Swathimuthyam: దసరా పోటీపై నాగవంశీ ఆసక్తికర కామెంట్స్‌..!

నిర్మాత బెల్లంకొండ సురేశ్‌ రెండో తనయుడు గణేశ్‌ (Ganesh) హీరోగా తెరకెక్కిన చిత్రం ‘స్వాతిముత్యం’ (Swathimuthyam). వర్షా బొల్లమ్మ కథానాయిక....

Published : 26 Sep 2022 16:08 IST

‘స్వాతిముత్యం’ ట్రైలర్‌ రిలీజ్‌ వేడుక

హైదరాబాద్‌: నిర్మాత బెల్లంకొండ సురేశ్‌ రెండో తనయుడు గణేశ్‌ (Ganesh) హీరోగా తెరకెక్కిన చిత్రం ‘స్వాతిముత్యం’ (Swathimuthyam). వర్షా బొల్లమ్మ కథానాయిక. నూతన దర్శకుడిగా లక్ష్మణ్‌ వెండితెరకు పరిచయమవుతున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమైన ఈచిత్రం దసరా కానుకగా అక్టోబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, అదే రోజు చిరంజీవి నటించిన ‘గాడ్‌ఫాదర్‌’, నాగార్జున నటించిన ‘ది ఘోస్ట్‌’ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పెద్ద హీరోల చిత్రాలతో తమ సినిమా పోటీ పడటంపై నిర్మాత నాగవంశీ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. ట్రైలర్‌ రిలీజ్‌ వేడుకలో పాల్గొన్న చిత్రబృందం విలేకర్లతో కాసేపు ముచ్చటించింది.

ఫస్ట్‌ డే కెమెరాని ఫేస్‌ చేసినప్పుడు మీ ఫీలింగ్‌ ఏమిటి?

బెల్లంకొండ గణేశ్‌: మొదటిరోజు సెట్‌లోకి అడుగుపెట్టగానే ఎంతో కంగారుపడ్డా. కానీ, టీమ్‌ మొత్తం నాకెంతో సపోర్ట్‌ చేసింది. అందరి సపోర్ట్‌తో ప్రతిరోజూ ఎంజాయ్‌ చేస్తూ నటించా.

అక్టోబర్‌ 5.. తెలుగు సినిమాకు పెద్దరోజు. చిరంజీవి నటించిన ‘గాడ్‌ ఫాదర్‌’, నాగార్జున నటించిన ‘ది ఘోస్ట్‌’.. ఇలా రెండు భారీ ప్రాజెక్ట్‌లు విడుదలవుతున్నాయి. ఏ ధైర్యంతో మీరు ‘స్వాతిముత్యం’ని అదే రోజు రిలీజ్‌ చేస్తున్నారు?

నాగవంశీ: ధైర్యం ఏమీ లేదండి. చిన్న సినిమా చిన్న సినిమా అంటున్నారు కానీ ఇది పెద్ద ప్రొడెక్షన్‌ హౌస్‌ నుంచి వస్తోన్న చిన్న చిత్రమిది. నా డిస్ట్రిబ్యూటర్స్‌ బృందం ఎంతో స్ట్రాంగ్‌గా ఉంది. పండుగకి సరిపోయే కుటుంబకథా చిత్రమిది. అందుకే పండుగ రోజుల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నా. మార్నింగ్‌ షో చిరంజీవి సినిమా.. మ్యాట్నీకి నాగార్జున సినిమా చూసినా.. ఫస్ట్‌ షో నుంచి మా చిత్రాన్ని ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నా.

బెల్లంకొండ సురేశ్‌ వాళ్లబ్బాయిని మీరెందుకు లాంచ్‌ చేశారు?

నాగవంశీ: బెల్లంకొండ సురేశ్‌ వాళ్లబ్బాయిని మేము లాంచ్‌ చేయడం లేదు. లక్ష్మణ్‌ కథ చెప్పినప్పుడు.. మాకొక అమాయకంగా ఉండే అబ్బాయి కావాలి అనుకున్నాం. గణేశ్‌ని చూసినప్పుడు ఆ పాత్రకు సరిపోతాడనిపించింది. సినిమా చేశాం. గణేశ్‌ అనే కుర్రాడితో నేను ‘స్వాతిముత్యం’ చేశా. అంతేకానీ నేను ఎవర్నీ లాంచ్ చేయడం లేదు.

మీ తండ్రి సురేశ్‌.. మీ అన్నయ్య సాయి శ్రీనివాస్‌ని భారీగా లాంచ్‌ చేశారు. మరి, మీరు మొదటి చిత్రాన్ని బయట బ్యానర్‌లో చేయడం ఏంటి?

బెల్లంకొండ గణేశ్‌: బయట బ్యానర్‌లో చేస్తే స్వతహాగా గుర్తింపు తెచ్చుకోవడానికి ఆస్కారం ఉంటుందని నేను నమ్ముతా.

ట్రైలర్‌ చూస్తుంటే ‘ఇంద్రుడు’ కాన్సెప్ట్‌ గుర్తుకు వస్తుంది..!

లక్ష్మణ్‌: ఇది ‘ఇంద్రుడు’ కాన్సెప్ట్‌ కాదు. స్వాతిముత్యం లాంటి అబ్బాయికి ఒక విచిత్రమైన సమస్య వస్తుంది. దానివల్ల అతని జీవితం ఎలా మారిందనే కథాంశంతో ఈచిత్రాన్ని తెరకెక్కించాం.

సినిమాల్లోకి వస్తున్నానని చెప్పినప్పుడు మీ అన్నయ్య రియాక్షన్‌ ఏమిటి?

బెల్లంకొండ గణేశ్‌: సినిమా ఒప్పుకున్నప్పుడు.. నాతోపాటు అన్నయ్య కూడా ఈ కథ విన్నారు. ఇది నాకు మంచి లాంచ్‌ అవుతుందని నమ్మాడు. 

ఆరడుగులున్నాడు ఇలాంటి అబ్బాయిలో ‘స్వాతిముత్యం’ ఎలా కనిపించాడు?

లక్ష్మణ్‌: నాకు స్వాతిముత్యం కనిపించలేదు. నా కథ, అందులోని బాలా పాత్ర మాత్రమే కనిపించింది. గణేశ్‌ని మొదటిసారి కలిసినప్పుడు యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ కథ చెప్పా. గణేశ్‌ వద్దనడంతో చివరికీ ఈ కథ చెప్పా.

కొత్త దర్శకుడు, కొత్త హీరో మీరు ఎలా ఈ సినిమా ఓకే చేశారు?

వర్షా బొల్లమ్మ: ఈ కథ నాకు చెప్పడానికి వచ్చిన రోజు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌  బ్యానర్‌పై సినిమా అనే చెప్పారు. ఆ తర్వాత కథ విన్నాను. నాకెంతో నచ్చింది.

నెపోటిజంపై మీ అభిప్రాయం ఏమిటి?

బెల్లంకొండ గణేశ్‌: మానాన్న నిర్మాత, నేను యాక్టర్‌.. అలాంటప్పుడు నేను నెపోకిడ్‌ కాను. సినిమా చూసిన తర్వాత ట్రోల్స్‌ చేస్తే నేను ఫీలవుతాను. అసలు నేనెంటో తెలియకుండా ట్రోల్‌ చేస్తే నేను అస్సలు పట్టించుకోను.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts