Jai Bhim Oscar: ‘జైభీమ్‌’ ఆస్కార్‌కు నామినేట్‌ అవుతుందన్న నమ్మకం ఉంది!

ప్రపంచంలోనే అతి పెద్ద సినీ సంబరం ఆస్కార్‌ పురస్కారాల వేడుకకు సర్వం సిద్ధమవుతోంది. మార్చి 27న 94వ ఆస్కార్‌ పురస్కారాల ప్రదానోత్సవం జరగనుంది.

Published : 08 Feb 2022 14:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచంలోనే అతి పెద్ద సినీ సంబరం ఆస్కార్‌ పురస్కారాల వేడుకకు సర్వం సిద్ధమవుతోంది. మార్చి 27న 94వ ఆస్కార్‌ పురస్కారాల ప్రదానోత్సవం జరగనుంది. ఈ క్రమంలో ఆస్కార్‌ స్క్రీనింగ్‌ కోసం మన దేశం నుంచి బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌(విదేశీ) విభాగంలో సూర్య ‘జై భీమ్‌’, మోహన్‌లాల్‌ ‘మరక్కర్‌’ చిత్రాలు చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకాదరణ పొందిన ఈ రెండు చిత్రాలూ ఎలాగైనా అవార్డు దక్కించుకోవాలని సినీ అభిమానులు బలంగా ఆకాంక్షిస్తున్నారు. ఇదిలా ఉండగా ‘జై భీమ్‌’ చిత్రం బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌(విదేశీ) విభాగానికి నామినేట్‌ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్‌ వర్గాల ట్వీట్లు దీన్ని బలపరుస్తున్నాయి. ట్విటర్‌లోనూ ట్రెండ్‌ అవుతోంది.

‘‘బ్యాలెట్స్‌ కౌంటింగ్‌ పూర్తయింది. సినిమా పేర్లను సీల్‌ చేసేశారు ’’ అంటూ ఆస్కార్‌ అధికారిక ట్విటర్‌ ప్రకటించింది. ఈ నేపథ్యంలో హాలీవుడ్‌ నటుడు కైలే బుచ్‌నన్‌ ‘‘రేపు మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేసే ఆస్కార్‌ నామినేషన్‌ ఏదవుతుంది?’’ అని ట్వీట్‌ చేయగా.. రోటెన్‌ టొమాటోస్‌ ప్రతినిధి ‘‘ఉత్తమచిత్రంగా ‘జై భీమ్‌’ నిలుస్తుంది. ఈ విషయంలో నన్ను నమ్మండి’’ అంటూ ఆమె ట్వీట్‌ చేయడం భారత సినీ ప్రేక్షకుల్లో జోష్‌ నింపింది. మరి జైభీమ్‌ ఆస్కార్ నామినేషన్‌కి ఎంపికైందా లేదా తెలియాలంటే వేచి చూడాలి.

జ్ఞానవేల్‌ తెరకెక్కించిన చిత్రం ‘జై భీమ్‌’. జస్టిస్‌ చంద్రు జీవితంలోని వాస్తవ సంఘటనల ఆధారంగా అల్లుకున్న కోర్టు డ్రామా కథాంశంతో రూపొందించారు. ఇందులో సూర్య.. గిరిజన హక్కుల కోసం పోరాడే న్యాయవాది చంద్రు పాత్రలో కనిపించి మెప్పించారు. గతేడాది ఓటీటీలో విడుదలైన ఈ సినిమా.. ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసల్ని దక్కించుకుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని