Tamannaah: ఇన్నేళ్లైనా ప్రేమ తగ్గలేదు

‘‘జయాపజయాల్ని నేనెప్పుడూ సమంగానే చూస్తాను. అయితే వ్యక్తిగతంగా విజయాల కన్నా.. పరాజయాల నుంచే ఎక్కువ నేర్చుకోగలిగా. ఓ వ్యక్తిగా నేనెలా ఉండాలన్నది తెలుసుకున్నా

Updated : 07 Dec 2022 14:57 IST

‘‘జయాపజయాల్ని నేనెప్పుడూ సమంగానే చూస్తాను. అయితే వ్యక్తిగతంగా విజయాల కన్నా.. పరాజయాల నుంచే ఎక్కువ నేర్చుకోగలిగా. ఓ వ్యక్తిగా నేనెలా ఉండాలన్నది తెలుసుకున్నా. నా పనితీరును మార్చుకోగలిగా. ఎప్పటికప్పుడు సరికొత్తగా ఆవిష్కరించుకోగలిగా’’ అంది కథానాయిక తమన్నా (Tamannaah). ఈ వేసవిలో ‘ఎఫ్‌3’తో వినోదాలు పంచిన ఆమె.. ఇప్పుడు ‘గుర్తుందా శీతాకాలం’తో (Gurtunda Seetakalam) నటించింది. సత్యదేవ్‌ (Satyadev) హీరోగా నటించిన చిత్రమిది. నాగశేఖర్‌ తెరకెక్కించారు. ఈ సినిమా శుక్రవారం రానుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించింది తమన్నా.

ఈ శీతాకాలం ప్రేమకథ ఎలా ఉంటుంది?

‘‘గుర్తుందా శీతాకాలం’ ఓ ఆహ్లాదకరమైన సినిమా. మంచి భావోద్వేగభరితమైన ప్రయాణంలా ఉంటుంది. ఒకప్పుడు కథానాయికలు కెరీర్‌ తొలినాళ్లలోనే ప్రేమకథలు చేస్తారనే భావన ఉండేది. ఇప్పుడు కాలం మారింది. మన సంబంధాలు మారాయి. ఆ కోణాన్ని చూపించేందుకే ఈ చిత్రం చేయాలని బలంగా నిర్ణయించుకున్నా. ఈ చిత్రంలో దేవ్‌ అనే పాత్రలో సత్యదేవ్‌ కనిపిస్తారు. ఆయన జీవితంలోని నాలుగు దశల్ని.. ఈ క్రమంలో వచ్చే నాలుగు ప్రేమకథల్ని ఇందులో చూపించారు. అతను ప్రేమలో పడిన ప్రతిసారీ తన ఆలోచనల్లో.. దృక్పథంలో మార్పు వస్తుంటుంది. అలా తాను పరిణతి చెందుతూ నిజమైన ప్రేమను ఎలా కనుగొన్నాడన్నది చిత్ర కథాంశం’’.

ఎంతో మంది అగ్రతారలతో కలిసి పనిచేశారు. సత్యదేవ్‌ లాంటి యువ హీరోతో చేయడం ఎలా అనిపించింది?

‘‘ఇప్పుడు పెద్ద హీరో.. చిన్న హీరో అనే గీతలు లేవు. ప్రస్తుత కాలంలో కథే హీరో. నాయకానాయికల్ని మామూలు నటుల్లాగే చూస్తున్నారు. నేను ఎవరితో చేసినా.. సినిమాని సినిమాలాగే చూస్తా. కథ బాగుండాలి.. ఆ చిత్రం ప్రేక్షకులకు నచ్చాలనే కోరుకుంటా. కొవిడ్‌ టైమ్‌లో సత్య చేసిన ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రం చూశా. ఆయన నటన చాలా సహజంగా అనిపించింది. తనతో కలిసి పని చేయాలన్న ఆసక్తి కలిగింది. అదే సమయంలోనే ఈ చిత్రం చేసే అవకాశం దొరికింది. చాలా సంతోషంగా అనిపించింది’’.

నటిగా కెరీర్‌ ప్రారంభించి 17ఏళ్లు పూర్తవుతోంది. ఈ ప్రయాణం ఎలా అనిపిస్తుంది?

‘‘చిత్రసీమలోకి అడుగు పెట్టినప్పుడు ఇన్నేళ్లు ఇక్కడ ఉంటానని అస్సలు అనుకోలేదు. అయితే నా సినీ ప్రయాణం మొదలై ఇన్నేళ్లు గడుస్తున్నా.. సినిమాలపై నాకున్న ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. పరిశ్రమలోకి వచ్చినప్పుడు నటన పట్ల ఎంత కసితో ఉన్నానో.. ఇప్పుడూ అలాగే ఉన్నా. ప్రస్తుతం నాకు వీలైనంత వరకు ప్రయోగాలు చేయడానికి ప్రయత్నిస్తున్నా. నా మనసుకు నచ్చే ఆసక్తికరమైన కథలే ఎంచుకోవాలనుకుంటున్నా. భవిష్యత్తులో నిర్మాతగా మారాలన్న ఆలోచనలున్నాయి’’. 


కెరీర్‌ ఆరంభం నుంచి ఇప్పటి వరకు నన్ను నేను ఎప్పుడూ స్టార్‌గా భావించుకోలేదు. ఇప్పుడూ అలా చూసుకోవాలని అనుకోవడం లేదు. నన్ను నేను ఓ మంచి నటిగానే చూసుకోవాలనుకుంటున్నా. ఎందుకంటే ఇలా ఉండగలిగినప్పుడే ప్రేక్షకులకు కొత్తదనాన్ని అందించగలను. నా పాత్ర నిడివిని దృష్టిలో పెట్టుకొని నేనెప్పుడూ సినిమా ఎంచుకోను. కథలో నాలుగైదు సన్నివేశాలున్నా.. ఆ పాత్ర ప్రభావం బలంగా ఉంటే చాలు. ‘సైరా’లో నా పాత్ర నిడివి తక్కువే. కానీ, ఆ పాత్ర తాలూకూ ప్రభావం కథలో చాలా బలంగా కనిపిస్తుంది.


‘‘నేను ప్రస్తుతం చిరంజీవితో ‘భోళా శంకర్‌’లో నటించనున్నా. జనవరి నుంచి ఆ సినిమా చిత్రీకరణలో పాల్గొంటా. మలయాళంలో ‘బాంద్రా’ అనే చిత్రం చేస్తున్నా. అలాగే వచ్చే ఏడాదిలో నా నుంచి మూడు ఓటీటీ ప్రాజెక్ట్‌లు రానున్నాయి’’. 


నా పెళ్లిపై ఇప్పటికే బోలెడన్ని ఊహగాన వార్తలొచ్చాయి. ఓ డాక్టర్‌తో వివాహం జరిగినట్లు రాశారు. త్వరలో ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోనున్నట్లు వదంతులు వచ్చాయి. పెళ్లి అనేది జీవితంలో ఒక అందమైన భాగం. అలాంటి సందర్భం వస్తే దాన్నొక వేడుకలా అందరికీ తెలిసేలాగే చేసుకుంటా. అందరి ఇళ్లలో లాగానే మా ఇంట్లో వాళ్లూ పెళ్లి చేసుకోమని అడుగుతుంటారు. అలాగని నన్నేమీ తొందర పెట్టట్లేదు. ఎందుకంటే వాళ్లకి నా లక్ష్యాల పట్ల పూర్తి స్పష్టత ఉంది.


 

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని