Tammareddy Bharadwaj: ‘లైగర్‌’ వివాదం.. అది పూరీ బాధ్యత కాదు: తమ్మారెడ్డి భరద్వాజ

పూరీ జగన్నాథ్‌ - విజయ్‌ దేవరకొండ కాంబినేషన్‌లో వచ్చిన భారీ బడ్జెట్‌ చిత్రం ‘లైగర్‌’. ఆగస్టు 25న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద పరాజయం పొందింది. ఈనేపథ్యంలో చిత్రబృందానికి, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు మధ్య  వివాదం నెలకొందంటూ వస్తోన్న వార్తలపై తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు.

Updated : 26 Oct 2022 11:37 IST

హైదరాబాద్‌: ‘లైగర్‌’ (Liger) సినిమా విషయంలో దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు మధ్య వివాదం నెలకొందంటూ వస్తోన్న వార్తలపై ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ (Tammareddy Bharadwaj) స్పందించారు. చట్టప్రకారం చూసుకుంటే.. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు డబ్బులు చెల్లించాల్సిన బాధ్యత పూరీకి లేదని ఆయన స్పష్టం చేశారు.

‘‘పూరీజగన్నాథ్‌ తెరకెక్కించిన ‘నేనింతే’ విడుదలైనప్పుడు కూడా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఇదేవిధంగా ధర్నాకు దిగారు. ఆ తర్వాత కొన్నిరోజులకే ఆ వివాదం సద్దుమణిగింది. ఇక, ‘లైగర్‌’ విషయానికి వస్తే.. పూరీ మాటల్లో ధర్మం ఉంది. ఆయన ఎవరి వద్దకు  వెళ్లి సినిమాను కొనుగోలు చేయాలని అడగలేదు. విజయ్‌ దేవరకొండ నటించిన గత చిత్రాలు ఎంత మొత్తంలో వసూళ్లు రాబట్టాయో అంచనా వేసుకుని.. ‘లైగర్‌’ను కొనుగోలు చేయాలి. అయితే.. ఎక్కువ రేటు పెట్టి సినిమాను కొనుగోలు చేసి వాళ్లు తప్పు చేశారు. న్యాయంగా మాట్లాడుకుంటే.. పూరీ ఒక సినిమాతో మార్కెట్‌లోకి వచ్చాడు. ఒక ధర చెప్పి.. దాన్ని ఆ మొత్తానికే అమ్ముతానని అన్నాడు. ఆయన చెప్పిన ధరకు ఇష్టపడే కొనుగోలు చేసి.. మేము నష్టపోయాం, తిరిగి మా డబ్బులు మాకివ్వండి అని అడగడం ఎందుకు? అంత మొత్తంలో సినిమాను కొనుగోలు చేసేటప్పుడే ఆలోచించాలి’’ అని తమ్మారెడ్డి అన్నారు.

పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కిన చిత్రం ‘లైగర్‌’. భారీ బడ్జెట్‌తో ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద పరాజయం పొందింది. ఈ సినిమాను కొనుగోలు చేసి తాము మోసపోయామని, చిత్రబృందం వెంటనే డబ్బులు తిరిగి ఇవ్వకపోతే ధర్నాకు దిగుతామని పలువురు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు నిర్ణయించుకున్నారని తెలుసుకున్న పూరీ ఓ ఆడియో రిలీజ్‌ చేసినట్లు ప్రచారం సాగుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని