Bollywood: 2022లో బోల్తాకొట్టిన బీటౌన్‌ చిత్రాలు ఇవే..

2022లో బాలీవుడ్‌(Bollywood ) చిత్రాలు బాక్సాఫీసు వద్ద బోల్తాపడ్డాయి. బీటౌన్‌ అభిమానుల అంచనాలకు చేరుకోలేకపోయాయి.

Published : 21 Dec 2022 13:10 IST

ఈ ఏడాది బాలీవుడ్‌(Bollywood) సినిమాలు ఆశించినంతగా అలరించలేకపోయాయి. కొన్ని సినిమాలు ఫర్వాలేదనిపించినా మరికొన్ని మాత్రం బాక్సాఫీసు వద్ద డీలాపడ్డాయి.  కారణం ఏదైనా ప్రముఖ హీరోల చిత్రాలు కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. భారీ అంచనాల మధ్య విడుదలైనా సినిమాలు బడ్జెట్‌ను కూడా వసూలు చేయలేకపోయాయి. 2022లో సినీ ప్రియుల ఎదురుచూపులను నిరాశపరిచిన బీటౌన్‌ చిత్రాలేంటో ఇప్పుడు చూద్దాం. 

హీరోపంతి-2(Heropanti2)

బాలీవుడ్‌ టాప్‌ హీరో టైగర్‌ ష్రాఫ్(Tiger Shroff)‌, తారా సుతారియా(Tara Sutaria) జంటగా నటించిన హీరోపంతి-2 చిత్రం హిట్‌ కొట్టలేక పోయింది. ఏప్రిల్‌ 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అహ్మద్‌ఖాన్‌ దర్శకత్వంలో రూ.70 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం కేవలం రూ.24.91 కోట్లు మాత్రమే సాధించగలిగింది. భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మాత్రం డల్‌ అయింది.  

జయేశ్‌భాయ్‌ జోర్దార్‌ (Jayeshbhai Jordaar)

రణ్‌వీర్‌సింగ్‌(Ranveer Singh) అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన చిత్రాల్లో ‘జయేశ్‌భాయ్‌ జోర్దార్‌’ ఒకటి. దివ్యాంగ్‌ థక్కర్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో బొమన్‌ ఇరానీ, రత్నపథక్‌ షా, జియా వైద్య తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. మే13న విడుదలైన ఈ చిత్రం సినీ ప్రియులను ఆకట్టుకోలేక పోయింది. రూ.86 కోట్లతో రూపొందిన ఈ సినిమా రూ.16.59 కోట్లు వసూలు చేయగలిగింది.

యాక్షన్‌ హీరో(An Action Hero)

ఆయుష్మాన్‌ ఖురానా(Ayushmann Khurrana) తన కెరీర్‌లోనే తొలిసారి యాక్షన్‌ కథాంశంతో ‘యాక్షన్‌ హీరో’ అంటూ సందడి చేద్దామనుకున్నాడు. అయితే, ఎంతో ఆశగా వచ్చిన ఈ హీరోకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయి. తాజాగా విడుదలైన ఈ చిత్రం ఇప్పటి వరకు రూ.8.19కోట్లకే పరిమితమైంది.

సామ్రాట్‌ పృథ్వీరాజ్(Samrat Prithviraj)

ప్రేమ, శౌర్యం, ధర్మం మూర్తీభవించిన మహా వీరుడు పృథ్వీరాజ్‌ చౌహాన్‌ పాత్రలో అక్షయ్‌కుమార్‌(Akshay Kumar) నటించిన చిత్రం ‘సామ్రాట్‌ పృథ్వీరాజ్‌‌’. ఈ ఏడాది భారీ అంచనాల మధ్య విడుదలైన చిత్రాల్లో ఇది ఒకటి. చంద్రప్రకాశ్‌ ద్వివేది దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద అద్భుతాలు చేయడంలో విఫలమైంది. రూ.175 కోట్లతో నిర్మించిన ఈ సినిమా రూ.68.06 కోట్లు రాబట్టింది. 

రక్షా బంధన్(Raksha Bandhan)‌

అక్షయ్‌కుమార్‌(Akshay Kumar) హీరోగా తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘రక్షాబంధన్‌’. ఈ సినిమాకు ఆడియన్స్‌ కనెక్ట్‌ కాలేకపోయారు. టైటిల్‌కు తగట్టు సినిమాలేదన్నది సినీ అభిమానుల అభిప్రాయం. దీంతో ఈ సినిమా ఈ ఏడాది వైఫల్యాల జాబితాలో చేరింది. రూ.100కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం రూ.45.23 కోట్లు సాధించింది.

షంషేరా(Shamshera)

బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌బీర్‌కపూర్‌(Ranbir Kapoor) ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ‘షంషేరా’(Shamshera). చారిత్రక నేపథ్యంలో తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్‌ యాక్షన్‌ చిత్రం అలరించడంలో భారీగా విఫలమైంది. రూ.150కోట్లతో రూపొందించగా రూ.41.5 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది. 2022లోని అతి పెద్ద ఫ్లాపుల్లో ఒకటిగా మిగిలింది.  

లాల్‌ సింగ్‌ చడ్డా(Laal Singh Chaddha)

బాలీవుడ్‌ అగ్రహీరో అమిర్‌ ఖాన్‌ నటించిన సినిమా ‘లాల్‌ సింగ్‌ చడ్డా’(Laal Singh Chaddha). అమిర్‌ ఖాన్‌ సినిమా వస్తుందంటే ప్రేక్షకులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. అలాంటి వారిని ఈ సినిమా నిరాశపరిచింది. అమిర్‌ ఖాన్‌ సరసన కరీనా కపూర్‌ నటించిన ఈ చిత్రం రూ.180 కోట్లతో తెరకెక్కించారు. నివేదికల ప్రకారం ఈ చిత్రం 59.58 కోట్లు వసూలు చేయగలిగింది. 

బచ్చన్‌పాండే(Bachchan Pandey)

అక్షయ్‌ కుమార్‌ ప్రధానపాత్రలో నటించిన సినిమా ‘బచ్చన్‌పాండే’. విభిన్న కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో కృతి సనన్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ నాయికలుగా నటించారు. ఈ చిత్రం వసూళ్ల విషయంలో డీలా పడింది. రూ.165కోట్లతో నిర్మించగా రూ.49కోట్లకే పరిమితమైంది.

ధాకడ్ (Dhaakad)

బాలీవుడ్‌ యాక్షన్‌ క్వీన్‌ కంగనారనౌత్‌(Kangana Ranaut) నటించిన చిత్రం ధాకడ్‌(Dhaakad). మే20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన కంగనా.. మెప్పించలేక ఘోరపరాజయాన్ని పొందింది. దాదాపు రూ.85 కోట్లతో రూపొందించగా కేవలం రూ.2.3కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది. 

రన్‌వే 34(Runway 34)

బాలీవుడ్‌ అగ్ర కథానాయకులు అమితాబ్‌ బచ్చన్‌(Amitabh Bachchan), అజయ్‌ దేవగణ్‌(Ajay Devgn) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రన్‌వే 34’. అజయ్‌ దేవగణ్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రంలో రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కీలక పాత్ర పోషించింది. 2015లో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూ.65కోట్లతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఏప్రిల్‌ 29న విడుదలైన ఈ చిత్రం రూ.33.51కోట్ల కలెక్షన్లకే పరిమితం అయింది.

2022 అంతా హిందీ చిత్రసీమకు దాదాపు గడ్డుకాలమే నడిచి. ఏవో కొన్ని సినిమాలు మినహాయిస్తే వరుస పరాజయాలే పలకరించాయి. మరి రానున్న ఏడాది బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమను మలుపు తిప్పి పూర్వవైభవం తెస్తుందో లేదో వేచిచూడాలి.

-ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని