Cinema News: నా భర్తతో కలిసి పనిచేస్తే.. సెట్‌కి కత్తులు తీసుకురావాల్సిందే!

సినిమా సెట్‌ అంటే కెమెరాలు, లైట్లు.. ఇలా రకాల వస్తువులు ఉంటాయి. అయితే తన భర్తతో సినిమా చేస్తే వాటితోపాటు కత్తులు కూడా ఉండాల్సిందే అంటున్నారు ఆయుష్మాన్‌ ఖురానా సతీమణి తహీరా కశ్యాప్‌.

Published : 05 Jan 2022 12:21 IST

బాలీవుడ్‌ నటుడు ఆయుష్మాన్‌ ఖురానా భార్య తహీరా కశ్యప్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినిమా సెట్‌ అంటే కెమెరాలు, లైట్లు.. ఇలా పలు రకాల వస్తువులు ఉంటాయి. అయితే తన భర్తతో సినిమా చేస్తే వాటితోపాటు కత్తులు కూడా ఉండాల్సిందే అని సరదాగా అంటున్నారు ఆయుష్మాన్‌ ఖురానా సతీమణి తహీరా కశ్యప్‌. ‘విక్కీ డోనర్’‌, ‘బాలా’, ‘అంధాధున్‌’ వంటి చిత్రాలతో గుర్తింపు పొందారు ఆయుష్మాన్‌. ఇప్పుడాయన భార్య తహీరా ‘శర్మాజీకీ భేటీ’ చిత్రంతో దర్శకురాలిగా బాలీవుడ్‌లో అడుగుపెట్టనున్నారు. అయితే మీ దంపతులిద్దరూ కలిసి ఓ సినిమా చేస్తే అది ఎలా ఉండబోతుందనే ప్రశ్నకు ఆమె ఇలా సమాధానమిచ్చారు.

‘‘మేమిద్దరం సినిమా ప్రపంచాన్ని ఆస్వాదిస్తాం. ఎవరి పనులు వాళ్లు చేసుకొని ఇంటికొచ్చాక చక్కటి సమయాన్ని గడుపుతాం. వ్యక్తిగత విషయాల్లో వృత్తి గురించి ప్రస్తావనే ఉండదు. ఇక ఆయుష్మాన్‌ నా దర్శకత్వంలో చేస్తారా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేను. ఒక వేళ కలిసి పనిచేస్తే మాత్రం ది బెస్ట్‌ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. అలా జరగకపోతే ఇద్దరం ప్రతీ రోజూ సెట్‌కి కత్తులు తీసుకెళ్లాల్సిందే(నవ్వులు). ఏదేమైనా..  వృత్తిపరంగా ఇద్దరం సంతోషంగా ఉన్నాం. అన్ని విషయాలు చర్చించుకుంటాం. తన దగ్గరికి వచ్చే ప్రతీ స్క్రిప్ట్‌ని నాతో పంచుకుంటాడు. నేను పరిశీలించి మార్పులు, చేర్పులు ఉంటే సూచిస్తా. అలాగే తన చిత్రం ఎడిటింగ్‌ జరుగుతున్నప్పుడు దగ్గరుంటా. నా విషయంలోనూ ఆయుష్మాన్‌ అంతే జాగ్రత్తగా ఉంటాడు. నేను ఏ కథ రాసినా, సెట్‌లో సన్నివేశం చిత్రీకరిస్తున్నా.. ప్రతీది ఆయనతో చర్చిస్తా. ఎందుకంటే... ఇది మా ఇద్దరి ఎదుగుదలకు తోడ్పడుతుంది. ఆరోగ్యకరంగానూ ఉంటుంది’’ అన్నారు.

నేటి తరం భారతీయ ఆధునిక మహిళల జీవనశైలే కథాంశంగా ‘శర్మాజీ కీ భేటీ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు తహీరా కశ్యప్‌. దివ్యా దత్తా, సాక్షి తన్వార్‌, శియామీ ఖేర్‌.. ఇందులో ప్రధాన తారాగణం. కాగా గతంలో పలు షార్ట్‌ ఫిల్మ్‌లకు తహీరా దర్శకత్వం వహించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని