Swathi Muthyam: ఊహించిన దానికంటే ఎక్కువగా నవ్వుకుంటున్నారు

‘‘ఓ సాధారణ కుటుంబంలో అనుకోని సమస్య వస్తే వాళ్లెలా స్పందిస్తారు అనే అంశాన్ని తీసుకొని ‘స్వాతిముత్యం’ సినిమా చేశాం. అదే అందరికీ బాగా నచ్చింది’’ అన్నారు లక్ష్మణ్‌ కె.కృష్ణ.

Updated : 08 Oct 2022 06:55 IST

‘‘ఓ సాధారణ కుటుంబంలో అనుకోని సమస్య వస్తే వాళ్లెలా స్పందిస్తారు అనే అంశాన్ని తీసుకొని ‘స్వాతిముత్యం’ (Swathi Muthyam) సినిమా చేశాం. అదే అందరికీ బాగా నచ్చింది’’ అన్నారు లక్ష్మణ్‌ కె.కృష్ణ. ఆయన దర్శకత్వంలో గణేష్‌ (Bellamkonda Ganesh), వర్ష బొల్లమ్మ (Varsha Bollamma) జంటగా నటించిన చిత్రమే ‘స్వాతిముత్యం’. సూర్యదేవర నాగవంశీ (Naga Vamsi) నిర్మించారు. రావు రమేష్‌, గోపరాజు రమణ, నరేశ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఇటీవలే విడుదలైంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం హైదరాబాద్‌లో విజయోత్సవ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో గణేష్‌ మాట్లాడుతూ.. ‘‘మా చిత్రానికి ఇంతటి ఘన విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా సరిపోవు. నటుడిగా నన్ను అందరూ అంగీకరించారు. ప్రతి ఒక్కరూ ‘తెరపై గణేష్‌ కనిపించలేదు. బాలా అనే కుర్రాడు మాత్రమే కనిపించాడ’ని చెబుతున్నారు. ఆ మాటలు విన్నప్పుడు నటుడిగా ఓ పది మార్కులు వేయించుకున్నానని చిన్న తృప్తి కలిగింది’’ అన్నారు. ‘‘విడుదలకు ముందే ‘ఈ సినిమా చూసి నవ్వుకుంటూ బయటకు వస్తార’ని మేం చెప్పాం. అయితే మేము ఊహించిన దానికంటే ఎక్కువగా నవ్వుకుంటూ బయటకు వస్తున్నారు. దీన్ని బట్టే చెప్పొచ్చు.. ఇదెంత పెద్ద విజయమన్నది’’ అంది నాయిక వర్ష. దర్శకుడు లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. ‘‘సినిమాలో పాత్రలు చాలా సహజంగా.. నిజ జీవితంలో చూసినట్లుగా ఉన్నాయని అందరూ ప్రశంసిస్తున్నారు’’ అన్నారు. ‘‘మా చిత్రానికి దక్కుతున్న ఆదరణ.. ఆనందాన్నిస్తోంది. ఈ వారాంతానికి వసూళ్లు మరింత పెరిగే అవకాశముంది’’ అన్నారు నిర్మాత నాగవంశీ. ఈ కార్యక్రమంలో సురేఖా వాణి, దివ్య శ్రీపాద తదితరులు పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని