత్ నుంచి ఆస్కార్‌కి 2 దక్షిణాది చిత్రాలు షార్ట్‌లిస్ట్!
ఇంటర్నెట్ డెస్క్: సినీ ప్రపంచం ప్రతిష్ఠాత్మకంగా భావించే అకాడమీ అవార్డు (ఆస్కార్)ల షార్ట్ లిస్ట్‌లో భారతదేశం నుంచి రెండు చిత్రాలు నిలిచాయి. ఆ రెండూ దక్షిణాదికి చెందిన చిత్రాలే కావడం విశేషం. త్వరలో జరగనున్న 94వ అకాడమీ అవార్డులకు తమిళ కథానాయకుడు సూర్య ‘జైభీమ్’తో పాటు, మలయాళ నటుడు మోహన్‌లాల్ పాన్ ఇండియా చిత్రం ‘మరక్కార్’ షార్ట్‌లిస్ట్ అయ్యాయి. ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ప్రపంచవ్యాప్తంగా 276 చిత్రాలు ఆస్కార్ పురస్కారం కోసం షార్ట్‌లిస్ట్ అవ్వగా.. అందులో భారత్ నుంచి ఈ రెండు నిలిచాయి. కాగా ఫైనల్ నామినేషన్లను ఫిబ్రవరి 8న ప్రకటిస్తారు.
ఓటీటీ వేదికగా సూర్య ‘జై భీమ్’ విడుదలైంది. జస్టిస్ చంద్రు జీవితకథతో పాటు వాస్తవ సంఘటనల ఆధారంగా అల్లుకున్న ఓ కోర్టు డ్రామా కథాంశంతో దర్శకుడు తా.సే.జ్ఞానవేల్ తెరకెక్కించారు. ఆస్కార్ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో ప్రసారం చేసిన తమిళ సినిమాగా ఇటీవలే అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది.ప్రకాశ్‌రాజ్, రావు రమేశ్, రాజిష విజయన్, లిజోమోల్ జోసీ, మణికంఠన్ తదితరులు ఇందులో ప్రధాన తారాగణం. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో నవంబరు 2, 2021న విడుదలైంది.
పాన్ ఇండియా చిత్రం ‘మరక్కార్’ విషయానికొస్తే... విడుదలకు ముందే జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. 2019కిగాను జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. 16వ శతాబ్దపు చారిత్రాత్మక పాత్ర అయిన కుంజలి మరక్కార్ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. సుహాసిని, ప్రణవ్ మోహన్‌లాల్, కల్యాణి ప్రియదర్శన్, కీర్తిసురేష్, అర్జున్ సర్జా, సునీల్‌శెట్టి, మంజు వారియర్, నెడుముడి వేణు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా గతేడాది డిసెంబరు 2న విడుదలైన విషయం తెలిసిందే.