Taraka Ratna: ఎంట్రీతోనే వరల్డ్‌ రికార్డు క్రియేట్‌ చేసిన తారకరత్న!

తారకరత్న వెండితెరకు పరిచయమవడమే ఓ సంచలనం. ఒకేరోజు 9 సినిమాలను ప్రారంభించారు.

Published : 19 Feb 2023 09:31 IST

హైదరాబాద్‌: సాధారణంగా ఎవరైనా ఒక చిత్రంతో కథానాయకుడిగా ఇండస్ట్రీకి పరిచయమవుతారు. ముుహూర్తం బాగుందంటే మరో చిత్రాన్ని కూడా పట్టాలెక్కిస్తారు. కానీ, నందమూరి నట వారసుడి ఎంట్రీ అంటే మామూలు విషయం కాదు కదా! సినీ నటుడిగా తారకరత్న (Taraka Ratna) ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 9 చిత్రాలను ఒకే రోజు ప్రారంభించారు. అప్పట్లో తెలుగు సినీ పరిశ్రమలో ఇదో పెద్ద సంచలనం. అంతేకాదు, ఒకే రోజు 9 చిత్రాలను ప్రారంభించిన నటుడిగా తారకరత్న రికార్డు సృష్టించారు.

అయితే, వీటిలో కొన్ని సినిమాలు మాత్రమే చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలయ్యాయి. కొన్ని సినిమాలు అసలు సెట్స్‌పైకే వెళ్లలేదు. ‘ఒకటో నెంబర్ కుర్రాడు’, ‘యువరత్న’, ‘తారక్’, ‘నో’, ‘భద్రాద్రి రాముడు’ తదితర చిత్రాలు మాత్రం విడుదలయ్యాయి. కథానాయకుడిగా నటించేవాళ్లు విలన్‌గా చేయడానికి అంత ఆసక్తి చూపరు. కానీ, తారకరత్న ఏ పాత్ర చేయడానికైనా సై అనేవారు. అందుకే ‘అమరావతి’లో విలన్‌గా నటించి మెప్పించారు. అంతేకాదు, ఉత్తమ ప్రతినాయకుడిగా నంది అవార్డును సైతం సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ‘రాజా చెయ్యి వేస్తే’ చిత్రంలోనూ మరోసాని విలన్‌గా నటించారు. తన బాబాయ్‌ నందమూరి బాలకృష్ణతో కలిసి నటించాలని తారకరత్న చెప్పేవారు.  అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న కొత్త చిత్రంలో తారకరత్న ఓ కీలక పాత్ర చేయాల్సి ఉంది. దీనిపై ఇప్పటికే చర్చలు కూడా జరిగాయట. అయితే, అది కార్యరూపం దాల్చేలోపు తారకరత్న కన్నుమూయడం విచారకరం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు