Updated : 18 Oct 2021 14:11 IST

MAA Elections: ‘మా’ బైలాస్‌ మారుస్తాం: మంచు విష్ణు

నాగబాబు, ప్రకాశ్‌రాజ్‌ రాజీనామాలు ఆమోదించడం లేదని వ్యాఖ్య

హైదరాబాద్‌: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’ సభ్యత్వానికి నటుడు నాగబాబు, ప్రకాశ్‌రాజ్‌ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా వాళ్లిద్దరి రాజీనామాలపై నటుడు, ‘మా’ నూతన అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించారు. సోమవారం ఉదయం తిరుమల చేరుకున్న మంచు విష్ణు, ఆయన ప్యానెల్‌ సభ్యులు శ్రీ విద్యానికేతన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విష్ణు, ఆయన ప్యానెల్‌ సభ్యులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రకాశ్‌రాజ్‌ సీసీ టీవీ ఫుటేజ్‌ చూసుకోవచ్చు..

‘‘ఈసారి ‘మా’ ఎన్నికల్లో గెలిస్తే శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తానని మొక్కుకున్నాను. ఆ విధంగానే నాతోపాటు ప్యానెల్‌లోని సభ్యులందరం శ్రీవారిని దర్శించుకున్నాం. మా గెలుపునకు కారణమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఏ పోటీలోనైనా గెలుపోటములు సర్వసాధారణం. ఈ సారి మేము గెలిచాం. వాళ్లు ఓడిపోయారు. వాళ్లు తర్వాత గెలవొచ్చు. ఎన్నికల పోలింగ్‌ సమయంలో చిన్న చిన్న గొడవలు జరిగాయి. ఆ విషయంలో ఇరువైపులా తప్పు జరిగింది. మేము ప్రజాస్వామ్యయుతంగా గెలిచాం. ప్రకాశ్‌రాజ్‌ కావాలనుకుంటే సీసీటీవీ ఫుటేజ్‌ పరిశీలించుకోవచ్చు.

పవన్‌, నేను చాలా విషయాలు చర్చించుకున్నాం

చిరంజీవి, మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్‌. ‘అలయ్‌ బలయ్‌’ కార్యక్రమంలో స్టేజ్‌పైకి రాకముందే పవన్‌క్యలాణ్‌తో మాట్లాడాను. మేమిద్దరం చాలా విషయాలపై చర్చించుకున్నాం. ప్రోటోకాల్‌ ప్రకారం మేమిద్దరం స్టేజ్‌పై మాట్లాడుకోలేదు. స్టేజ్‌ మీద ఏం జరిగిందో అది మాత్రమే మీడియాకి తెలిసింది. పవన్‌కల్యాణ్‌కి చాలామంది ఫ్యాన్స్‌ ఉన్నారు. వాళ్లందర్నీ సర్‌ప్రైజ్‌ చేయడం కోసమే నేను ట్విటర్‌లో వీడియో షేర్‌ చేశాను. నాన్నగారితో చిరంజీవి ఫోన్‌లో మాట్లాడారు. వాళ్లిద్దరూ ఏం మాట్లాడుకున్నారో నాన్నని అడగండి.

సినీ పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం

ప్రకాశ్‌రాజ్‌, నాగబాబు ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వాటిని మేము ఆమోదించడం లేదు. దీనిపై వారికి త్వరలోనే నేను లేఖలు పంపిస్తాను. ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌లో గెలుపొందిన సభ్యులు రాజీనామాలు చేసినట్లు మీడియా ద్వారానే నాకు తెలిసింది. ఒక్కరి నుంచి మాత్రమే నాకు రాజీనామా అందింది. మిగిలిన వాళ్ల నుంచి కూడా వచ్చాక.. మేము ఒక్కసారి చర్చించుకుని.. సినీ పెద్దలతో మాట్లాడి అప్పుడు నిర్ణయం తీసుకుంటాం. చాలా విషయాల్లో అసోసియేషన్‌లోని బైలాస్‌ మార్చాలనుకుంటున్నాను. అది కూడా సినీ పెద్దలతో చర్చించాకే నిర్ణయం తీసుకుంటాను. ఎవరంటే వాళ్లు ‘మా’ సభ్యులు కాకూడదని నేను భావిస్తున్నాను ’’ అని విష్ణు తెలిపారు.

మేమంతా ఒక్కటే కుటుంబం: మాదాల రవి

‘‘మా గెలుపు కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మమ్మల్ని గెలిపించిన వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఎన్నికల వరకే ఈ ప్యానెల్స్‌. ఎన్నికల అయ్యాక మేమంతా ఒక్కటే కుటుంబం. ‘మా’ సభ్యుల సంక్షేమమే మా ప్రధాన లక్ష్యం. మేము గెలవడానికి ప్రధాన కారణం విష్ణు ప్రకటించిన మేనిఫెస్టో’’ అని ‘మా’ నూతన వైస్‌ ప్రెసిడెంట్‌ మాదాల రవి అన్నారు.

ఓడిన వాళ్లకి కూడా విష్ణునే అధ్యక్షుడు: బాబు మోహన్‌

‘‘విష్ణు ‘మా’ ప్రెసిడెంట్‌ కావడం ఆనందంగా ఉంది. ఆయన చదువుకున్న వ్యక్తి, సంస్కారం ఉన్న మనిషి. అందర్నీ కలుపుకుని పనిచేస్తాడు. ‘మా’లోని సభ్యులందరికీ ఆయన ప్రెసిడెంట్‌. ఓడిన వారికి కూడా ఆయనే ప్రెసిడెంట్‌. ఎన్నికల్లో జరిగిన వివాదాలను వదిలేయాలని అనుకుంటున్నాం. కానీ, ప్రత్యర్థి ప్యానెల్‌ వాళ్లు ఇంకా ఆ విషయాలను వదలడంలేదు. మనమంతా ఒకే తల్లి బిడ్డలం. మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అంశాన్ని ఆయన నేరవేరుస్తాడు. మీరు కూడా సహకరించండి. అలా కాదని మీరు ఇలాగే వ్యవహరిస్తే రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలు ఊరుకోరు. ఈ రెండు సంవత్సరాలే కాదు.. ఆ తర్వాత రెండు సంవత్సరాలు కూడా విష్ణునే ప్రెసిడెంట్‌గా ఉంటారు’’ అని నటుడు బాబు మోహన్‌ వివరించారు.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని