కరోనాతో ప్రముఖ హాస్యనటుడు మృతి

ప్రముఖ తమిళ హాస్య నటుడు పాండు కరోనాతో మరణించారు. కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో గురువారం ఆసుపత్రిలో చేరిన

Updated : 06 May 2021 16:32 IST

 

చెన్నై: ప్రముఖ తమిళ హాస్య నటుడు పాండు కరోనాతో మరణించారు. కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో బుధవారం ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. తనదైన హావభావాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న పాండు 500లకి పైగా చిత్రాల్లో నటించారు. 40 సంవత్సరాల సుదీర్ఘ నట ప్రస్థానం ఆయనది. 1980లో దూరదర్శన్‌లో ప్రసారం చేసిన ఓ ధారావాహికలోనూ కనిపించి మెప్పించారు. ఆ సంవత్సరంలోనే వెండితెరకి పరిచయమ్యారు. పాండు నటించిన తొలి చిత్రం ‘కరై ఎల్లమ్‌ స్నేన్‌బగపూ’. పాండు మృతి పట్ల తమిళ చిత్ర పరిశ్రమతోపాటు డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలు సంతాపం ప్రకటించాయి. ‘పాండు మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆయన నటుడు మాత్రమే కాదు మంచి ఆర్టిస్ట్‌ కూడా. పెయింటింగ్స్‌ అత్యద్భుతంగా వేసేవారు’ అని స్టాలిన్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పాండు ప్రతిభని గుర్తు చేశారు ఏఐఏడీఎంకే అగ్ర నేతలు పన్నీరు సెల్వం, కె. పళని స్వామి.  పాండుకి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.

ఏఐడీఎంకే సింబల్‌ రూపకర్త పాండునే!

ఏఐడీఎంకే పార్టీ సింబల్‌ను పాండునే రూపొందించారు. ఎంజీ రామచంద్రన్‌ పార్టీని స్థాపించినప్పుడు పాండును పిలిచి పార్టీకి ఒక సింబల్‌ను రూపొందించాల్సిందిగా సూచించారు. 1977 ఎన్నికలకు ముందు మరోసారి ఎంజీఆర్‌ పిలవగా, రెండు ఆకుల గుర్తును పాండు డిజైన్‌ చేసి ఇచ్చారు. ఆ తర్వాత ఎంజీఆర్‌తో ఆయన ప్రయాణం కొనసాగింది. ‘క్యాపిటల్‌ లెటర్స్‌’ పేరుతో ఒక డిజైన్‌ కంపెనీని కూడా పాండు నడిపారు. దీని ద్వారా చిత్ర పరిశ్రమలోని సినీ ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాలకు పేర్లు డిజైన్‌ చేసి ఇచ్చేవారు. పాండు మృతి పట్ల ఏఐడీఎంకే నేతలు పళనిస్వామి, పన్నీర్‌ సెల్వం విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని