Tollywood: వీళ్ల పేరు అలా మారింది!

సినిమా నటుల్లో చాలా మందికి వేరే వాళ్లే పేర్లు మారుస్తారు. కొందరు వాళ్లే మార్చుకుంటారు.

Published : 01 Mar 2022 17:01 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సినిమా నటుల్లో చాలా మందికి వేరే వాళ్లే పేర్లు మారుస్తారు. కొందరు వాళ్లే మార్చుకుంటారు. సంఖ్యా శాస్త్రం, ఇంకేదో లెక్కల ప్రకారం పేర్లు మార్చుకున్న వాళ్లు ఉన్నారు. రజనీకాంత్‌ అసలు పేరు శివాజీరావు గైక్వాడ్‌. శివాజీ గణేశన్‌ లాగా తన పేరులో ‘శివాజీ’ ఉందని ఆయన సంతోషించేవారు. అయితే ‘మూన్రు ముడిచ్చి’ అనే తమిళ చిత్రంలో కె.బాలచందర్‌ ఆయనకు ముఖ్యపాత్ర ఇస్తూ పేరు మార్చారు. ‘శివాజీ పేరు నీకు ఇష్టమే కావచ్చు. కానీ, గందరగోళంగా ఉంటుంది. పేరు మారుస్తాను. నీ పేరు రజనీకాంత్‌. నాకెందుకో అనాలనిపించింది. ఈ పేరుతో నువ్వు ఖ్యాతి తెచ్చుకుంటావు’ అని మార్చారు బాలచందర్‌.

నాట్య తారగా విశేషఖ్యాతి తెచ్చుకున్న జయమాలిని పేరు అదికాదు. ఆమె పేరు అలమేలు. దర్శకుడు రామన్న ‘నువ్వు బాగా నాట్యం నేర్చుకున్నావు. మంచి నాట్యకత్తెవి కావాలి. హేమమాలిని గొప్ప డ్యాన్సర్‌ కనుక, అంత మంచి మాలినిని తీసుకుని, జయ శబ్దం కలుపు. బాగుంటుంది’ అని హితవు పలికి ‘జయమాలిని’గా పేరు మార్చారు.

కన్నడ చిత్రరంగంలో దర్శకురాలిగా కూడా రాణించిన జయంతి పేరు కమలకుమారి. ‘జగదేకవీరుని కథ’లో నటించినప్పుడు అదే పేరు తెరపై వేశారు. కానీ, సినిమాలు ఎక్కువగా రావడంలేదని, పేరు మార్చుకుంటే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది. ‘జ’ అనే అక్షరంలో జయం ఉందని జయంతిగా పేరు మార్చుకున్నారామె.

నూతన్‌ ప్రసాద్‌ పేరు వరప్రసాదరావు. ‘ముత్యాల ముగ్గు’లో ఈ పేరే. ఆయన అప్పట్లో మద్యానికి బానిసై ఆరోగ్యం పాడు చేసుకున్నారు, నటుడిగా అవకాశాలు రాలేదు. తర్వాత మద్యపానం పూర్తిగా నిషేధించుకుని ‘‘ఇప్పుడు నేను కొత్త ప్రసాదరావుని’’ అని నూతన్‌ ప్రసాద్‌గా మార్చుకున్నారు. కవిత(ఒకప్పటి హీరోయిన్‌) అసలు పేరు కృష్ణకుమారి. ‘ఓ మంజూ’ సినిమాలో ఆమెకి మంచి పాత్ర ఇస్తూ దర్శకుడు శ్రీధర్ ‘ఒక కృష్ణకుమారి ఉన్నారు. మూడు అక్షరాల పేరైతే ముచ్చటగా ఉంటుంది. ‘కవిత’గా మార్చుకో’ అని సలహా ఇచ్చారు.

ఇక శివశంకర వరప్రసాద్‌(చిరంజీవి), భక్తవత్సలం నాయుడు(మోహన్‌బాబు), భూపతి రాజు రవి శంకర్‌ రాజు(రవితేజ), లక్ష్మీ నరసింహారావు(సుత్తివేలు), ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం(ఏవీఎస్‌), డయానా మరియం కురియన్‌(నయనతార), విజయలక్ష్మి(రంభ), సుజాత(జయసుధ), లలిత రాణి(జయప్రద), విజయలక్ష్మి(సిల్క్‌ స్మిత)ఇలా ఎందరో తమ అసలు పేరుతో కాకుండా సినిమా పేరుతో ఖ్యాతి పొందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని