Takkar movie review: రివ్యూ: టక్కర్‌.. సిద్ధార్థ్‌ కొత్త మూవీ మెప్పించిందా?

Takkar movie review; సిద్ధార్థ్‌ కీలక పాత్రలో నటించిన ‘టక్కర్‌’ మూవీ ఎలా ఉందంటే?

Updated : 09 Jun 2023 14:48 IST

Takkar movie review; చిత్రం: టక్కర్‌; నటీనటులు: సిద్ధార్థ్‌, దివ్యాన్ష కౌశిక్‌, యోగిబాబు, అభిమన్యు సింగ్‌, మునీష్‌కాంత్‌, ఆర్జే విఘ్నేష్‌కాంత్‌, సుజాత శివకుమార్‌ తదితరులు; సంగీతం: నివాస్‌ కె. ప్రసన్న; సినిమాటోగ్రఫీ: వాంచినాథన్‌ మురుగేశన్‌; ఎడిటింగ్‌: జి.ఎ. గౌతమ్‌; రచన: శ్రీనివాస్‌ కవినయం, కార్తిక్‌ జి.క్రిష్‌; నిర్మాత: సుధాన్‌ సుందరమ్‌, జి.జయరామ్‌; దర్శకత్వం: కార్తిక్‌ జి. క్రిష్‌; విడుదల: 09-06-2023

తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హీరో సిద్ధార్థ్‌. కొన్నేళ్లుగా తెలుగు సినిమాలకు దూరమవడంతో ఆ ప్రభ మసకబారింది. రెండేళ్ల క్రితం ఆయన ‘మహాసముద్రం’తో మళ్లీ తెలుగు తెరపైకి రీఎంట్రీ ఇచ్చినా.. ఆశించిన ఫలితం దక్కలేదు. దీంతో ఇప్పుడు విజయమే లక్ష్యంగా ‘టక్కర్‌’తో మరోసారి బాక్సాఫీస్‌ ముందుకొచ్చారు. కార్తిక్‌ జి.క్రిష్‌ తెరకెక్కించిన చిత్రమిది. దివ్యాన్ష కథానాయికగా నటించింది. మరి టీజర్, ట్రైలర్లతో అంచనాలు పెంచిన ఈ సినిమా థియేటర్లో ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని పంచింది?(Takkar movie review) ఈ సినిమాతోనైనా సిద్ధార్థ్‌ హిట్‌ ట్రాక్‌ ఎక్కడా? లేదా?

కథేంటంటే: గుణశేఖర్‌ (సిద్ధార్థ్‌) ఓ పేద ఇంట్లో పుట్టిన కుర్రాడు. తన జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలు, అవమానాలకు ఆ పేదరికమే కారణమని బాధ పడుతుంటాడు. అందుకే ఎలాగైనా డబ్బు సంపాదించి కోటీశ్వరుడు అవ్వాలన్న ఉద్దేశంతో వైజాగ్‌కు వచ్చి.. చైనా వ్యక్తి వద్ద డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. ఓరోజు అనుకోకుండా ఆ కారుకు యాక్సిడెంట్‌ అవ్వడంతో.. గుణ యజమాని తనని తీవ్రంగా కొట్టి, దారుణంగా అవమానిస్తాడు. (Takkar movie review) దీంతో జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలోనే వైజాగ్‌లోనే పేరు మోసిన రాజ్‌ (అభిమన్యు సింగ్‌) అనే పెద్ద క్రిమినల్‌ అడ్డాకు వెళ్తాడు. అనంతరం అనుకోని పరిస్థితుల్లో అక్కడున్న రౌడీల్ని కొట్టి.. వాళ్ల కారును ఎత్తుకొచ్చేస్తాడు. అయితే ఆ కారు డిక్కీలో లక్కీ అలియాస్‌ మహాలక్ష్మీ (దివ్యాన్ష కౌశిక్‌) ఉంటుంది. మరి ఆమె ఎవరు? తనని రాజ్‌ ఎందుకు కిడ్నాప్‌ చేశాడు? ఆమె గుణ జీవితంలోకి ప్రవేశించాక ఏం జరిగింది?(Takkar movie review)  కోటీశ్వరుడు అవ్వాలన్న లక్ష్యంతో జీవిస్తున్న గుణకు ఆమె ఎలా ఉపయోగపడింది? వీళ్లిద్దరూ ఎలా ప్రేమలో పడ్డారు? రాజ్‌ గ్యాంగ్‌ నుంచి ఎలా తప్పించుకున్నారు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: ఓ పేదింట పుట్టిన కుర్రాడు.. షాట్‌కట్‌లో కోటీశ్వరుడు అయ్యేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? ఈ క్రమంలో ఓ అమ్మాయి అతని జీవితాన్ని ఎలా మలుపు తిప్పింది? వారిద్దరూ కలిసి చేసిన ప్రేమ ప్రయాణం ఎలా సాగింది? అన్నది క్లుప్తంగా ఈ చిత్ర కథాంశం. నిజానికి ఈ లైన్‌ను దర్శకుడు ‘ఆవారా’ తరహాలో రోడ్‌ జర్నీ యాక్షన్‌ థ్రిల్లర్‌లా మలచాలని ప్రయత్నించాడు. అందుకు అవసరమైన మసాలాలన్నీ కథలో సెట్‌ చేసుకున్నాడు. కానీ, వాటన్నింటినీ సరిగ్గా మేళవించి ఓ పసందైన వంటకాన్ని సిద్ధం చేయడంలో మాత్రం పూర్తిగా ఫెయిలయ్యాడు. సినిమా తొలి 20నిమిషాలే కాస్తలో కాస్తంత కాలక్షేపాన్నిస్తుంది. అక్కడి నుంచి ముగింపు వరకు మిగతా కథనమంతా తెగిన గాలిపటంలా సాగుతుంది. సినిమా ఆద్యంతం సిద్ధార్థ్‌ పిల్లి గెడ్డం లుక్‌తో కనిపిస్తారు. ఆ లుక్‌కూ పేదరికమే కారణమన్నట్లుగా సినిమాలో ఓ ఎపిసోడ్‌ సెట్‌ చేశారు. (Takkar movie review) ఈ కథను దర్శకుడు ఎంత సిల్లీగా తీర్చిదిద్దుకున్నాడో చెప్పటానికి ఈ ఎపిసోడ్‌ ఓ మచ్చుతునక.

కోటీశ్వరుడవ్వాలన్న లక్ష్యంతో హీరో వైజాగ్‌కు రావడం.. టాక్సీ  డ్రైవర్‌గా పనిచేయడం.. ఈ ప్రయాణంలోనూ రకరకాల అవమానాలు.. ఇలా కథ చాలా నెమ్మదిగా సాగుతూ పోతుంది. కోటీశ్వరుడయ్యేందుకు హీరో ఎప్పుడైతే అడ్డదారి తొక్కాలని ప్రయత్నిస్తాడో.. అక్కడి నుంచి కథ కాస్త వేగం పుంజుకుంటుంది. ఈ క్రమంలో ఓ కిడ్నాప్‌ గ్యాంగ్‌ను పోలీసుల నుంచి తప్పించేందుకు హీరో చేసే ప్రయత్నం ఆసక్తిరేకెత్తిస్తుంది. ఈ కారు ఛేజింగ్‌ ఎపిసోడ్‌ ఆద్యంతం ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దారు. అయితే, ప్రథమార్ధానికి విరామమిచ్చిన తీరు అంతగా ఆకట్టుకోదు. ఇక సెకండాఫ్‌ మొత్తం నాయకానాయికలు కలిసి ఎలా ప్రయాణం చేశారు? వారి మధ్య ప్రేమ ఎలా చిగురించింది? వీరిద్దరినీ పట్టుకునేందుకు రాజ్‌ తన గ్యాంగ్‌తో ఎలాంటి ప్రయత్నాలు చేశాడు?(Takkar movie review) ఈ గ్యాంగ్‌ నుంచి వారెలా తప్పించుకున్నారు? అన్న అంశాల చుట్టూ తిరుగుతుంది. అయితే వీటిలో ఏ ఒక్క సీక్వెన్సూ ప్రేక్షకుల్ని ఆకట్టుకోదు. నాయకానాయికల ప్రేమలో ఏమాత్రం ఫీల్‌ కనిపించదు. అలాగే హీరో - విలన్‌ల మధ్య బలమైన సంఘర్షణ ఉండదు. ప్రతినాయకుడి పాత్ర మరీ డమ్మీగా కనిపిస్తుంది. ప్రధమార్ధంలో సహనానికి పరీక్షలా నిలిచిన యోగిబాబు కామెడీ.. ద్వితీయార్ధంలో కాస్త అక్కడక్కడా నవ్వులు పూయిస్తుంది. పతాక సన్నివేశాలు బాగా నిరుత్సాహపరుస్తాయి. సినిమాని ముగించిన తీరు ఏమాత్రం మెప్పించదు.

ఎవరెలా చేశారంటే: గుణశేఖర్‌గా సిద్ధార్థ్‌ ఓకే. యాక్షన్, ఎమోషన్స్‌ సీన్స్‌ను తన అనుభవంతో అవలీలగా చేసుకుంటూ వెళ్లిపోయారు. అయితే ఇంత పేలవమైన కథను ఎందుకు చేయాలనుకున్నారో అసలు అర్థం కాదు. దివ్యాన్ష తెరపై అందంగా కనిపించింది. బోల్డ్‌ నటనతో రొమాంటిక్‌ సన్నివేశాల్లో చెలరేగిపోయింది. (Takkar movie review) ప్రతినాయకుడిగా అభిమన్యు సింగ్‌ పాత్ర ఆరంభంలో బలంగా కనిపించినా.. ద్వితీయార్ధానికి వచ్చే సరికి పూర్తిగా డమ్మీ అయిపోయింది. యోగిబాబు కామెడీ అక్కడక్కడా కాసిన్ని నవ్వులు పూయించింది. దర్శకుడు రాసుకున్న కథలో బలమైన లైన్‌ లేదు. దాని చుట్టూ నడిపిన కథ కూడా అంతే పేలవంగా ఉంది. పాటలు ఏ ఒక్కటీ గుర్తుంచుకునేలా లేవు. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా ఉన్నాయి.

  • బలాలు
  • + సిద్ధార్థ్, దివ్యాన్ష నటన
  • + యాక్షన్‌ సన్నివేశాలు
  • బలహీనతలు
  • - కథ, స్క్రీన్‌ప్లే
  • - ద్వితీయార్ధం
  • చివరిగా: ‘టక్కర్‌’.. ఆద్యంతం ఓ కుదుపుల ప్రయాణం! (Takkar movie review)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు