Tanikella bharani: తనికెళ్ల భరణి రాసింది తారుమారు చేసి!

రంగస్థలం నుంచి వెండితెరకు వచ్చి ఎన్నో విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేసిన సీనియర్‌ నటుడు తనికెళ్ల భరణి(Tanikella bharani).

Published : 19 Jun 2022 17:31 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రంగస్థలం నుంచి వెండితెరకు వచ్చి ఎన్నో విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేసిన సీనియర్‌ నటుడు తనికెళ్ల భరణి(Tanikella bharani). తెలుగు చిత్ర పరిశ్రమలో ట్రెండ్‌ సెట్టర్‌ ‘శివ’కు ఆయనే సంభాషణలు అందించారు. రచయితగానే కాదు, నటుడిగానూ తనదైన ముద్రవేశారు. కొంతకాలం కిందట దర్శకుడిగానూ అందరి ప్రశంసలు అందుకున్నారు. నాటక రంగంలో విశేష అనుభవం ఉన్న తనికెళ్ల భరణి ఎన్నో గొప్ప నాటకాల్లో నటించారు.

దర్శకుడు వంశీ-తనికెళ్ల భరణి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. వంశీ దర్శకత్వం వహించిన అనేక చిత్రాలకు సంభాషణలను తనికెళ్ల భరణి రాశారు. భరణి తొలినాళ్లలో వంశీ దగ్గర పనిచేస్తుండగా, కొన్ని సినిమాలకు ఇద్దరూ సన్నివేశాలను రాసేవారు. ఈ సందర్భంగా రాసిన సన్నివేశాల్లో ఏది బాగుంటే దానిని ఫైనల్‌ చేసేవారు. అలా రాసిన వాటిని ఓ సహాయ దర్శకుడిని పిలిచి, చదవమంటే తనికెళ్ల భరణి రాసిన సన్నివేశాలను నీరసంగా, వంశీ రాసిన సన్నివేశాలను ఉషారుగా చదవడంతో భరణి నొచ్చుకునేవారట.

అయితే, ఒకరోజు ఇద్దరూ రాసిన సన్నివేశాలను ఎవరు ఏ సన్నివేశం రాశారో తెలియకుండా మరో కాగితంపై రాయించి, అదే సహాయ దర్శకుడిని పిలిచి చదవంటే, తనికెళ్ల భరణి రాసినదని తెలియక మంచి ఉషారుగా, అద్భుతంగా ఉందనేలా చదివాడు. దీంతో వంశీ ఆ సహాయ దర్శకుడిని పిలిచి ‘ఈ సన్నివేశం రాసింది భరణినే. ఇండస్ట్రీలోకి వచ్చే కొత్తవారికి చేయి అందించి ప్రోత్సహించాలి తప్ప, నిరుత్సాహ పరచకూడదు’ అని సున్నితంగా మందలించారట. అయితే, భరణి రాసిన సన్నివేశాలు బాగోలేనప్పుడూ వంశీ తనని మందలించిన సందర్భాలు ఉన్నాయని తనికెళ్ల భరణి చెబుతుంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని