అలనాటి ‘జమున’గా తమన్నా..!

చిత్రసీమలో అలనాటి నటుల స్థానం ఎప్పటికీ ప్రత్యేకం, ఆసక్తికరం. అందుకే వాళ్ల జీవిత కథల ఆధారంగా వరుస బయోపిక్‌లు వస్తున్నాయి. ఇటీవల సావిత్రి బయోపిక్‌గా వచ్చిన ‘మహానటి’ ప్రేక్షకులను ఎంతగా అలరించిందో అందిరికీ తెలిసిందే.

Published : 11 Mar 2021 01:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినీ ప్రేమికుల హృదయాల్లో అలనాటి నటుల స్థానం ఎప్పటికీ ప్రత్యేకమే. అందుకే దర్శకనిర్మాతలు ఒకప్పటి తారల జీవిత కథల ఆధారంగా వరుస బయోపిక్‌లు తీస్తున్నారు. ఇటీవల సావిత్రి బయోపిక్‌గా వచ్చిన ‘మహానటి’ ప్రేక్షకులను ఎంతగా అలరించిందో అందిరికీ తెలిసిందే. కీర్తి సురేశ్‌ ప్రధానపాత్రలో డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించిన ఆ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు బద్దలు కొట్టడంతో పాటు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఇప్పుడు మరో దిగ్గజ నటి జమున బయోపిక్‌ రాబోతున్నట్లు తెలుస్తోంది. అందులో తమన్నా ప్రధానపాత్ర పోషించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల విడుదలైన ‘దేవినేని’ చిత్రాన్ని తెరకెక్కించిన శివనాగు ఈ బయోపిక్‌కు దర్శకత్వం వహించనున్నారట. స్ర్కిప్టుపనుల్లో భాగంగా ఆయన ఇప్పటికే జమునను కలిసినట్లు సమాచారం.

అయితే.. అటు నటనతో పాటు డ్యాన్సుతోనూ ప్రేక్షకులను ఎంతోకాలం పాటు అలరించిన జమున పాత్రకు మిల్కీబ్యూటీ తమన్నా అయితే న్యాయం చేయగలుగుతుందని ఆమెను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్‌, నాగేశ్వరరావు, ఎస్వీరంగారావు, కృష్ణవంటి అగ్రనటులతో తెరను పంచుకున్న నటి జమున. అప్పట్లో ఆమెతో సినిమా చేసేందుకు ఎంతోమంది దర్శకనిర్మాతలతో పాటో యువహీరోలు ఆసక్తి చూపించేవారు. కర్ణాటకకు చెందిన ఈ కన్నడ కస్తూరి కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ ఎన్నో సినిమాలు చేశారు. తెలుగు చిత్రసీమలోనే ఆమె ఎక్కువ సినిమాలు చేయడం విశేషం. ఇదిలా ఉండగా.. ఈ బయోపిక్‌కు సంబంధించి చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు తమన్నా సైతం ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. గోపిచంద్‌తో కలిసి ఆమె నటించిన ‘సీటీమార్‌’ చిత్రం ఏప్రిల్‌ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని