Teja: దర్శకుడిగా 70 సినిమాలు వదిలేశా.. ‘అహింస’ ఆలస్యానికి కారణమిదే..: తేజ

‘అహింస’ సినిమా ఆలస్యం గురించి దర్శకుడు తేజ (Teja) స్పందించారు. ఈ సినిమా షూట్‌లో అభిరామ్‌కు ప్రమాదం జరిగినట్టు చెప్పారు.

Published : 23 May 2023 21:15 IST

హైదరాబాద్‌: చాలా ఏళ్ల గ్యాప్‌ తర్వాత తన తదుపరి ప్రాజెక్ట్‌ ‘అహింస’ (Ahimsa)తో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు దర్శకుడు తేజ (Teja). అభిరామ్‌ దగ్గుబాటి హీరోగా నటించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో భాగంగా ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ‘అహింస’ ఆలస్యం కావడానికి గల కారణాన్ని చెప్పారు. అలాగే, తన కెరీర్‌ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.

‘‘నచ్చని చోట పనిచేయడం నాకు ఇష్టం లేదు. కెరీర్‌ మొదలుపెట్టిన రోజు నుంచి ఇప్పటివరకూ నేను ఇలాగే ఉన్నాను. కెమెరామెన్‌గా చేసిన రోజుల్లో ‘అంతం’ సినిమా కోసం వర్క్‌ చేశాను. ఆ సినిమా షూట్‌లో నాకు ఏదో విషయం నచ్చలేదు. దాంతో రేపటి నుంచి షూట్‌కు రానని చెప్పేశా. ఆ తర్వాత కొన్నిరోజులకు వాళ్లు మళ్లీ రమ్మని పిలిచారు. వెళ్లి ఆ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి వచ్చాను. ఇక, దర్శకుడిగా సుమారు 70 సినిమాలు వదిలేశాను. నేను డబ్బులు కోసం సినిమా చేయను. సినిమా తీసే ప్రాసెస్‌ను ఎంజాయ్‌ చేస్తాను. అలా అయితేనే సినిమా చేస్తాను’’ అని తేజ చెప్పారు.

అనంతరం ‘అహింస’ సినిమా ఆలస్యం కావడంపై ఆయన స్పందిస్తూ.. ‘‘సినిమాలోని ఓ షాట్‌లో అభిరామ్‌ హీరోయిన్‌ను ఎత్తుకుని పరిగెత్తాలి. దాన్ని షూట్‌ చేస్తున్నప్పుడు అతడు కిందపడిపోయాడు. రెండు మోకాళ్లకు దెబ్బలు తగిలాయి. ఆయన కోలుకుని వచ్చేవరకూ షూట్‌ నిలిపివేశాను. అలా, మా సినిమా షూట్‌ ఆలస్యమైంది’’ అని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని