Chandrabose: నాటు నాటుకు గోల్డెన్‌ గ్లోబ్‌.. విదేశీ భాషలందు కూడా తెలుగు లెస్స: చంద్రబోస్‌

Chandrabose: నాటు నాటు పాటకు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు రావడంతో సినీ గేయ రచయిత చంద్రబోస్‌ను వాల్తేరు వీరయ్య టీమ్‌ సత్కరించింది.

Published : 14 Jan 2023 18:23 IST

హైదరాబాద్‌: ఒకప్పుడు దేశ భాషలందు తెలుగు లెస్స అనేవారని, ఇప్పుడు విదేశీ భాషలందు కూడా తెలుగు లెస్స అనే స్థాయికి చేరామని సినీ గేయ రచయిత చంద్రబోస్‌ (Chandrabose) అన్నారు. ‘RRR’ చిత్రంలోని నాటు నాటు పాటకు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. కీరవాణి స్వరాలు సమకూర్చిన ఈ పాటకు చంద్రబోస్‌ సాహిత్యం అందించారు. ఈ క్రమంలో శనివారం హైదరాబాద్‌లో ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) సక్సెస్‌మీట్‌ జరిగింది. ఈ సందర్భంగా అగ్ర కథానాయకుడు చిరంజీవి(Chiranjeevi).. చంద్రబోస్‌ను వేదికపై పిలిచి అభినందనలు తెలిపారు. చంద్రబోస్ సరస్వతీ పుత్రుడని, ఆయన రాసిన పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం గర్వకారణంగా ఉందని అన్నారు. తొలిసారి తెలుగు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం సంతోషమని, కీరవాణితో పాటు పాటలో భాగస్వాములైన అందరికీ అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా గేయ రచయిత చంద్రబోస్‌ (Chandrabose) మాట్లాడుతూ.. ‘‘చిరంజీవి అన్నయ్యకు హిట్లర్‌ నుంచి 20 సినిమాల్లో దాదాపు 50 పాటలకు పైగా రాశా. ‘వాల్తేరు వీరయ్య’లో ‘వీరయ్య టైటిల్‌ సాంగ్‌’ను అత్యుత్తమ విలువలతో రాశా. ‘చరిత్రలో నీకు కొన్ని పేజీలుండాలి’ అని ‘ఠాగూర్‌’లో కొన్ని పదాలు రాశా. మనం రాసే మాటలు, ఆలోచనలు ప్రజలకు స్ఫూర్తినిస్తాయో లేదో తెలియదు కానీ, వాటి నుంచి మనం స్ఫూర్తిని పొందాలని నేను నమ్ముతా. అంతర్జాతీయ సాహిత్య చరిత్రలో నాకంటూ ఒక వాక్యం రాసుకున్నానంటే, అందుకు కారణం మీకు (చిరంజీవి) నేను రాసిన పాట నుంచి స్ఫూర్తి పొందినదే. ‘వాల్తేరు వీరయ్య’లో పాట కోసం ఏడాది పాటు ఎదురు చూసి దేవిశ్రీ మంచి పాట రాయించుకున్నారు. అన్నయ్య చిరంజీవితో మాట్లాడే ప్రతిసారి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉన్నా. రవితేజ (Ravi teja) కు తొలిపాట ‘హాయ్‌ రే హాయ్‌’ నేనే రాశా. అప్పటి నుంచి మా ప్రయాణం కొనసాగుతోంది. ఒకప్పుడు ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అనేవారు. ఇప్పుడు ‘విదేశ భాషలందు కూడా తెలుగు లెస్స’ అనే స్థాయికి చేరాం. ఎంతో మంది సాహిత్యకారులు రాసిన పాటలను వెనక్కినెట్టి ‘నాటు నాటు’కు గోల్డెన్‌గ్లోబ్‌ రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ అవార్డు రావడం వెనుక పాట పాడిన కాలభైరవ, రాహుల్‌సిప్లిగంజ్‌లతో పాటు, పాటకు కొరియోగ్రఫీ చేసిన ప్రేమ్‌ రక్షిత్‌ మాస్టర్‌ కృషి, తెరపై తమదైన శైలిలో డ్యాన్స్‌ చేసిన రంజింపచేసిన ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ల కష్టం కూడా ఉంది’’ అని చంద్రబోస్‌ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు