Tamannaah: విజయ్‌ వర్మతో రిలేషన్‌షిప్‌.. ప్రతి శుక్రవారం మాకో పెళ్లి జరుగుతుంది: తమన్నా

Tamannaah: విజయ్‌ వర్మతో రిలేషన్‌షిప్‌పై తమన్నా స్పందిస్తూ.. దీనిపై అందరికీ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు.

Published : 13 Mar 2023 01:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలుగులో స్టార్‌ హీరోయిన్‌గా వరుస అవకాశాలు దక్కించుకున్న మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah). ఇప్పటికీ అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉంది. గత కొంతకాలంగా నటుడు విజయ్‌ వర్మ(Vijay Varma)తో ఆమె రిలేషన్‌షిప్‌లో ఉన్నారన్న వార్తలు సామాజిక మాధ్యమాల వేదికగా చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఏడాది కొత్త సంవత్సరం సందర్భంగా గోవాలో జరిగిన పార్టీలో ఇద్దరూ ముద్దు పెట్టుకుంటూ దిగిన ఫొటో ఆ వార్తలకు మరింత ఊతమిచ్చింది. అంతేకాదు, తమన్నా పోస్టుల్లో విజయ్‌ను ముద్దు పేరుతో పిలవడం కూడా వీరిద్దరి మధ్య ఏదో ఉందన్న గుసగుసలకు బలం చేకూరుస్తోంది.  తాజాగా వీరి బంధంపై తమన్నా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ.. ‘‘మేమిద్దరం కలిసి ఒక సినిమా చేశాం. అప్పటి నుంచి మా బంధంపై గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. దీనిపై అందరికీ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంతకు మించి నేనేమీ చెప్పను’’ అని కుండ బద్దలు కొట్టారు. అంతేకాదు, చిత్ర పరిశ్రమలో హీరోల చుట్టూ నడిచే గాసిప్స్‌తో పోలిస్తే కథానాయికల రిలేషన్‌షిప్‌, వివాహాలపైనే వార్తలు అధికమని అసహనం వ్యక్తం చేశారు.  ‘‘ఇలా ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు. మాకు నిజంగా పెళ్లి జరిగే సమయానికి ప్రజలు చాలా పెళ్లిళ్లు చేసేస్తారు. ప్రతి శుక్రవారం మాకో పెళ్లి జరుగుతుంది. ఆ తర్వాత ‘అయ్యో మీకు పెళ్లి జరగలేదా’ అంటారు. డాక్టర్‌ నుంచి బిజినెస్‌మెన్‌ వరకూ అన్ని వర్గాల వారితో మాకు పెళ్లిళ్లు చేసేస్తారు. ఇవన్నీ చూస్తే చాలా పెళ్లిళ్లు చేసుకున్న భావన మాకు కలుగుతోంది. నాకు నిజంగా పెళ్లెప్పుడు జరుగుతుందో తెలియడం లేదు. అప్పటివరకూ ప్రజలు ఇదే ఉత్సాహంతో ఉండగలరా? అప్పటికి మరోదాని గురించి ఆలోచిస్తుంటారేమో’’ అంటూ తమన్నా వ్యంగ్యంగా స్పందించారు.

ప్రస్తుతం తమన్నా ‘భోళా శంకర్‌’, ‘జైలర్‌’, ‘అరణ్మయై4’ ‘బోలే చుడియన్‌’, ‘భంద్రా’ చిత్రాల్లో నటిస్తోంది. వీటితో పాటు ‘జీ కర్దా’ అనే వెబ్‌సిరీస్‌లోనూ కీలక పాత్ర పోషించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు