సినిమా చూసి కంటతడి పెట్టుకున్నా: మోహన్‌బాబు

‘మోసగాళ్లు’లో కొన్ని సన్నివేశాలు చూసి కంటతడి పెట్టుకున్నానని అన్నారు మోహన్‌బాబు అన్నారు. ఇలాంటి కథ మునుపెన్నడూ రాలేదని, ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ చిత్రం చూడాలని చెప్పారు. మంచు విష్ణు, కాజల్‌ ప్రధాన......

Updated : 17 Mar 2021 12:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘మోసగాళ్లు’లో కొన్ని సన్నివేశాలు చూసి కంటతడి పెట్టుకున్నానని అన్నారు మోహన్‌బాబు అన్నారు. ఇలాంటి కథ మునుపెన్నడూ రాలేదని, ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ చిత్రం చూడాలని చెప్పారు. మంచు విష్ణు, కాజల్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మోసగాళ్లు’. జెఫ్రీ గీ చన్‌ దర్శకత్వం వహించారు. బాలీవుడ్‌ స్టార్‌ సునీల్‌శెట్టి కీలక పాత్ర పోషించారు. మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం సోమవారం ప్రిరిలీజ్‌ వేడుక ఏర్పాటు చేసింది. ఈ వేడుకలో పాల్గొని మోహన్‌బాబు మాట్లాడారు. ‘‘సాధారణంగా నేను ఇంగ్లిష్‌ మాట్లాడను. ఎందుకంటే నా మాతృభాష తెలుగు. కానీ సునీల్‌శెట్టి కోసం మాట్లాడుతున్నాను. ఆయన ఒక గొప్ప నటులు. ఆయనతో పనిచేసే అవకాశం రావడం గొప్ప విషయం. ఇక కాజల్‌ గురించి చెప్పాలంటే.. ఆమె నా కూతురులాంటిది. ఒక పెద్ద హీరోయిన్‌ అయ్యుండి కూడా హీరోకి సోదరి పాత్ర చేసేందుకు ఒప్పుకోవడం చాలా గొప్ప విషయం. ఒకవేళ నేనే కాజల్‌ స్థానంలో ఉంటే ఈ సినిమాకు ఒప్పుకోకపోయి ఉండేవాడిని. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. భారతదేశంలో ఇలాంటి కథ నాకు తెలిసి ఇంతవరకు ఎప్పుడూ రాలేదు. ఈ సినిమా కోసం ఎంతో రీసెర్చ్‌ చేశారు. కాజల్‌-విష్ణు మధ్య సన్నివేశాలు కంటతడి పెట్టించాయి. సినిమాకు అందరూ ఎంతో కష్టపడి పనిచేశారు. మార్చి 19న థియేటర్లలో సినిమాను అందరూ చూడాలని కోరుకుంటున్నా’’ అని ఆయన అన్నారు.

విష్ణు మాట్లాడుతూ.. ‘‘అడిగిన వెంటనే ఒప్పుకోవడం సునీల్‌శెట్టి గొప్పతనం. నేను జిమ్‌ చేసింది మొత్తం.. ఫైట్‌ సీన్లలో ఆయన చేతిలో దెబ్బలు తినడానికే సరిపోయింది. ఇకపోతే హీరోయిన్‌.. స్టోరీ చెప్పగానే కాజల్‌ ఈ సినిమాలో చేయడానికి ఒప్పుకుంది. అంతపెద్ద స్టార్‌ హీరోయిన్‌ అసలు సోదరి పాత్ర చేయడమే ఎక్కువ. చెల్లి అంటే ఆలోచించవచ్చు. కానీ.. హీరోకి అక్క పాత్ర అంటే ఎవరూ సాహసించరు. కానీ కాజల్‌ చేసింది. ఆమెకు కథ నచ్చడమే ఇందుకు కారణం. మీకు కూడా సినిమా నచ్చుతుంది’’ అని విష్ణు అన్నారు. అంతకుముందు కాజల్‌ మాట్లాడుతూ.. ‘‘నా పెళ్లి తర్వాత వస్తున్న మొదటి సినిమా ఇది. సినిమా కోసం నేను కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నాను. 2020లోనే విడుదల కావాల్సి ఉన్నా కరోనా వల్ల అది కుదరలేదు. అందరం దాదాపు సంవత్సరం పాటు థియేటర్లకు దూరమయ్యాం. ఇప్పుడు మళ్లీ మనకు అవకాశం వచ్చింది. అందరూ థియేటర్‌కు వెళ్లి ‘మోసగాళ్లు’ సినిమా చూడాలి’’ అని ఆమె కోరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని