Sushmita Konidela: అప్పుడే తెలుసు వాల్తేరు వీరయ్య హిట్టని

సుస్మిత కొణిదెల అంటే అభిరుచి గల నిర్మాతే కాదు.. మంచి కాస్ట్యూమ్‌ డిజైనర్‌ కూడా. ‘రంగస్థలం’, ‘సైరా నరసింహారెడ్డి’ లాంటి విజయవంతమైన చిత్రాలకు కాస్ట్యూమ్స్‌ అందించి మెప్పించారు.

Updated : 14 Jan 2023 07:07 IST

సుస్మిత కొణిదెల (Sushmita Konidela) అంటే అభిరుచి గల నిర్మాతే కాదు.. మంచి కాస్ట్యూమ్‌ డిజైనర్‌ కూడా. ‘రంగస్థలం’, ‘సైరా నరసింహారెడ్డి’ లాంటి విజయవంతమైన చిత్రాలకు కాస్ట్యూమ్స్‌ అందించి మెప్పించారు. ఇప్పుడు ‘వాల్తేరు వీరయ్య’తో (Waltair Veerayya) చిరంజీవిని (Chiranjeevi) వింటేజ్‌ లుక్‌తో సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. బాబీ తెరకెక్కించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ నేపథ్యంలో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు సుస్మిత.

ఈసారి సంక్రాంతి సంబరాలు ఎలా ఉండనున్నాయి?

‘‘మా సంబరాలు భోగి నుంచే మొదలవుతాయి. ఆరోజు అందరం ఉదయం 5గంటల కల్లా లేచి నాన్నగారి (Chiranjeevi) ఇంట్లోనే భోగి మంటలు వేసుకుంటాం. ఆ తర్వాత టిఫిన్లు, భోజనాలు అక్కడే. సాయంత్రం వరకు ఆటలాడుకుంటూ.. కబుర్లు చెప్పుకుంటూ సరదాగా గడిపేస్తాం. నాకు గాలిపటాలు ఎగరేయడం సరిగా రాదు. ఈసారైనా నేర్చుకోవాలనుకుంటున్నా (నవ్వుతూ)’’.  

తెరపై మీ నాన్నను ‘వాల్తేరు వీరయ్య’గా (Waltair Veerayya) చూసినప్పుడు మీకేమనిపించింది?

‘‘ఇది నాన్నకు బాగా కలిసొచ్చిన కంఫర్ట్‌ జోన్‌. ఇలాంటి కమర్షియల్‌ కథలు ఆయనకు బాగా నప్పుతాయి. చిత్రీకరణ సమయం నుంచే ఆయన దీన్ని ఓ పండగలా అనుభూతి చెందే వారు. సెట్‌కు ఎంతో ఉత్సాహంగా వెళ్లేవారు. అప్పుడే తెలుసు వాల్తేరు వీరయ్య హిట్టని’’.

వీరయ్య పాత్ర కాస్ట్యూమ్స్‌ కోసం ఎలాంటి రీసెర్చ్‌ చేశారు?

‘‘దర్శకుడు బాబీ (Bobby) కథ చెప్పాక నాతో అన్న మాట ఒకటే.. ‘మేము వింటేజ్‌ చిరంజీవిని చూపించాలనుకుంటున్నాం’ అన్నారు. ‘గ్యాంగ్‌లీడర్‌’, ‘ముఠామేస్త్రి’ తరహాలో ఉండాలనేసరికి పెద్దగా రీసెర్చ్‌ చేయాల్సిన అవసరం లేదనిపించింది. ఎందుకంటే నాన్నని చిన్నప్పటి నుంచి అలా చూస్తూనే పెరిగాం. వీరయ్య పాత్ర, ఆ పోర్టు వాతావరణం, సినిమా కలర్‌ థీమ్‌.. ఇలాంటి అన్ని అంశాల్ని దృష్టిలో పెట్టుకుని నాన్నకు ఎలాంటి కాస్ట్యూమ్స్‌ అయితే బాగుంటాయో ముందుగానే ఓ స్పష్టతకు వచ్చేశా’’.

కాస్ట్యూమ్స్‌ విషయంలో నాన్న సలహాలు తీసుకుంటారా?

‘‘కచ్చితంగా నాన్నతో మాట్లాడే నిర్ణయం తీసుకుంటా. ఎందుకంటే ఆయనకున్న అనుభవం వల్ల సినిమాలో ఆయా సీన్‌కు తగ్గట్లుగా ఎలా కనిపిస్తే బాగుంటుందనేది నాకన్నా తనకే బాగా తెలుసు. ఈ చిత్రంలో తను కట్టుకునే లుంగీలు ఎలా ఉండాలి.. దానికి ఎలాంటి మెటీరియల్‌ వాడాలి.. తను పెట్టుకునే కళ్లద్దాలు ఎలా ఉంటే బాగుంటుంది అన్నవి ఆయనే చెప్పారు. ఈ విషయంలో అమ్మ (Surekha) కూడా తన సలహాలు పంచుకుంది. నాన్నకు ఎలాంటి దుస్తులు బాగుంటాయి.. ఏవి బాగోవు అన్నది ఆమె చూడగానే చెప్పేస్తుంది. ఇందులో ఆయన వింటేజ్‌ లుక్‌లో కనిపించినా.. ఆయన కాస్ట్యూమ్స్‌ మొత్తం ఈతరం ప్రేక్షకులు మెచ్చేలా ట్రెండీగానే ఉంటాయి’’.

నిర్మాతగా మీ బ్యానర్‌లో నాన్నతో సినిమా చేసే ఆలోచనలున్నాయా?

‘‘నాకనే కాదు.. ప్రతి నిర్మాతకీ ఆయనతో సినిమా చేయాలని ఉంటుంది. నేనెప్పుడైనా ఈ ప్రస్తావన తీసుకొస్తే.. ‘మంచి కథ తీసుకురా వెంటనే చేసేద్దాం’ అంటుంటారు (నవ్వుతూ). ప్రస్తుతం ఆ కథల వేటలోనే ఉన్నాం.


‘‘రామ్‌చరణ్‌ (Ram Charan) - ఉపాసన (Upasana) తల్లిదండ్రులు కానున్నారు అన్నది మా కుటుంబానికి చాలా పెద్ద శుభవార్త. ఈ వార్త కోసం మేము ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాం. నాకు మేనల్లుడిని అందిస్తాడా.. మేనకోడల్ని ఇస్తాడా అన్నది చూడాలి. మాకైతే ఎవరైనా ఓకే. కాకపోతే మా ఇంట్లో ఇప్పటికే నలుగురు అమ్మాయిలం అయిపోయాం. కాబట్టి అబ్బాయి పుడితే చాలా బాగుంటుంది’’.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు