Sushmita Sen: గుండెపోటుకు గురైన నటి సుస్మితాసేన్‌.. సోషల్‌ మీడియాలో పోస్ట్‌

‘‘రెండు రోజుల క్రితం నేను గుండెపోటుకు గురయ్యా. యాంజియోప్లాస్టీ పూర్తయింది. స్టంట్‌ వేశారు’’ అని చెప్పి అభిమానులను షాక్‌ గురిచేశారు నటి సుస్మితాసేన్‌. ప్రస్తుతం ఆరోగ్యంగా బాగుందని తెలిపారు.

Updated : 02 Mar 2023 18:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తాను రెండు రోజుల క్రితం గుండెపోటుకు గురైనట్టు మాజీ విశ్వసుందరి, నటి సుస్మితా సేన్‌ (Sushmita Sen) తెలిపారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో భావోద్వేగ పోస్ట్‌ పెట్టారు. తన తండ్రితో కలిసి దిగిన ఫొటోను పంచుకుంటూ ఆయన చెప్పిన మాటలు ధైర్యాన్ని ఇస్తుంటాయని పేర్కొన్నారు. ‘‘నీ హృదయాన్ని ఎప్పుడూ సంతోషంగా, ధైర్యంగా ఉంచు. కష్టకాలంలో అది నీకు అండగా నిలుస్తుంది’.. మా నాన్న సుబీర్‌సేన్‌ నాకు చెప్పిన విలువైన మాటలివి. రెండు రోజుల క్రితం నేను గుండెపోటుకు గురయ్యా. యాంజియోప్లాస్టీ పూర్తయింది. స్టెంట్‌ వేశారు. నాకు చికిత్స చేసిన కార్డియాలజిస్ట్‌ ‘మీది గట్టి గుండె’ అని చెప్పారు (నవ్వుతూ). నా ఆరోగ్యం గురించి నా అభిమానులు, శ్రేయోభిలాషులకు తెలియాలనే ఈ పోస్ట్‌ పెడుతున్నా. ప్రస్తుతం నేను ఆరోగ్యంగా ఉన్నా. కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నా’’ అని సుస్మిత తెలిపారు. సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సుస్మిత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

మోడల్‌ రోహ్మాన్‌తో కొన్నాళ్లు రిలేషన్‌షిప్‌లో ఉన్న సుస్మిత తమ బంధానికి స్వస్తి పలికారు. ఆ తర్వాత ఆమె.. భారత మెగా టీ20 క్రికెట్‌ లీగ్‌ మాజీ ఛైర్మన్ లలిత్‌ మోదీ ప్రేమలో పడ్డారంటూ వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. సుస్మితతో తాను డేటింగ్‌లో ఉన్నట్టు లలిత్‌ గతేడాది ప్రకటించారు. సినిమాల విషయానికొస్తే.. 2015 నుంచి వెండి తెరకు దూరంగా ఉన్న సుస్మిత ఓటీటీ బాట పట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ‘ఆర్య’ అనే వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకులను అలరించిన ఆమె ‘తాలి’  అనే మరో సిరీస్‌లో నటించారు. త్వరలోనే విడుదలకానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని