Pareshan: స్వచ్ఛమైన మనసుతో తీసిన చిత్రమిది

తిరువీర్‌ హీరోగా రూపక్‌ రోనాల్డ్‌సన్‌ తెరకెక్కించిన చిత్రం ‘పరేషాన్‌’. సిద్ధార్థ్‌ రాళ్లపల్లి నిర్మించారు. పావని కరణం కథానాయిక. ఈ సినిమా హీరో రానా సమర్పణలో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది.

Updated : 05 Jun 2023 12:48 IST

తిరువీర్‌ హీరోగా రూపక్‌ రోనాల్డ్‌సన్‌ తెరకెక్కించిన చిత్రం ‘పరేషాన్‌’ (Pareshan). సిద్ధార్థ్‌ రాళ్లపల్లి నిర్మించారు. పావని కరణం కథానాయిక. ఈ సినిమా హీరో రానా సమర్పణలో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో ఇటీవల సక్సెస్‌ మీట్‌ నిర్వహించారు. ఈ వేడుకకు దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘అమ్మ, స్నేహితులతో కలిసి సినిమా చూశాను. ‘కేరాఫ్‌ కంచరపాలెం’, ‘సినిమా బండి’, ‘బలగం’ చిత్రాలు చూసినప్పుడు ఎలాంటి అనుభూతి కలిగిందో అలాంటి అనుభూతే ఈ సినిమా చూసినప్పుడు కలిగింది. ఇందులోని ప్రతి పాత్రతో నేను కనెక్ట్‌ అయ్యాను. తిరువీర్‌తో పాటు అందరూ సహజంగా నటించారు. దర్శకుడు రూపక్‌కు ఓ యూనిక్‌ స్టైల్‌ ఉంది. చాలా నిజాయితీగా, స్వచ్ఛమైన మనసుతో తీసిన చిత్రమిది’’ అన్నారు. ‘‘ఈ సినిమాకి యువతరంతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. థియేటర్స్‌ హౌస్‌ఫుల్‌ అవుతున్నాయి. నైజాంలో మరో 75 థియేటర్స్‌ పెంచుతున్నాం’’ అన్నారు దర్శకుడు రూపక్‌. ‘‘లగాన్‌’ లాంటి టీమ్‌తో కలిసి చేసిన చిత్రమిది. మేము గెలవాలంటే చివరి బంతికి సిక్స్‌ కొట్టాలి అనుకుంటున్నప్పుడు.. రానా వచ్చి మాతో సిక్స్‌ కొట్టించారు. సినిమాకి వస్తున్న ఆదరణ ఆనందాన్నిస్తోంది. చాలా గర్వంగా ఉంది’’ అన్నారు తిరువీర్‌. ‘‘మా సినిమాని ఇంత గొప్పగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అంది పావని.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని