teja interview: ప్రతి సీన్‌ సర్‌ప్రైజ్‌లా ఉంటుంది

ప్రేక్షకులు సినిమా చూసేందుకు థియేటర్‌కు రావాలంటే దానికి కారణం ఉండాలని అన్నాడు యువ కథానాయకుడు తేజ సజ్జ. తనలాంటి కొత్త నటులు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే కొత్తరకమైన కథలు చేయాల్సిందేనని చెప్పుకొచ్చాడు. తేజ, ప్రియాప్రకాశ్‌ వారియర్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఇష్క్‌’(ప్రేమ కథ కాదు).

Published : 24 Jul 2021 22:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రేక్షకులు సినిమా చూసేందుకు థియేటర్‌కు రావాలంటే దానికి కారణం ఉండాలని అన్నాడు యువ కథానాయకుడు తేజ సజ్జ. తనలాంటి కొత్త నటులు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే కొత్తరకమైన కథలు చేయాల్సిందేనని చెప్పుకొచ్చాడు. తేజ, ప్రియాప్రకాశ్‌ వారియర్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఇష్క్‌’(ప్రేమ కథ కాదు). మలయాళంలో వచ్చిన  చిత్రానికి అదే పేరుతో తెలుగులో రీమేక్‌గా ఎస్‌.ఎస్‌.రాజు దర్శకత్వంలో తెరకెక్కించారు. జూలై 30 థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా సినిమా హీరో తేజ మీడియాతో ముచ్చటించారు. పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఆయన మాటల్లోనే..

ఎక్కడా బోర్‌ కొట్టదు..

రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు మళ్లీ తెరచుకుంటున్నాయి. ముందుగా ‘ఇష్క్‌’ సినిమానే విడుదల కాబోతోంది. అన్ని నిబంధనలు పాటించి థియేటర్లు తెరుస్తున్నారు. కొత్తరకమైన సబ్జెక్ట్‌తో వస్తున్న సినిమా ఇది. ‘హీరో, హీరోయిన్‌ ఇలాగే ఉండాలి.. కథ ఇలాగే ఉండాలి’ అనే ప్రేక్షకుల భావనను ఈ సినిమా మార్చేస్తుంది. ముందే ఊహించినట్లుగా ఏ సన్నివేశం ఉండదు. మొదలైనప్పటి నుంచి సినిమా పూర్తయ్యేవరకూ ప్రతి సన్నివేశం సర్‌ప్రైజ్‌గా ఉంటుంది. కొత్తరకమైన సినిమా చూస్తున్న భావన ప్రేక్షకులకు కలుగుతుంది. ఎక్కడా కొంచెం కూడా బోర్‌ కొట్టదు. 

అదొక్కటే మార్చాం..

మాతృకతో పోలిస్తే ఈ సినిమాలో చాలా మార్పులు చేశాం. అయితే.. కథలో మాత్రం మార్పులు చేయలేదు. రన్‌టైమ్‌ తగ్గించాం. వాళ్ల సినిమా 2.10 గంటలు ఉంటే మన తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా 1.55గంటలుగా మార్పులు చేశాం. మహతి స్వరసాగర్‌ అద్భుతమైన సంగీతం ఇచ్చారు. ఇలాంటి సినిమాకు బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చాలా ముఖ్యం. సినిమాలో ఆయన సంగీతం అందర్నీ అలరిస్తుందని నమ్మకంగా ఉన్నాం. మేము థ్రిల్‌ అయినట్టే ప్రేక్షకులు కూడా థ్రిల్‌ అవుతారని ఆశిస్తున్నాం.

నా గురించే మాట్లాడుకుంటారు..!

ఇంత తక్కువ వయసులోనే ఇలాంటి పర్మార్ఫెన్సు ఓరియెంటెట్‌ పాత్ర రావడం ఇదే తొలిసారి. ఇంతకుముందు ‘ఓబేబీ’, ‘జాంబీరెడ్డి’ చేశాను. అప్పుడు బాగా చేశావన్నారు. అయితే.. ఈసినిమాకు వచ్చేసరికి మాత్రం ప్రత్యేకంగా నాగురించి మాట్లాడతారని అనుకుంటున్నా. నా నటన మీదే  సినిమా మొత్తం ఆధారపడి ఉంటుంది.  నేను కథ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాను. కొత్తరకం కథలు చెప్తేనే ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీకి వచ్చే నాలాంటి వాళ్లు ఉండగలుగుతారు. ప్రేక్షకులు థియేటర్‌కు వచ్చి సినిమా చూడాలంటే ఒక కారణం ఉండాలి. ఆ కారణం కోసం నేను వెతుకుతూ ఉంటా. కొత్తరకం సినిమాలు చెప్పాలనుకోవడం నా ఉద్దేశమైతే.. అలాంటి కథలు నాదగ్గరికే రావడం నా అదృష్టం.

ఎక్కడా హద్దులు దాటలేదు

మెగాసూపర్‌ గుడ్‌ ఫిల్మ్స్‌ వాళ్లు ఏడేళ్లు తెలుగులో సినిమాలు చేయకుండా.. ఇప్పుడు ఓ పక్క ‘లూసీఫర్‌’ చేస్తూనే మరోపక్క ఒక మంచి కొత్తవాళ్లతో సాధారణస్థాయి సినిమా చేద్దామని ఈ సినిమా చేస్తున్నారు. వాళ్లు సినిమా కథను విశ్వసించారు. వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టేలా సినిమాను తెరకెక్కించాం. రొమాంటిక్‌ థ్రిల్లర్‌ అంటే ఈ సినిమాలో ఎక్కడా హద్దులు దాటే పరిస్థితి ఉండదు. కుటుంబ సమేతంగా చూడగలిగే సినిమా ఇది. 

పోలికలు పెట్టినా బాగానే చేశాం..

ఈ సినిమాలో ఇప్పటి వరకూ తెలుగు ప్రేక్షకులు చూడని కథను చూపించాలనే ఈ సినిమా తీశాం. ఈ సినిమాను ఎక్కడి నుంచి తీసుకొచ్చాం.  పోలికలు పెడతారనేది తర్వాతి విషయం. ఒకవేళ పోలికలు పెట్టినా సరే మనం చాలా అద్భుతంగా చేశామనే అనుకుంటున్నాం. బడ్జెట్‌ విషయంలో కానీ.. ఏ విషయంలోనైనా.. ఇప్పటికే ట్రైలర్‌, టీజర్లకు వచ్చిన స్పందన చూస్తే ఆ విషయం అర్థమవుతుంది.

పెద్దపెద్ద సినిమాలతో పోలిస్తే మా చిన్ని సినిమాలు డిస్ట్రిబ్యూషన్‌లో గానీ విడుదల చేయడం గానీ చాలా సులభం. మా నిర్మాత ఎన్వీ.ప్రసాద్‌గారు ఆయనే ఎగ్జిబిటర్‌, డిస్ట్రిబ్యూటర్‌ అవడం వల్ల ఆయన థియేటర్‌లోనే విడుదల చేద్దామని అనుకున్నాం. మొదటి ‘ఇష్క్‌’లాంటి సినిమా విడుదలైతే బాగుంటుందని అందరం కూర్చొని మాట్లాడి నిర్ణయం తీసుకున్నాను.

విచిత్రంగా ముగ్గురూ నాకే ఫోన్‌ చేశారు

ఈ సినిమాను చేయాలని మన దగ్గర ముగ్గురు ప్రముఖ నిర్మాతలు అనుకున్నారు. విచిత్రంగా ముగ్గురూ నాకే ఫోన్‌ చేసి.. సినిమా చేద్దామనుకుంటున్నాం.. నువ్వైతే బాగా సెట్‌ అవుతావు అని అడిగారు. మెగా సూపర్‌ గుడ్‌ నాలుగోది. ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ చాలా కూల్‌గా ఉంటుంది. మాతో కలిసి తిరిగే ఒక సాధారణ అమ్మాయిలాగే సరదాగా కలిసిపోతుంది. చాలా కష్టపడి పనిచేసిందామె. తన పనేదో తాను జాగ్రత్తగా చేసుకుపోయే రకం. 

ప్రశాంత్‌వర్మతో చేసేది పాన్‌ ఇండియా చిత్రం. ఐదు భాషల్లో విడుదల చేయాలని అనుకుంటున్నాం. 15 రోజుల షూటింగ్‌ కూడా పూర్తయింది. మైథలాజికల్‌ టచ్‌ పెద్దగా ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే ‘హనుమ్యాన్‌’ ఒక ‘సూపర్‌ హీరో’. ఆ సినిమా తర్వాత కెరీర్‌లో పెద్ద మార్పు వస్తుందని భావిస్తున్నా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని