Suryavamsam: మ్యూజికల్‌ హిట్‌.. సూర్యవంశం చిత్రానికి 25ఏళ్లు!... ఏ సినిమా రీమేక్‌ అంటే..!

Suryavamsam: వెంకటేశ్‌, మీనా జంటగా నటించిన ‘సూర్యవంశం’ విడుదలై 25ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమా గురించి ఆసక్తికర విశేషాలు...

Published : 26 Feb 2023 01:32 IST

హైదరాబాద్‌: ఇతర భాషల్లో విజయవంతమైన చిత్రాలను రీమేక్‌ చేయడం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో చిత్రాలు తెలుగులోనూ ప్రేక్షకులను అలరించాయి. అలాంటి వాటిలో వెంకటేశ్‌ నటించిన ‘సూర్యవంశం’ (Suryavamsam) ఒకటి. 1998 ఫిబ్రవరి 25న విడుదలైన ఈ సినిమా కుటుంబ ప్రేక్షకులను విశేషంగా అలరించింది. ముఖ్యంగా వెంకటేశ్‌ ద్విపాత్రాభినయం, భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వం, కామెడీ, ఎస్‌.ఏ.రాజ్‌కుమార్‌ సంగీతం సినిమాను పథంలో నడిపాయి.

మాతృకలో వారే..!

తమిళంలో శరత్ కుమార్ తండ్రీ కొడుకులుగా ‘సూర్యవంశం’ (Suryavamsam) తెరకెక్కింది. రాధిక, దేవయాని, ఆనంద్ రాజ్, ప్రియా రామన్ ప్రధాన పాత్రల్లో నటించారు. విక్రమన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్కడ బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. రీమేక్‌ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యేలా చేయడంలో ఇటు వెంకటేశ్‌, అటు డైరెక్టర్‌ భీమినేని శ్రీనివాస్‌ ఇద్దరూ సిద్ధహస్తులే. అలా వెంకటేశ్‌ కథానాయకుడిగా ఈ మూవీ రూపొందింది. తెలుగులో రాధిక, మీనా (దేవయాని పాత్ర), సంఘవి (ప్రియా రామన్ పాత్ర) కోట శ్రీనివాసరావు, సుధాకర్‌, సత్యనారాయణ కీలక పాత్రల్లో నటించారు. తమిళ వెర్షన్‌కి సంగీతమందించిన ఎస్.ఎ.రాజ్ కుమార్ తెలుగుకి కూడా మ్యూజిక్ ఇచ్చారు.

ఇంతకీ కథేంటంటే: భాను ప్రసాద్‌ (వెంకటేశ్‌)కు చిన్నప్పటి నుంచి చదువు అస్సలు వచ్చేది కాదు. ఎప్పుడూ తండ్రి హరిశ్చంద్ర ప్రసాద్‌ (వెంకటేశ్‌)తో తిట్లు తింటూ ఉంటాడు. భాను ప్రసాద్‌కు చిన్నప్పటి నుంచి మాధవి (సంఘవి) అంటే ఇష్టం. ఇదే విషయం తెలిసి హరిశ్చంద్ర ప్రసాద్‌ ఆమెను భానుకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. కానీ మాధవికి ఆ పెళ్లి ఇష్టం లేక ఆత్మహత్య ప్రయత్నం చేస్తుంది. దీంతో ఆ పెళ్లి రద్దువుతుంది. మాధవి అంటే ఇష్టం లేదని నింద తనపై వేసుకుని తండ్రి దృష్టిలో చెడ్డవాడవుతాడు భాను. అప్పటి నుంచి భానుతో హరిశ్చంద్ర ప్రసాద్‌ మాట్లాడటం మానేస్తాడు. ఈ క్రమంలో భాను చెల్లెలికి స్వప్న (మీనా) సోదరుడితో వివాహం నిశ్చయమవుతుంది. దీంతో బాబాయ్‌ మేజర్‌ ఎద్దులయ్య (కోట శ్రీనివాసరావు)తో కలిసి భాను వాళ్ల ఊరు వస్తుంది. తొలుత భానును పనివాడనుకుంటుంది. ఆ తర్వాత నిజం తెలిసి, అతడిని ప్రేమిస్తుంది. దీంతో ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. ఈ విషయం తెలిసి హరిశ్చంద్ర ప్రసాద్‌ ఇద్దరినీ ఇంటి నుంచి బయటకు పంపేస్తాడు. ఎలాంటి చదువు లేకున్న భార్య ప్రోత్సాహంతో భాను ఎలా ఎదిగాడు? స్వప్న ఉన్నతస్థానికి ఎలా చేరింది. అన్నది మిగతా కథ.

ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మెప్పించడంలో తనని కొట్టిన వారు లేరని ఈ మూవీతో వెంకటేశ్‌ మరోసారి మెప్పించారు.  తెలుగు చిత్ర పరిశ్రమలో ‘సూర్యవంశం’ ఒక ట్రెండ్ సృష్టించింది. ఓవైపు తండ్రి పాత్రలో మరో వైపు కొడుకుగా అందరికీ ఆదర్శంగా నిలిచే లా వెంకటేష్ తన నటనతో ఆకట్టుకున్నాడు. పాటలైతే ఎవర్‌గ్రీన్‌.  ఎక్కడ చూసినా ‘రోజావే చిన్ని రోజావే..’, ‘చుక్కలన్నీ ముగ్గులై’  పాటలు మార్మోగిపోయాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు