Tammareddy: సినిమా వాళ్లు చీప్‌గా కనిపిస్తున్నారా? ముందు మీ సంగతి చూసుకోండి!

సినీ పరిశ్రమను నిందిస్తున్న నాయకులు తలదించుకోవాలని, కుల ప్రస్తావన లేకుండా ఉపాధి కల్పించేది సినిమా రంగమేనని దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ(tammareddy bharadwaj) అన్నారు.

Published : 13 Jan 2022 01:27 IST

హైదరాబాద్‌: సినీ పరిశ్రమను నిందిస్తున్న నాయకులు తలదించుకోవాలని, కుల ప్రస్తావన లేకుండా ఉపాధి కల్పించేది సినిమా రంగం మాత్రమేనని దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ (tammareddy bharadwaj) అన్నారు. సినీ పరిశ్రమపై ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ నాయకులు చేసిన వ్యాఖ్యలపై తమ్మారెడ్డి స్పందించారు. బుధవారం హైదరాబాద్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

‘‘పుష్ప’ తీసిన నిర్మాతలు ఒక కులానికి చెందినవారు కావటం వల్లే మరో కులానికి చెందిన వారిని సినిమాలో తిట్టారని పలువురు ఆరోపిస్తున్నారు. సినిమా విషయంలో కులాలు, మతాలు ఎందుకు? గతంలో కొందరు నాయకులు రెచ్చిపోయి మాట్లాడారు. వాళ్లు గడ్డి తిన్నారని ఇప్పుడు మీరూ గడ్డి తింటున్నారా?మీకు ఒక సామాజిక వర్గం ఓట్లు వస్తే గెలవలేదు. అందరూ ఓట్లు వేశారు. సినిమా వాళ్లు చీప్‌గా దొరికారని ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా? సామాజిక వర్గాల పేరుతో రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారు? మీ ఎమ్మెల్యేలు ఎంత తింటున్నారో బహిరంగ చర్చకు సిద్ధమా?మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మీ ఆస్తులెంత? ఇప్పుడెంత?సినిమా కోసం వందల మంది కష్టపడతారు. కష్టపడితే వచ్చే ప్రాజెక్టు అది. కోట్లు పెట్టుబడి పెట్టిన తర్వాత పైసా పైసా ఏరుకుంటున్నాం. మీలాగా రూపాయి పెట్టి కోట్లు దోచుకు తినడం లేదు. మమ్మల్ని అనే ముందు మీ సంగతి మీరు చూసుకోండి. రాజకీయ నేతలు ఇంకెప్పుడూ బెదిరింపులకు పాల్పడవద్దు’’

‘‘ఆన్‌లైన్‌ టికెటింగ్‌ తీసుకొస్తే, ఏ రోజు లెక్కలు ఆరోజు తెలిసిపోతాయి. అందుకే అలా కావాలని చెప్పాం. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని సరిగా అమలు చేస్తే చిత్ర పరిశ్రమకు లాభం చేకూరుతుంది. సాటి మనిషిని గౌరవించటం ముఖ్యం. దాసరి నారాయణరావు స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. ఆయన కేవలం దర్శకుడు మాత్రమే కాదు, నటుడు, నిర్మాత, ఎగ్జిబిటర్‌ ఇలా అనే అంశాలపైనా, వ్యక్తులపైనా పట్టు ఉంది. అన్ని విషయాలు తెలిసిన అలాంటి వ్యక్తి మరొకరు లేరు. చిరంజీవిగారు చొరవ తీసుకుని కొన్ని పనులు చేస్తున్నారు. అయితే, ఆయన పరిమితంగా ఉంటున్నారు. సమస్యల పరిష్కారం కోసం దాసరి నారాయణరావులా సమయం వెచ్చించి పనిచేసే వ్యక్తి ఇప్పుడు ఇండస్ట్రీలో లేరు. 24 గంటలూ ఆయన ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేవారు. చిరంజీవి, బాలకృష్ణ, మోహన్‌బాబులాంటి అగ్ర నటులతో పాటు, కొందరు దర్శకులు తమ పరిధి మేరకు చిత్ర పరిశ్రమకు ఏదో ఒకటి చేస్తున్నారు. ‘అవసరం వచ్చినప్పుడు ఉంటాను’ అని చిరంజీవి భరోసా ఇచ్చారు కదా! తప్పకుండా ఆ సమయానికి వస్తారు. చిన్న పంచాయతీలకు మాత్రం తాను రానని కరాఖండీగా చెప్పారు. ఏ ప్రభుత్వానికీ చిత్ర పరిశ్రమ వ్యతిరేకంగా ఉండదు. వ్యక్తిగతంగా అభిప్రాయభేదాలు ఉండవచ్చు. 30శాతం సినిమాలు ఆంధ్రప్రదేశ్‌లోనూ షూటింగ్‌ జరుపుకొంటున్నాయి. లాజిక్‌ తెలియకుండా కొందరు మాట్లాడుతున్నారు.  మద్రాసు నుంచి చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌ రావటానికి 30ఏళ్లు పట్టింది. ఏపీలో ఎక్కువ సినిమాలు షూటింగ్‌ జరగాలంటే ఇంకా సమయం పట్టవచ్చు. అక్కడ లొకేషన్లు అన్నీ ఫ్రీగా లభిస్తాయి. ఈ విషయమై చిరంజీవితో సహా పలువురు సినీ పెద్దలు కృతజ్ఞతలు కూడా తెలిపారు. ఏపీలో సినిమా టికెట్‌ రేట్లు చిన్న సినిమాలకు సరిపోతాయి. పెద్ద సినిమాలకు ఇబ్బంది అవుతుంది. మాట్లాడుకుని సరిచేసుకుంటే సరిపోతుంది. తెలంగాణ ప్రభుత్వం చేసినట్లు టికెట్‌ ధరలను వర్గీకరించాలి. ఇదే విషయాన్ని ఛాంబర్‌ కూడా ఏపీ ప్రభుత్వానికి సూచించింది. 99శాతం సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నాం’’ అని తమ్మారెడ్డి భరద్వాజ చెప్పుకొచ్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని